Thursday, April 3, 2025
Homeసంపాదకీయంఆర్‌ఎస్‌ఎస్‌ ఆధిపత్యాన్నిఅంగీకరించిన మోదీ

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధిపత్యాన్నిఅంగీకరించిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్‌ వెళ్లి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ తో చర్చలు జరిపారు. బీజేపీ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఛత్రఛాయల్లో నడిచే రాజకీయ పార్టీ కనక ఆ పార్టీ ప్రతినిధిగా ప్రధానమంత్రి నాగపూర్‌ వెళ్లడంలో ఆశ్చర్యం లేదు. ఇంతకు ముందు బీజేపీ ప్రభుత్వానికి మూడు సార్లు నాయకత్వం వహించిన అటల్‌ బిహారీ వాజపేయి కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన వారే. వాజపేయి లాగే మోదీ కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. శ్రేణుల నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వారే. అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల లాంటివి ఉంటాయి. కానీ బీజేపీ మాత్రం తమది స్వచ్ఛంద సంస్థ అని, రాజకీయాలతో సంబంధం లేదని ఎంతగా చెప్పుకున్నా అది ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు అనుబంధ సంస్థే. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం ఆర్‌.ఎస్‌.ఎస్‌. అంతిమ లక్ష్యం. ఆ మాట చెప్పకుండానే మోదీ అదే పని చేస్తున్నారు. తాను ఆర్‌.ఎస్‌.ఎస్‌. అడుగుజాడల్లో నడుస్తున్నందువల్ల ఇక తాను ఆ సంస్థకు లొంగి ఉండవలసిన అగత్యం లేదని మోదీ భావిస్తున్నట్టున్నారు. అందుకే ఆయన మోహన్‌ భగవత్‌ను ఖాతరు చేయని సందర్భాలున్నాయి. అలాగే అన్యాపదేశంగా మోహన్‌ భగవత్‌ ప్రధాన మంత్రి మోదీకి చురకలంటించిన సందర్భాలూ ఉన్నాయి. మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టి పదకొండేళ్లు కావొస్తోంది. కానీ ఆయన ఒక్క సారి కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యాలయాన్ని సందర్శించలేదు. అప్పుడప్పుడు యథాలాపంగా ఎదుట పడినప్పుడు మోహన్‌ భగవత్‌తో ముచ్చటించిన ఉదంతాలు ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా నాగపూర్‌ వెళ్లి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యాలయం సందర్శించి ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులతో భేటీ కావడం ఇదే మొదటి సారి. అరుదైన ఈ పర్యటనవల్ల అధికారంలో ఉన్న బీజేపీ తన మాతృసంస్థ అయిన ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో మరింత సన్నిహితంగా మెలగుతుందా, ఆ సంస్థ పీఠాధిపతులు ఇచ్చే ఆదేశాలను పాటిస్తుందా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ప్రధానమంత్రి పదవికి ఆయనను నికరంగా అభ్యర్థిగా ప్రకటించవలసి ఉన్న సమయంలో మోదీ నాగపూర్‌ వెళ్లారు. సార్వత్రిక ఎన్నికలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించడానికి ఏ మేరకు తోడ్పడ్డారు అన్న అంశం మీద కూడా చర్చ జరిగింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు ఎన్నికల సమయంలో దీక్షతో పని చేయనందువల్లే బీజేపీ 240 స్థానాలతో సంతృప్తి పదాల్సి వచ్చింది అన్న మాటలు కూడా వినిపించాయి. ఏమైతేనేమి కొయ్యకాళ్ల ఊతంగా మోదీ మూడో సారి ప్రధాని అయిపోయారు. మెజార్టీ తగ్గినందువల్ల భగవత్‌ మాటల్లో చెప్పాలంటే ఆయనలో గూడు కట్టుకున్న అహంకారం పాళ్లు ఏ మాత్రం తగ్గినట్టు లేదు. నాగపూర్‌లో మోదీ కార్యక్రమాలు ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యవస్థాపకుడు కేశవ్‌ బలీరాం హెడ్గేవార్‌ స్మృతి మందిరం సందర్శించడంతో ప్రారంభం అయింది. ఆదివారం హెగ్డేవార్‌ జన్మ దినం కూడా. ఆ సమయంలో ఆయన వెంట ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ కూడా ఉన్నారు. అప్పుడు వారు యథాలాపంగా మాట్లాడుకున్నారు. ఆ తరవాత మోదీ డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ బౌద్ధం స్వీకరించిన దీక్షా భూమిని కూడా సందర్శించారు. షరా మామూలుగా అంబేద్కర్‌ మీద మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం మనకు గౌరవాన్ని, సమానత్వాన్ని ప్రసాదించింది అని మోదీ చెప్పారు. నిజానికి సంఫ్‌ు పరివార్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన దాఖలా ఇప్పటి వరకూ లేదు. అధికారం అందిపుచ్చుకోవడానికి మోదీతో సహా బీజేపీ నాయకు లందరూ రాజ్యాంగాన్ని అప్పనంగా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. అధికారం దక్కాలంటే రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్టు కనిపించాల్సిందే. మోదీ అంబేద్కర్‌ మనకు సమానత్వాన్ని ప్రదర్శించామంటున్నారు. మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను పక్కకు తోసేస్తున్న మోదీ సమానత్వం గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. మరో సందర్భంలో సాక్షాత్తు అంబేద్కరే దిగి వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరు అని మోదీ అన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రవేశ పెట్టడం సంఫ్‌ు పరివార్‌ లక్ష్యం అయినప్పుడు, ఆ లక్ష్యానికి మోదీ కట్టుబడి ఉన్నప్పుడు ఆయన చెప్పే మాటలను నమ్మడం కుదరదు. గౌరవం, సమానత్వం ఇచ్చినందుకు తరతరాల దేశవాసులు అంబేద్కర్‌కు కృతజ్ఞులుగా ఉంటారు అన్న మోదీ మాట కూడా ఓ వైపరీత్యమే. వరదలు, భూకంపాలు, మరీ ముఖ్యంగా కుంభ మేళాలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తల సేవాతత్పరత మానవాళికి గొప్ప సేవ అని కూడా మోదీ అన్నారు. ఆ సేవ ఆర్‌.ఎస్‌.ఎస్‌. లక్షణాల్లో ఒకటి. దాన్ని కాదనడానికి వీల్లేదు.
ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఇప్పుడు మహా వట వృక్షంగా తయారైందని కూడా అన్నారు. ఈ వటవృక్షం సామాన్యమైంది కాదని, ఇది శాశ్వతమైన సంస్కృతికి, ఆధుని కతకు చిహ్నం అని మోదీ అన్నారు. జాతి బానిస మనస్తత్వాన్ని వదిలి ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ఇటీవల 2వేల మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న భూకంపంలో సాయం అందించిన భారత్‌ దక్షిణార్థ గోళంలోని దేశాల వాణిగా మారిందని మోదీ అన్నారు. ఇటీవల ఆయన అమెరికా సందర్శించినప్పుడు ట్రంప్‌ చూపిన నిరాదరణను మోదీ ఎంత సునా యాసంగా మరిచిపోగలరో! ప్రతి పర్యటనను మోదీ అద్భుతంగా చూపించ గలరు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడాన్ని అలాగే చూపుతున్నారు. మోదీ నాగపూర్‌లో మాధవ్‌ నేత్రాలయ శంకుస్థాపన సభకూ హాజరయ్యారు. ఆ సమావేశంలో మోహన్‌ భగవత్‌ ప్రసంగిస్తున్నంత సేపు అత్యంత క్రమశిక్షణగల ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తగా ధీర గంభీర వదనంతో కూర్చున్నారు. ఈ సభకు మోదీని ఆహ్వానిస్తే ఆయన వస్తారో లేదో చూద్దాం అన్నట్టుగా ఆర్‌.ఎస్‌. ఎస్‌. వ్యవహార ధోరణి కనిపించింది. లేదంటే మోదీ నాగపూర్‌ సందర్శనకు అనువైన కార్యక్రమం ఏదైనా రూపొందించండి అని ప్రధాన మంత్రి కార్యాలయం కోరినా ఆశ్చర్యపడక్కర్లేదు. దిల్లీలో రూ.150 కోట్లు వెచ్చించి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఓ ‘‘భవ్యమైన’’ కార్యాలయం నిర్మించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్‌ షా, జె.పి.నడ్డా, రాజ్‌ నాథ్‌ సింగ్‌ లాంటి ప్రముఖులు వేదిక మీద కనిపించారు. కానీ మోదీ ఆ సభలో లేరు. అయినప్పటికీ మోదీ నాగపూర్‌ దాకా వెళ్లి మోహన్‌ భగవత్‌ దర్శనం చేసుకున్నారు. భగవత్‌తో మోదీ చర్చల్లో ఏం జరిగింది అన్న సమాచారం లేదు. అయితే బీజేపీ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆధిపత్యాన్ని అంగీకరిస్తుంది అన్న సందేశం మాత్రం స్పష్టంగానే వ్యక్తమైంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌., బీజేపీ ప్రభుత్వానికి మధ్య సంభాషణ అవసరం ఉందని మోదీ చెప్పడంలో అంతరార్థం ఇదే. మోదీ, భగవత్‌ ఏం మాట్లాడుకున్నారో అధికారికంగా బయటకు రాలేదు. ఈ విషయాన్ని చెప్పగలిగింది నితిన్‌ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ మాత్రమే. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరూ అన్న అంశం కూడా చర్చకు వచ్చి ఉండొచ్చు. మార్చిలో కొత్త అధ్యక్షుడెవరో తేలుతుందన్నారు. మార్చి ముగిసింది. బీజేపీ కొత్త అధినేత ఎవరో ఇంకా తేలలేదు. ఇంతకాలం మోదీ పేరెత్తకుండానే భగవత్‌ పరోక్ష విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలాంటి వాటికి తెర పడ్తుందో లేదో తెలియదు. కానీ మోదీ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యాలయానికి వెళ్లడం ఒక విధంగా లొంగుబాటుగానే కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు