న్యూదిల్లీ: మరో రెండు రోజుల్లో దేశ రాజధాని దిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి సోమవారమే ఆఖరు తేదీ కావడంతో రాజకీయం వేడెక్కింది. చివరి రోజు ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేపట్టాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా కొంతమంది దిల్లీ విద్యార్థులతో ముచ్చటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తమ విజయంగా చెప్పే విద్యా విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘దిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను వారు (ఆమ్ ఆద్మీ పార్టీ) అనుమతించడం లేదని విన్నాను. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పైతరగతు లకు పంపిస్తున్నారట. ఎందుకంటే ఫలితాలు సరిగా రాకపోతే… ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారు. ఇలా విద్యావ్యవస్థలోనూ వారు అవినీతికి పాల్పడుతున్నారు’ అని విద్యార్థులతో ప్రధాని అన్నారు. ఆప్ ప్రతిష్ఠను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు.