Friday, April 4, 2025
Homeవిశ్లేషణ‘ఉక్కు’ కార్మికుల నిర్వీర్యానికి కుట్ర

‘ఉక్కు’ కార్మికుల నిర్వీర్యానికి కుట్ర

చలసాని వెంకటరామారావు

నష్టాలలో ఉన్న విశాఖ ఉక్కును, దానిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంఘటిత శక్తిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ కుట్రలు కొనసాగిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌కు 39వేల కోట్ల రూపాయలు అప్పులుంటే 11,440 కోట్లు ఇస్తామని బడ్జెట్‌కు ముందు కేంద్రం ప్రకటించింది. అయితే, బడ్జెట్‌లో కేవలం రూ.3,295 కోట్లు మాత్రమే కేటాయిం చింది. ఈ విధమైన స్వల్ప కేటాయింపులు స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టేందుకా, లేక విక్రయానికి తదుపరి అడుగుల్లో భాగమా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ స్వల్ప కేటాయింపులతోనే రాష్ట్రంలోని పాలక కూటమి నాయకులు ఏదో ఘనకార్యం సాధించినట్టు చెప్పుకోవడం విచారకరం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. ఇది భారతదేశంలోని అత్యాధునిక పరిశ్రమ. ఎంతో నాణ్యమైన ఉక్కు తయారీలో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులను ఈ సంస్థ గడిరచింది. 2010లో ఈ సంస్థ నవరత్న హోదాను పొందింది. ఈ కర్మాగారం ఆంధ్రుల త్యాగ నిరతికి సాక్షీభూతం. ఈ సంస్థ సాధనకు 1966లో ప్రారంభమైన ఉద్యమంలో 32 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. చివరకు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. 1977 లో నిర్మాణం ప్రారంభం కాగా 1979 లో సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని నిర్మాణం పూర్తికావటానికి 20 ఏళ్లు కాలం పట్టింది. 1990 సెప్టెంబరులో కర్మాగారం ఉత్పత్తిని ప్రారంభించింది. ఎన్నో అడ్డంకులు బాలారిష్టాలు అధిగమించి ఈ సంస్థ ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ శ్రేణి ప్రముఖ ఉక్కు కర్మాగారంగా ప్రతిష్ట పొందింది. ఈ కర్మాగారానికి తొలిదశ నుంచి ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం కార్మికులు ఎక్కువ కాలం నేతృత్వం వహించటంతో పాటు కార్మికులలో పని సంస్కృతిని, సంస్థ పట్ల అంకిత భావాన్ని, జాతీయ ప్రయోజనాలను ప్రోదికొల్పింది.
40 వేల మంది ప్రత్యక్షంగా ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వామ్యం వహిస్తూ గత 5 దశాబ్దాలుగా దేశ ఉక్కు అవసరాలను తీర్చుతున్నారు. నాణ్యత గల ఉక్కు ఉత్పత్తితో ఎంతో ప్రతిష్టను కూడబెట్టారు. ప్రారంభ దశలో కేంద్ర ప్రభుత్వం కేవలం 4,800 కోట్లు మాత్రమే మూలధనంగా ఖర్చు చేసింది. ఇప్పటి వరకు సంస్థ 50 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, డెవిడెండ్ల రూపంలో చెల్లించింది. ఎన్నో లాభాలను ఆర్జించి 15 వేల కోట్లతో ప్లాంటును విస్తరించారు. నేడు మూడు ఫర్నెస్‌లతో 70 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటు పని చేస్తున్నది. ఈ దశలో 2016లో బీజేపీ ప్రభుత్వం ‘‘డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంటు’’ (డిఐపిఎఎమ్‌) ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2018 లోనే విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను అమ్మివేయాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం జపాన్‌ కంపెనీ పోస్కో కంపెనీతో చర్చలు జరిపారు. లక్షల కోట్ల విలువచేసే స్టీల్‌ ప్లాంటు భూములను కారుచౌకగా అమ్మటానికి ప్రతిపాదించారు. దీనిని గ్రహించిన కార్మికులు పోస్కో ప్రతినిధి బృందాన్ని ప్రతిఘటించి ఆందోళన నిర్వహించారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రలను పదేపదే కొనసాగిస్తూనే ఉన్నది. గంగవరం పోర్టులోని విశాఖ ఉక్కు భూములను అదాని పరం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చే ముడిసరుకు తెస్తున్న ఓడలను సముద్రంలోనే నిలిపివేసి అకారణంగా ముడిసరుకు సరఫరాకు తీవ్ర ఆటంకాలు కలుగజేశారు. ముడి ఇనుము నిల్వల కొరత సాకుగా చూపించి రెండు ఫర్నెస్‌లను నిలిపివేశారు. గత ఐదు మాసాలుగా కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగించారు. దీని వలన గాజువాక ప్రాంతంలో అద్దెకుంటున్న కార్మికులు వేలాది మంది ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయారు. ఇప్పటికీి గాజువాకలో లక్షమంది ఖాళీచేసి సమీపంలోని తమ గ్రామాలకు తరలి వెళ్లిపోయారని, ఇదే పరిస్థితి కొనసాగితే గాజువాక ప్రాంతం ఖాళీ అవుతుం దని, పెద్ద సంఖ్యలో వ్యాపార సంస్థలు మూతబడుతున్నా యని స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నాయకులు చెబుతున్నారు. కాంట్రాక్టు కార్మికులు 4,500 మందిని ఒక్కసారిగా తొలగించే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ప్రతిఘటించాయి. దీనితో దశల వారీగా తొలగింపులకు పూనుకుంటున్నారు. ఇటీవల 1500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ప్యాకేజీ పేరుతో శాశ్వత ఉద్యోగులను సైతం ఇంటికి పంపించే చర్యలు చేపట్టారు. స్థానికులను ఉద్యోగాల నుంచి పంపించటం ద్వారా కార్మికుల సంఘటిత శక్తిని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారు. ప్లాంటు నిర్వహ ణకు అవసరమైన నిధులు సకాలంలో కేటాయించ టంలేదు. ఆర్థిక సంస్థలు సాయం చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. చివరకు విశాఖ ఉక్కు దీపం ఆర్పివేయాలనే సంకల్పంతో ప్లాంటును కొడిగట్టించారు. జీవచ్ఛవంగా మార్చివేశారు. కుక్కను చంపాలంటే పిచ్చిదానిగా ముద్రవేయాలి. అలాగే ప్లాంటు మూసి వేయాలంటే నష్టాల ఊబిని చూపించాలి. అందుకు ఉద్దేశపూర్వకంగా నష్టాలలోకి నెట్టి వేస్తున్నారు. నష్టాలు వస్తున్నాయి కాబట్టి సంస్థను చౌకధరకు తమ అనుంగు మిత్రులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. విశాఖ ఉక్కు మూడు బ్లాస్ట్‌ ఫర్నెస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తే 73 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. దీనికి 18 వేల కోట్లు విలువైన ముడి ఖనిజం ఖర్చు అవుతుంది. కార్మిక సంఘాలు ప్లాంటు పరిరక్షణకు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్నాయి. ఫలితంగా దిగి వచ్చిన కేంద్రప్రభుత్వం ఇటీవల ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) నరేంద్రమోదీ అధ్యక్షతన జనవరి 17న సమావేశమై రివైవల్‌ ప్యాకేజీ కింద 11,440 కోట్లు రూపాయలు కేటాయించింది. ఇందులో 1144 కోట్లు షేరు ధనం, అసలు, వడ్డీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికే తిరిగి చెల్లించాలి. ఈక్విటీగా ప్రకటించిన 10,300 కోట్లలో ఇప్పటికే 1200 కోట్లు ఖర్చు చేశారు. కార్మికుల పి.ఎఫ్‌, జీతాలకు వెయ్యి కోట్లు బకాయిలు చెల్లించాలి. ఇక ముడి పదార్థాల కొనుగోలుకు మిగిలేది స్వల్పం. అయితే, 2025`26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం విశాఖ ఉక్కుకు కేవలం రూ.3,295 కోట్లు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కర్నాటక లోని విశ్వేశ్వరయ్య స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం 7 లక్షల టన్నులు ఉంటే, రెండు వేల కోట్లు అవసరమైతే 18 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఎంతో ఎక్కువ సామర్థ్యం ఉండి పెట్టుబడి అవసరమైన విశాఖ ఉక్కు ప్రాజెక్టుకు మాత్రం అతి తక్కువ కేటాయింపులు చేశారు. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి, ఉక్కు ఫ్యాక్టరీకి ఏదో సాధించేసినట్టుగా ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇంకా ప్లాంటు ఆదాయంపై బ్యాంకు ఎటాచ్‌మెంట్లు ఉన్నాయి. దీని వలన 7 వేల కోట్లు సరఫరాదార్లు, రెంటర్సు, పోర్టు చార్జీలకు, బొగ్గుకు, ఇతర బాకీలకు జమ పడతాయి. అందువల్ల కేంద్రం ప్రకటించిన ఈ అరకొర సాయాన్ని వినియోగించుకుని ప్లాంటు నిలదొక్కుకోవటం సాధ్యం కాదు. ఈ ప్యాకేజీ వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. వెంటిలేటరు నుంచి ఐసీయూలోకి మాత్రమే వస్తుంది. కేంద్రం ఇచ్చిన ఈ పరిమిత సాయం కేవలం ప్లాంటును అమ్మకానికి ముస్తాబు చేయటానికి మాత్రమే ఉపయోగ పడుతుందని, ఇది కేవలం ఆక్సిజన్‌ సరఫరా తప్ప జీవం పోయదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఈ అరకొర సాయంపై కార్మికులెవ్వరు సంతోషంగా లేరు. ప్రధాని మోదీగాని, అమిత్‌షా గాని ప్లాంటు ప్రైవేటీకరణ జరగదు అనే హామీ మాత్రం ఇవ్వటంలేదు. ఇది అనేక అనుమానా లకు దారి తీస్తున్నది. వేల కోట్లు కేంద్రం సాయం చేసినా ప్లాంటు నిలబడటంలేదు అనే అపవాదువేసి అమ్మకానికి పెట్టాలనే వ్యూహం ఈ అరకొరసాయం ఉద్దేశమని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాలక బీజేపీ ప్రజాప్రతినిధులు ప్లాంటు కష్టాలకు కార్మికులే కారణమన్న విష ప్రచారం ప్రారంభించారు. ప్లాంటు నష్టాలు కార్మికులు వల్లే వస్తున్నాయని విమర్శలు చేస్తున్నారు.
2021 జనవరి నుంచి ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్‌లో విలీనం చేయటం ద్వారా ముడిసరుకు సరఫరాను క్రమబద్ధీక రించాలని, కొరత లేకుండా చూడాలని లేదా సొంతంగా గనులు కేటాయించాలని కోరుతున్నాయి. బ్యాంకు రుణాల చెల్లింపుపై రెండేళ్లపాటు మారుటోరియం ప్రకటించటం ద్వారా ఉపశమనం కల్పించాలని, పన్నుల వసూళ్లకు తాత్కాలిక విరామం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. యాజమాన్యానికి ప్లాంటు నిర్వహణలో స్వేచ్ఛ ఇవ్వాలనీ, రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీరు, విద్యుత్‌లకు రాయితీ కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బకాయిల వసూళ్లు వాయిదా వేయాలి. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రభుత్వ నిర్మాణాలకు విశాఖ ఉక్కును వినియోగించుకోవాలని అందుకు అడ్వాన్సుగా ఒక రెండువేల కోట్ల రూపాయలను ఉక్కు కర్మాగారం యాజమాన్యానికి ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. వామపక్షాలతో పాటు నేడు అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా కార్మికులకు మద్దతు ఇచ్చి ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. కానీ నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పటం లేదు. కార్మిక సంఘాల డిమాండ్‌లను ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకంటే విశాఖ ఉక్కు పరిశ్రమ తిరిగి తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. పనిలో పునరంకితం కావటానికి కార్మికులు సైతం సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘాలు ప్రకటిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించటంలేదు. ప్లాంటును నిలబెట్టాలని ఆలోచన చేయటంలేదు. ఎలాగైనా విశాఖ ఉక్కును అమ్మివేయాలనే దృఢ సంకల్పం వ్యక్తం చేస్తున్నారు. విలువైన విశాఖ ఉక్కు భూములను తమ ఆశ్రితులకు కట్టబెట్టాలని ఆలోచిస్తు న్నారు. కష్టాల కడలిలో ఉన్న విశాఖ ఉక్కును పరిరక్షించుకోవటం తెలుగు ప్రజల కర్తవ్యం.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
సెల్‌: 9490952093

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు