ఎం కోటేశ్వరరావు
ఉచిత పథకాలు, నగదు బదిలీల వంటి రాజకీయ పార్టీల వాగ్దానాల కారణంగా ప్రజలు సోమరులుగా మారుతున్నారని, పరాన్నజీవులవు తున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు గత బుధవారం వ్యాఖ్యా నించారు. చిత్రం ఏమిటంటే ఇలాంటి వాటి గురించి కేసులు వేసేవారు ఉంటారు తప్ప ప్రోత్సాహకాల పేరుతో వేళ్లమీద లెక్కించదగిన కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, బాంకు అప్పుల మాఫీలు రికార్డు స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్నా అప్పుల గురించి ఎవరైనా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారా ? పోనీ న్యాయమూర్తులు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారా అంటే అదీ కనపడదు. అప్పులు తెచ్చేది ఎందుకు అంటే అభివృద్ధి కోసం అని అధికార పార్టీ నుంచి తడుముకోకుండా చెప్పే సమాధానం. ఆ మేరకు దాని ఆనవాళ్లు లేవేమి అంటే ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, రానున్న రోజుల్లో చూడండి అంటారు. స్వాతంత్య్రం తరువాత దేశాన్ని పాలించిన ప్రధానులందరూ కలసి 2004 నాటికి కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిన అప్పు రు.17,79,763 కోట్లు. పదేళ్ల్ల మన్‌మోహన్ సింగ్ పాలనలో 2014మార్చి నాటికి బడ్జెట్ పత్రాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిపోయిన అంతర్గత, విదేశీ అప్పుల మొత్తం రు.55,87,149 కోట్లు, అది 2025 మార్చి నాటికి రు.185.11లక్షల కోట్లని, 2026 మార్చి నెలాఖరుకు రు.200.16లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. పదేళ్ల్ల క్రితం, ఇప్పుడూ కూడా చర్చ అభివృద్ధి మీదే. పదేళ్ల యూపీఏ పాలనలో అదనంగా 38లక్షల కోట్ల అప్పు చేస్తే దేశాన్ని అప్పుల పాలు చేశారు, అభివృద్దీ చేయలేదు అంటూ నరేంద్రమోదీ నాడు ధ్వజమెత్తారు. తన ఏలుబడిలో 2025మార్చినెలతో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి అదనంగా చేసిన అప్పు 129లక్షల కోట్లు. ఇది చాలక ఈ ఏడాది మరో 15.68లక్షల కోట్లు కొత్తగా అప్పులు తీసుకొనేందుకు నిర్ణయించారు. తీరా ఇంత చేసినా 80కోట్ల జనాభా ఉచితంగా నెలనెలా ఐదు కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా తీసుకుంటే తప్ప గడవని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మరో 22 సంవత్సరాల్లో (2047నాటికి) దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. నమ్మే మాటలేనా ?
తమ పాలనలో విదేశీ అప్పులు పెద్దగా తీసుకోలేదని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అంకెలేమి చెబుతున్నాయి. 2014 మార్చి నాటికి విదేశీ అప్పుల మొత్తం మన కరెన్సీలో రు.1.82లక్షల కోట్లు, ఈ మొత్తం 2026 మార్చి నాటికి 6.63లక్షల కోట్లకు పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్‌లో చెప్పారు. గత పది సంవత్సరాలలో ఇంత మొత్తం అప్పులు తెచ్చిందెవరు ? మోదీ ఏలుబడిలో రూపాయి విలువ 62 నుంచి 86కు పతనమైంది. దీని వలన జరిగిందేమిటి ? పదేళ్ల క్రితం మోదీ ఒక డాలరు విదేశీ అప్పు తీసుకుంటే దాన్ని మరుసటి ఏడాది చెల్లించాలంటే నాడున్న మారకపు విలువ ప్రకారం రు.62, దానికి నామమాత్రంగా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. అదే డాలరును ఎలాంటి వడ్డీ లేకుండా పదేళ్ల తరువాత ఇచ్చే ఒప్పందం మీద ఎవరైనా ఉదారంగా అప్పు ఇస్తే ఇప్పుడు 86 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మోదీ పదవీకాలం ముగిసే 2029 నాటికి వందకు పతనమైనా ఆశ్చర్యం లేదు. అధికారానికి వచ్చిన వెంటనే అప్పు తీర్చి ఉంటే ఇంత ఆముదం జనానికి అంటేది కాదు కదా ! ఇదీ మోదీ ఘనత.
కార్పొరేట్లు తమకు మరిన్ని రాయితీలతో పాటు తాము తయారు చేసే వస్తువులు, అందించే సేవలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీలు ఇవ్వాలని, కొందరైతే కార్మికులకు వేతనాలు పెంచాలని కూడా సూచించారు. పన్నెండు లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దీని వలన ఏటా లక్ష రూపాయలవరకు ఆలోపు రాబడి ఉన్నవారికి మిగులుతుందని అంచనా. ఈ మొత్తంతోనే దేశంలో పడిపోయిన వినియోగం పెరుగుతుందా ? ఈ స్వల్ప మిగులుతో గతంలో చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చు, వస్తువులే కొనాలని లేదు. లేదా పెరిగిన ఖర్చులకు సరిపెట్టుకోవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, స్వదేశీ పెట్టుబడిదారులకు మరింత ఊతం ఇచ్చే పేరుతో కార్పొరేట్ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అన్నారు. ఈ రాయితీలతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల లాభాలు విపరీతంగా పెరిగాయి, వాటాదార్లకు డివిడెండ్లు వచ్చాయి తప్ప ఆ మొత్తం పెట్టుబడుల రూపంలో తిరిగి రాలేదు, ఆ మేరకు ఉపాధి కూడా పెరగలేదు. అదే జరిగి ఉంటే వస్తువినియోగం పెరిగి ఉండేది, రూపాయి రూపాయి లెక్కించుకోవాల్సి వచ్చేది కాదు.
దేశంలో 2011జనాభా లెక్కల ప్రకారం రైతులుగా నమోదైన వారు 11.88 కోట్లు, వ్యవసాయ కార్మికులు 14.43 కోట్లు. కార్పొరేట్ పన్ను చెల్లించే సంస్థలు 2021లో 9,67,054. నిర్మలా సీతారామన్ స్వయంగా వెల్లడిరచిన దాని ప్రకారం పైన పేర్కొన్న కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం ఏటా రు.1.45 లక్షల కోట్ల రాబడి కోల్పోతున్నది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో పెట్టుబడి ఖర్చులకు ఏటా 10.32 కోట్ల మంది రైతులకు 63వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇస్తున్నది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అంటే ఇదే. రైతులు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారా, కార్పొరేట్ సంస్థలు ఎక్కువ మందికి పని చూపుతున్నాయా ? ఎందుకీ వివక్ష ? రైతులకు ఇచ్చే ఆ మొత్తంతో కార్పొరేట్లు విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. దానిలో కూడా కార్పొరేట్లకు లాభాలు, ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాబడి వస్తుంది.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న వాగ్దానాన్ని పాక్షికంగా నెరవేర్చినా జిడిపి వృద్ది రేటు, కొనుగోలు శక్తి దిగజారి ఉండేది కాదు.పని చేసేందుకు ఏ దేశంలోనూ లేనంత మంది యువత ఉన్నదని గొప్పలు చెప్పుకోవటం తప్ప వారికి ఉపాధి సంగతి తరువాత గత పదేళ్లలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి కనీసం నైపుణ్యం అయినా కల్పించారా అంటే అదీ లేదు. నైపుణ్యశిక్షణ పేరుతో తగలేసిన వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద కుంభకోణంగా చెప్పవచ్చు. నైపుణ్య భారత్ కార్యక్రమం కింద కోటీ 40లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, మరో 54లక్షల మందికి నైపుణ్యాలను పెంచటం లేదా తిరిగి శిక్షణ ఇచ్చామని 2024లో కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్(ఎన్‌ఎస్‌డిసి) 2024లో వెల్లడిరచిన అధ్యయన వివరాల ప్రకారం దేశంలో 10.3కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం కాగా 7.4కోట్ల మందే ఉన్నారు. మారుతున్న అవసరాలకనుగుణంగా నిన్న నేర్చుకున్న నైపుణ్యం రేపటికి పనికి రావటం లేదు. అందువలన వీరిలో ఎందరు పనికి వస్తారన్నది కూడా ప్రశ్న.
గత పది సంవత్సరాలలో ఇంత మొత్తం అప్పులు తెచ్చిందెవరు ? మోదీ ఏలుబడిలో రూపాయి విలువ 62 నుంచి 86కు పతనమైంది. దీని వలన జరిగిందేమిటి ? పదేళ్ల క్రితం మోదీ ఒక డాలరు విదేశీ అప్పు తీసుకుంటే దాన్ని మరుసటి ఏడాది చెల్లించాలంటే నాడున్న మారకపు విలువ ప్రకారం రు.62, దానికి నామమాత్రంగా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. అదే డాలరును ఎలాంటి వడ్డీ లేకుండా పదేళ్ల తరువాత ఇచ్చే ఒప్పందం మీద ఎవరైనా ఉదారంగా అప్పు ఇస్తే ఇప్పుడు 86 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మోదీ పదవీకాలం ముగిసే 2029 నాటికి వందకు పతనమైనా ఆశ్చర్యం లేదు