ఆపరేషన్ సిందూర్‌పై మోదీ స్పందన
నేడు అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు
న్యూదిల్లీ: పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు నిర్వహించిన దాడి గురించి వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజుజు ఆ సమావేశం గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘2025 మే 8న ఉదయం 11 గంటలకు దిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్ జి`074లో ప్రభుత్వం అఖిల పక్ష నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది’’ అని ఆయన చెప్పారు. మరోవైపు, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. సౖన్యం నిర్వహించిన ఆపరేషన్‌ను కేబినెట్ ప్రశంసించింది. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భద్రతాబలగాలు చేసిన కచ్చితమైన దాడిగా ఆపరేషన్ సిందూర్‌ను అభివర్ణించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 చోట్లు సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన వివరించారు. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును కేంద్ర మంత్రులు కొనియాడినట్లు తెలిసింది. కాగా కేబినెట్ భేటీకి ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి ప్రధానికి వివరించారు.
ఐటీఐ అప్‌గ్రేడేషన్‌కు రూ.60వేల కోట్లు
ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీఐ అప్‌గ్రేడేషన్ కోసం 60వేల కోట్ల రూపాయల జాతీయ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు, కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి వీరు సమావేశం అయ్యారు. రాష్ట్రపతితో మోదీ సమావేశమైన విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం సోషల్‌మీడియాలో వెల్లడిరచింది. అందుకు సంబంధించిన చిత్రాలను కూడా షేర్ చేసింది.
ప్రధాని విదేశీ పర్యటనలు రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెల మధ్యలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన పర్యటనలు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఇక, రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లోనూ మోదీ పాల్గొనడం లేదని ఇటీవల క్రెమ్లిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్‌కు లేదు: అజిత్ దోవల్
పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో వివిధ దేశాలకు సమచారమిచ్చారు. చైనా విదేశాంగమంత్రితో మాట్లాడుతూ… పరిస్థితులను తీవ్రతరం చేసేలా పాక్ వ్యవహరిస్తే… భారత్ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన ఆయన స్పష్టం చేశారు. అయితే, ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని వెల్లడిరచారు. ఇదే విషయాన్ని అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులకూ డోభాల్ వివరించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలను ఆయన ప్రపంచ దేశాలకు వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అక్కడి ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసిన విధానం వారికి చెప్పినట్లు సమాచారం.