Saturday, February 22, 2025
Homeఇళ్ల స్థలాల కోసం సీపీఐ ధర్నా

ఇళ్ల స్థలాల కోసం సీపీఐ ధర్నా

. తాడిపత్రిలో కదంతొక్కిన కమ్యూనిస్టులు
. తుదిదాకా పోరాటం: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం: కూడు, గుడ్డ, నీడ నినాదంతో సీపీఐ నిరంతరం పేదల పక్షాన పోరాటం చేస్తోందని, రాష్ట్రంలోని 26 జిల్లాలలో మండలం, నియోజకవర్గం, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు విజయవంతంగా ధర్నాలు చేపడుతు న్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం సీపీఐ అధ్వర్యంలో తాడిపత్రి తహసీల్దారు కార్యాలయం ముందు మంగళవారం భారీ ధర్నా జరిగింది. దీనికి ముందు పట్టణంలో సీపీఐ, ప్రజాసంఘాలు, లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ తాడిపత్రి పట్టణ కార్యదర్శి చిరంజీవి అధ్యక్షతన జరిగిన ధర్నాలో రామకృష్ణ మాట్లాడారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చి… ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు వంతున ఆర్థిసాయం చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని, కాలయాపన సరైంది కాదన్నారు. కేవలం తాడిపత్రి పట్టణం, గ్రామీణ ప్రాంతం నుంచి దాదాపు మూడు వేల మంది ఇళ్ల స్థలం కోసం వచ్చారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రామకృష్ణ సూచించారు.
సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీ ప్రధానమైందని రామకృష్ణ గుర్తుచేశారు. పేదలను గుర్తించి పక్కా ఇంటి నిర్మాణం చేపడతామని, ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా చూస్తామని ప్రతి కేబినెట్‌ సమావేశంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది ముందుకు సాగడం లేదన్నారు. పేదలకు ఇంటి స్థలం దక్కేదాకా కమ్యూనిస్టు పార్టీ తోడుగా ఉంటుందన్నారు. అర్జీల రూపంలో ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేర్చి న్యాయం జరిగేదాకా పోరాడతామన్నారు. తాడిపత్రి, మదనపల్లి, కర్నూలు తదితర పట్టణాల్లో ఇప్పటికే ఆందోళన ఉధృతమైందని, ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌ మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో అనేక మంది లబ్ధిదారులు పక్కా ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జిల్లావ్యాప్తంగా ఇదే సమస్య నెలకొందని ఎమ్మెల్యేలు, రెవెన్యూ, హౌసింగ్‌, మున్సిపల్‌ అధికారులు చొరవ తీసుకొని లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. జగన్‌ హయాంలో సెంటు భూమిలో పక్కా ఇల్లు నిర్మిస్తే అవి పేదవాడికి సరిపోలేదని గుర్తు చేశారు. టీడీనీ ప్రభుత్వమైనా పేదల పట్ల ప్రేమ చూపించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చారని, పట్టణాల్లో కేవలం సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటి నిర్మాణానికి లక్షా ఎనభై వేలు మాత్రమే ఇచ్చారని, ఆ మొత్తం చాలకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు. సీపీిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.నారాయణస్వామి, సి.మల్లికార్జున, నాయకులు జె. రాజారెడ్డి, టి.రంగయ్య, బి.కేశవరెడ్డి, వీరభద్రస్వామి, కె.పెద్దయ్య, నీలూరు లక్ష్మయ్య, రామాంజనేయులు, గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు