Saturday, April 19, 2025
Homeఈపీఎఫ్‌ఓ 3.0తో సేవలు సులభతరం

ఈపీఎఫ్‌ఓ 3.0తో సేవలు సులభతరం

కేంద్ర మంత్రి మాండవీయ
న్యూదిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో డిజిటల్‌గా కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈపీఎఫ్‌ఓ 3.0తో 9 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు. మే లేదా జూన్‌కల్లా కొత్త వెర్షన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రముఖ వార్తా సంస్థ ‘పీటీఐ’కిచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. ఈపీఎఫ్‌ఓ వెర్షన్‌ 3.0తో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు, డిజిటల్‌ కరెక్షన్లు, ఏటీఎం ద్వారా విత్‌డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈపీఎఫ్‌ఓను మరింత సౌకర్యంగా, సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు. క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్‌తో తొలగబోతున్నాయని మాండవీయ తెలిపారు. వేగవంతమైన సెటిల్‌మెంట్ల వల్ల డబ్బులు వారి వారి బ్యాంక్‌ ఖాతాల్లో త్వరగా జమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపీఎఫ్‌ఓ కలిగి ఉందని, ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీ అందిస్తోందని చెప్పారు. సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంక్‌ నుంచైనా పెన్షన్‌ పొందే వెసులుబాటు కల్పించామని, దీనివల్ల 78 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని వివరించారు. అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధానమంత్రి జీవన్‌ బీమా యోజన, శ్రామిక్‌ జన్‌ధన్‌ యోజన వంటి పెన్షన్‌ పథకాలన్నింటినీ ఏకీకృతం చేసి… పెన్షన్‌ కవరేజీని క్రమబద్ధీకరించడం, బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు