. అభివృద్ధిలో కొత్తగూడెం ఆదర్శం
. కూనంనేని సాంబశివరావు
. సీసీ రోడ్లు, డ్రెయిన్లకు శంకుస్థాపన
విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: అభివృద్ధి పనుల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికి ఆదర్శనంగా నిలుస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని బుధవారం కొత్త గూడెంలోని కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కంటి నగర్, పాలకోయ తండా, నవభారత్, జగ్గుతండా, గోవర్ధనగిరి కాలనీ, కొమ్ముగూడెం గొల్లగూడెం, సీతారామపట్నం, ప్రియదర్శిని కాలనీలో రూ.2.65కోట్లతో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల పనులు ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో నియోజవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూనంనేని తెలిపారు. బస్తీలు, గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష లేదన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని, అవినీతికి అవకాశం ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో అభివృద్ధి నిధులు మంజూరు అయినట్లు చెప్పారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, అందుకోసం కృషి చేస్తున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, డి.సుధాకర్, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు శనగారపు శ్రీనివాసరావు, ఇట్టి వెంకట్రావు చెరుకూరి శేఖర్, మన్నెం వెంకన్న, వల్లపు యాకయ్య, గౌస్, ఎస్‌ఏ రెహమాన్, కరీం, అహ్మద్ జానీ, కొత్త సురేశ్, బిక్కులాల్, బీవీ సత్యనారాయణ, జకరయ్య, మాజీ సర్పంచ్ భూక్యా విజయ్‌కుమార్, వేములపల్లి రాజశేఖర్, ఆదినారాయణ, రాజేష్, జిలానీ, శంకర్ నాయక్, రవి, రాంబాబు, బాలు, కుమార్, ప్రసాద్, తంతానపల్లి వెంకన్న, జలీల్, పైడిపల్లి దుర్గా మహేష్, కందుకూరి రాము, ఉండేటి శాంతివర్ధన్, రాందాస్, ఉపేందర్, సీపీఎం జిల్లా నాయకులు అన్నారపు సత్యనారాయణ, దొడ్డ రవి, తులసీరామ్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.