నిర్వహణలోపంతో ఆసుపత్రుల మనుగడ ప్రశ్నార్థకం
సిబ్బంది లేక 20 ఆయుర్వేద, 16 హోమియా డిస్పెన్సరీల మూత
ఆరేళ్లుగా నిర్మాణానికి నోచుకోని పరిశోధన కేంద్రం
వంద కోట్లతో అమరావతిలో ఏర్పాటుకు కూటమి సర్కార్ యత్నం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సాంప్రదాయక, పురాతన వారసత్వ వైద్య ఆరోగ్య విధానాలను కొనసాగించే ఆయుష్ విభాగం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి సాంప్రదాయక ప్రత్యామ్నాయ వైద్య విధానాల పర్యవేక్షణకు ఏర్పడిరదే ఆయుష్ విభాగం. దీనికి అవసరమైన నిధుల కేటాయింపుల్లేక, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయక దీని ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆయుష్ వైద్య విధానాల గురించి వేదికలపై గొప్పగా చెప్పే పాలకులు ఆచరణలో శ్రద్ధ కనబర్చకపోవడంతో వీటి మనుగడ రోజురోజుకూ దిగజారుతోంది. రాష్ట్రంలో 3 ఆయుర్వేద ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి, 374 డిస్పెన్సరీలున్నాయి. అలాగే హోమియో ఆసుపత్రులు 3, బోధన ఆసుపత్రులు 3, డిస్పెన్సరీలు 245 ఉన్నాయి. యునాని ఆసుపత్రులు 2, డిస్పెన్షరీలు 93 ఉండగా, నేచురోపతి 25 డిస్పెన్షరీలున్నాయి. ఆయుర్వేద ఆసుపత్రుల్లో 155, హోమియోలో 190, యునానిలో 20 కలిపి మొత్తం 365 పడకలున్నాయి. ప్రస్తుతం వీటిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14లక్షల మంది పేషెంట్లు వైద్యం పొందుతుండగా, 10వేల మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా 20 ఆయుర్వేద, 16 హోమియో డిస్పెన్సరీలు పని చేయడం లేదు. మిగిలిన వాటి పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 67 ఆయుర్వేద వైద్య అధికారుల పోస్టులకు కాను, 50 మంది వైద్యాధికారులు నియమితులయ్యారు. ఆయుర్వేద విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 327 వైద్యాధికారుల పోస్టులు వుంటే అందులో 67 ఖాళీగా ఉన్నాయి. హోమియో వైద్య విభాగంలో 190 పోస్టులు ఉంటే… అందులో 62 ఖాళీగా ఉన్నాయి. యునాని విభాగంలో 73 పోస్టులకు గాను 32 ఖాళీలు వున్నాయి. పారామెడికల్ సిబ్బంది అయితే 323 పోస్టులకు గాను 272 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 1087 పోస్టులకు 458 (దాదాపు 40 శాతం మేర) పోస్టులు ఖాళీగా ఉండడం ఆయుష్ విభాగ పనితీరును తేటతెల్లం చేస్తోంది. ఇక 2018లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం మంజూరు చేయగా, ఆరేళ్లుగా అది అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. దీని ఏర్పాటుకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం గన్నవరం నియోజకవర్గంలోని కొండపావులూరు గ్రామంలో 25 ఎకరాల భూమిని కేటాయించింది. దీని ప్రారంభోత్సవానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న దశలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి ఆ 25 ఎకరాల స్థలాన్ని జగనన్న కాలనీ కోసం కేటాయించడం జరిగింది. ఆయుష్ విభాగం పట్ల నాటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. దీనిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరలా తెరమీదకు తీసుకువస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రాన్ని రూ.100 కోట్లతో అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో వెల్లడిరచారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 138 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మరోవైపు ఆయుష్‌కు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2025`26 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.291 కోట్లు కేటాయింపులు కూడా చేశారు. సాంప్రదాయ, ప్రకృతి వైద్యానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం పటిష్టతకు అవసరమైన చర్యలు వేగవంతంగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.