సత్యకి చక్రవర్తి
లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల తుదిపోరు ఏప్రిల్ 13న జరగనుంది. అధ్యక్ష రేసులో మితవాద పక్షం తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డేనియల్ నొబోవా(38), వామపక్ష అభ్యర్థి లూసియా గొంజాలెజ్ (48) ఉన్నారు. పోటీ వీరిద్దరి మధ్య హోరారి జరుగుతోంది. అధ్యక్షుని పదవీకాలం నాలుగు సంవత్సరాలు. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 9న జరిగన మొదటి రౌండ్ ఎన్నికల్లో నోబోవాకు 44.43 శాతం ఓట్లు రాగా, గొంజాలెజ్ 44.17 శాతం ఓట్లు సాధించారు. మరో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో ఏ అభ్యర్థికీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు లేదా ప్రత్యర్థి కంటే 10 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాకపోతే, అత్యధిక ఓట్ల ఆధారంగా అధ్యక్షుడిని నిర్ణయించడానికి రెండోసారి ఎన్నికలు నిర్వహించాలని ఈక్వెడార్ రాజ్యాంగం పేర్కొంటోంది. ఒపీనియన్ పోల్స్‌లో అధ్యక్షుడు నొబోవా వామపక్ష అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. అయితే తుది రౌండ్‌లో ఇద్దరి మధ్య గట్టిపోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
వామపక్ష అభ్యర్థి లూయిసా గొంజాలెజ్ ప్రముఖ న్యాయవాది. ఆమె మాజీ అధ్యక్షుడు రఫెల్ కొరెయ పాలనలో మంత్రిగా పనిచేశారు. కొరెయ 2007 నుంచి 2017 వరకు ఈక్వెడార్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన పదవీకాలంలో నిరుపేద ప్రజల కోసం, దేశాభివృద్ధికోసం వివిధ సంస్కరణలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు అయనను చుట్టుముట్టడంతో మితవాద శిబిరానికి చెందిన బ్యాంకర్ అయిన లాసో అధ్యక్షపదవి చేపట్టారు. లాసోపైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి లాసోకు అనుమతి లభించలేదు. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ తరఫున డేనియల్ నొబోవా 2023 స్నాప్ పోల్‌లో లెఫ్ట్ వింగ్ అభ్యర్థి గొంజాలెజ్‌ను ఓడిరచి ఎన్నికయ్యారు. లాసో పాలనలో మిగిలిన పదహారు నెలలు మాత్రమే నొబోవా పాలించారు. గొంజాలెజ్ స్పెయిన్ మాడ్రిడ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఆమె జాతీయ అసెంబ్లీ సభ్యురాలు. గొంజాలెజ్ విదేశాల్లో ఉన్నప్పటికీ గురువు కొరెయా తదుపరి కార్యక్రమాన్ని అమలుచేశారు. వామపక్ష అధ్యక్ష అభ్యర్థికి చట్ట పరంగా విస్తృత అనుభవం ఉంది, అయితే నొబోవా దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు 2023లో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఈక్వెడార్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఆయనది ఒకటి.
ఈక్వెడార్‌లో ప్రతి ఓటరు ఓటు వేయడం తప్పనిసరి. ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్‌లో దాదాపు 13.7 మిలియన్ల మంది ఓటర్లలో 83% కంటే ఎక్కువ మంది ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు నివేదించారు. కిడ్నాప్, మాఫియా, అక్రమ రవాణా, పౌరుల భద్రత ఎన్నికల ప్రధాన సమస్యగా ఉంది. ఈక్వెడార్‌లో మహిళలు సాధారణంగా రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన నగరాల్లోని వీధుల్లో సంచరించరు. దేశంలో కిడ్నాప్‌లను నియంత్రించడంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని నోబోవా, గొంజాలెజ్ ఇద్దరూ ఈ ఎన్నికల్లో వివిధ హామీలు గుప్పించారు.
ఏప్రిల్ 13న జరిగే తుది విడత ఎన్నికలకు సిద్ధం కావడానికి అభ్యర్థులకు రెండు నెలలకు పైగా సమయం ఉంది. సంకీర్ణ పార్టీలు, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లు, విద్యార్థులు, చిన్న పార్టీల మద్దతుతో పది శాతం కంటే ఎక్కువ ఓట్లు కూడగట్టే ప్రయత్నాన్ని వామపక్ష అభ్యర్థి చేస్తున్నారు.. మరోపక్క నొబోవా కూడా చిన్న పార్టీలను ఆకర్షిÛంచే ప్రయత్నం చేస్తున్నారు.. రానున్న రెండు నెలల కాలం ఈక్వెడార్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. 2025లో బొలీవియా వంటి లాటిన్ అమెరికన్ దేశాల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. బొలీవియా వంటి వామపక్ష పాలిత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా మద్దతు కోసం మితవాద పక్షం ప్రభుత్వాలు అర్రులు చాస్తున్నాయి. ట్రంప్ విజయంతో దేశంలో మితవాద శక్తులు బలాన్ని సమకూర్చు కుంటున్నాయి. బొలీవియాలో సోషలిజం కోసం వామపక్ష సంకీర్ణ ఉద్యమాలు (ఎమ్‌ఏఎస్) కొనసాగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడి మధ్య విభేదాలు ఎన్నికలకు ముందు పరిష్కారం అయ్యే సూచనలు లేవు.లాటిన్ అమెరికాలోని వామపక్ష శక్తులు ముఖ్యంగా ఈక్వెడార్, బొలీవియాలో అధ్యక్ష ఎన్నికలపై అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. రెండు దేశాల్లో అధ్యక్ష ఎన్నికలు వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోపక్క అమెరికా కార్పొరేట్లు, అమెరికా ప్రభుత్వం రైట్‌వింగ్ పార్టీలకు గట్టి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం లాటిన్ అమెరికాలోని రాజకీయ పరిస్థితుల్లో వామపక్ష శక్తులు, ఇతర ఉదారవాద శక్తుల మధ్య సయోధ్య కుదర్చడం అత్యంత కీలకమైన సమస్యగా నెలకొంది.