Monday, February 3, 2025
Homeఆంధ్రప్రదేశ్‘ఇంజినీరింగ్‌’ నాణ్యత పెంచాలి

‘ఇంజినీరింగ్‌’ నాణ్యత పెంచాలి

కళాశాల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కోరారు. ఉండవల్లి నివాసంలో ఇంజినీరింగ్‌ కళాశాలల మేనేజ్‌ మెంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను కలిశారు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈసందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ… గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమికస్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యలో గత పదేళ్లుగా సంస్కరణలు లేవని, తాను మంత్రి అయ్యాక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది ఆర్‌టీిఎఫ్‌ స్కాలర్‌ షిప్‌ లకు సంబంధించి తొలివిడతలో రూ.788 కోట్లకు గాను, 571.96 కోట్లు విడుదల చేశామని, రెండు, మూడు రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌, ఆర్‌అండ్‌డీ, ఇన్నొవేషన్స్‌ పై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్లేస్‌ మెంట్స్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత ఒక రోజు వర్క్‌ షాప్‌ నిర్వహించి ఇంజినీరింగ్‌ విద్య నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని లోకేశ్‌ అన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రతినిధులు మాట్లాడుతూ… విద్యార్థు లకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సొమ్మును ఎప్పటికప్పుడు క్యాలెండర్‌ ప్రకారం విడుదల చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజులు సవరించాలని కోరారు. అలాగే ఎంసెట్‌ షెడ్యూలును నిర్ణీత సమయం ప్రకారం విడుదల చేయాలని, మూడో కౌన్సెలింగ్‌ విధానాన్ని అమలుచేయాలని కోరారు. విద్యార్థుల ప్లేస్‌ మెంట్స్‌ విషయంలో ప్రభుత్వం చొరవచూపాలని, ఇందుకోసం ఆయా కంపెనీలను రప్పించి జాబ్‌ మేళాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి సాను కూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, పర్చూరి అశోక్‌ బాబు, వేపాడ చిరంజీవి, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజెస్‌ మేనేజ్‌ మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్‌, మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు