ఐక్యంగా ఉంటేనే ప్రపంచ శాంతి, సుస్థిరత సాధ్యం
సెలాక్ సదస్సు ప్రారంభోత్సవంలో జిన్‌పింగ్
బీజింగ్: ఆధిపత్యం ప్రదర్శిస్తే ఏకాకి అవుతారని, ఐక్యంగా ఉంటేనే ప్రపంచ శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందేశమిచ్చారు. చైనా రాజధాని బీజింగ్‌లోని నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్, కరేబియన్ స్టేట్స్ (సెలాక్) సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ శాంతి, సుస్థిరత పరిరక్షణతో పాటు అభివృద్ధి, సౌభాగ్యం కావలంటే ఐక్యంగా ఉండాలని ప్రపంచ దేశాధినేతలకు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సుంకాల యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరని పునరుద్ఘాటించారు. వేధింపులకు పాల్పడుతూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే ఏకాకి అవుతారని హెచ్చరించారు. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలతో సంబంధాలను మరింతగా బలపర్చుకోవాలని చైనా భావిస్తోందని చెప్పారు. కీలక అంశాలు, ప్రధాన సమస్యలపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. పరిపాలనా అనుభవాలను పంచుకోవడం కోసం ఏటా చైనాకు వచ్చేలా ‘సెలాక్’ సభ్య దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులు 300 మందికి రాగల మూడేళ్లలో చైనా ఆహ్వానాలు పంపుతుందని జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల మద్య వాణిజ్యం 2024లో మొదటిసారిగా 500 బిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు తెలిపారు. శతాబ్దం ఆరంభంలో జరిగిన వాణిజ్యంతో పోల్చితే 40 రెట్ల కంటే ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ అమలు కోసం లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలతో కలిసి పని చేస్తామన్నారు. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అంతర్జాతీయ పారిశ్రామిక, సరఫరా గొలుసుల సక్రమ సజావు నిర్వహణ, బహిరంగ
సహకార అంతర్జాతీయ వాతావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తామని జిన్‌పింగ్ తెలిపారు. బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పురోగతి, వ్యూహాత్మక అభివృద్ధి కోసం పరస్పరం మరింతగా సహకరించుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందంలో ముందడుగు… టారిఫ్‌లకు తాత్కాలిక విరామం క్రమంలో చైనా`సెలాక్ నాల్గవ మంత్రుల స్థాయి సదస్సులో జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. తొలుత ప్రపంచ దేశాధినేతలకు జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు. సదస్సు నేపథ్యంలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధానిగా తిరిగి ఎన్నికైన ఆంటోని అల్బనీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వాతో భేటీ అయన జిన్‌పింగ్ అనేక అంశాలపై చర్చించారు.