Friday, February 21, 2025
Homeజాతీయంఅర్ధరాత్రి నిర్ణయంఅవమానకర చర్య

అర్ధరాత్రి నిర్ణయంఅవమానకర చర్య

. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారు
. సీఈసీ ఎంపికపై రాహుల్‌ తీవ్ర విమర్శలు

న్యూఢల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషన్‌గా (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ ఎంపికైన కొద్ది గంటలకే ఎంపిక కమిటీలో సభ్యుడైన ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సీఈసీ ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతుం డగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం అగౌరవ చర్య అవుతుందన్నారు. ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత, సోమవారం రాత్రి ప్రభుత్వం జ్ఞానేష్‌ కుమార్‌ను కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) గా నియమించిన సంగతి విదితమే. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా రాహుల్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘సీఈసీ ఎంపిక కమిటీ సమావేశంలో మోదీ, అమిత్‌షాకు అభ్యంతరాల నివేదకను అందజేశాను. కార్యనిర్వాహక వర్గం జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల సంఘం కమిషనర్‌, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ కీలకం. ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించడం ద్వారా మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. ఇది ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై లక్షలాది మంది ఓటర్ల ఆందోళనకు కారణమవుతోంది’ అని రాహుల్‌ అన్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, జాతి నిర్మాతల సిద్ధాంతాలకు కట్టుబడటం, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నేతగా తనకు ఉందని రాహుల్‌ చెప్పారు. కమిటీ కూర్పు, ప్రక్రియను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై మరో 48 గంటల్లోనే విచారణ జరగాల్సి ఉండగా రాత్రికి రాత్రి ప్రధాని, హోంమంత్రి నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఎంపిక కమిటీ సభ్యులుగా ఉండగా… సోమవారం కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ… ఈ విషయంలో సుప్రీంకోర్టు విచారణను దృష్టిలో ఉంచుకుని సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసమ్మతి నోట్‌ను కూడా సమర్పించారు. ‘ఈ కమిటీ కూర్పు ప్రక్రియను సవాలు చేసిన పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టు విచారించనున్న తరుణంలో ఈ కమిటీ తదుపరి సీఈసీని ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించడం సంస్థలకు, మన జాతీయ నాయకులకు అగౌరవంగా, అ మర్యాదగా ఉంటుంది’ అని రాహుల్‌ అసమ్మతి నోట్‌లో రాశారు. మార్చి 2, 2023న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో… సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కూడిన కమిటీ చేపట్టాలని ఆదేశించిందని రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్‌ రాశారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు సంబంధించి ఓటర్లలో ఆందోళనను ఈ తీర్పు ప్రతిబింబిస్తుందని ఆయన జోడిరచారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ సైతం సోమవారం ఇదే రకమైన డిమాండ్‌ చేసింది. సీఈసీ ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈనెల 19న తుది తీర్పు రానుందనీ, అంతవరకూ సీఈసీ నియామక ప్రక్రియను వాయిదా వేయాలని ఆ పార్టీ కోరింది. అయితే… యథాప్రకారం భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌గా వివేక్‌ జోషి పేర్లను త్రిసభ్య కమిటీ ఖరారు చేసింది. ఆ పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కమిటీ పంపగా ఆమె వెంటనే ఆమోదించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు