. పాకిస్థాన్ భూభాగంలో ముష్కరులు లేకుండా చేయాలి
. ప్రాదేశిక శాంతిసుస్థిరతను పరిరక్షించుకోవాలి
. ఉద్రిక్తతలుయుద్ధ పరిస్థితిని నివారించాలి
. కేంద్రానికి సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) హితవు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి ఉగ్రవాదానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్ర కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేందుకు అక్కడి ఉగ్రవాద మౌలిక వసతులపై ఉక్కుపాదం మోపేలా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని కేంద్రాన్ని కోరింది.
న్యూదిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి ఉగ్రవాదానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్ర కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేందుకు అక్కడి ఉగ్రవాద మౌలిక వసతులపై ఉక్కుపాదం మోపేలా దాయాది దేశంపై ఒత్తిడి పెంచాలని కేంద్రాన్ని కోరింది. అదే సమయంలో ప్రాదేశిక శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాలని, ఉద్రిక్తతలుయుద్ధ పరిస్థితిని నివారించాలని హితవు పలికింది. ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తూ సీపీఐతో పాటు సీపీఎం, సీపీఐ(ఎంఎల్) వేర్వేరు ప్రకటనలు చేశాయి. ఉగ్ర మౌలిక వసతుల నిర్వీర్యానికిగాను పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని, ఉద్రిక్తతల నివారణకు దౌత్య పద్ధతులు అనుసరించాలని కేంద్రప్రభుత్వానికి సూచనలు చేశాయి. క్లిష్ఠ పరిస్థితుల్లో దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుకోవాలని హితవు పలికాయి. అమాయకుల రక్తపాతం, కవ్వింపు చర్యలతో ఉగ్రవాదం మూలాలపై దాడి చేయడం తప్ప భారత్‌కు ప్రత్యామ్నయం లేకుండా పోయిందని ఆపరేషన్ సిందూర్‌నుద్దేశించి సీపీఐ వ్యాఖ్యానించింది. ఉగ్రవాద శిబిరాలను, పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద మౌలిక వసతులను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం దాడులు చేసిందని సీపీఎం పేర్కొంది. ఉద్రిక్తతలను మరింత పెంచవద్దని, యుద్ధాన్ని నివారించాలని సీపీఐ(ఎంఎల్) సూచించింది. పాకిస్థాన్ సైనిక శిబిరాలకు నష్టం కలిగించకుండా కేవలం ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పూర్తిస్థాయి ఘర్షణకు తావివ్వని జవాబుదారీతనంతో భారత్ వ్యవహరించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదంపై పోరునకు బలమైన ఏకాభిప్రాయం కోసం తక్షణమే అఖిలపక్షాన్ని పిలవాలని కేంద్రాన్ని కోరింది. పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చకుండా దౌత్య పద్ధతుల్లో ముందుకెళ్లాలని, ప్రాదేశిక శాంతిని పరిరక్షించాలని, రాజకీయపరమైన పరిష్కారాలకు కట్టుబడాలని సూచించింది. ఉగ్రవాదం వల్ల సొంతంగా ఎంతో నష్టపోయిన పాకిస్థాన్...తమ దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్ లేకుండా చేయాలని సీపీఐ పిలుపునిచ్చింది. ఉమ్మడి ప్రాదేశిక సంకల్పంతోనే హింస ఛట్రాన్ని ముగించవచ్చని, తద్వారా దీర్ఘకాలిక శాంతిభద్రతలకు హామీ లభిస్తుందని పేర్కొంది. లౌకిక విలువులు, చట్టం పట్ల భారత పౌరుల అచంచల నిబద్ధతకు, వారి బలం, ఐక్యతకు ఈ క్షణం ప్రతీక అని సీపీఐ వెల్లడిరచింది. పహల్గాం దోషులను అప్పగించేలా.. వారి భూభగంలో ఏ ఒక్క ఉగ్ర శిబిరం లేకుండా చేసేలా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని సీపీఎం డిమాండ్ చేసింది. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు హామీనిచ్చే చర్యలను కోరింది. ఆపరేషన్ సింధూర్ క్రమంలో మహిళలు, పిల్లలు సహా పౌర మరణాలు సంభవించినట్లు పాకిస్థాన్ చెబుతోంది కానీ సరిహద్దుల వద్ద కాల్పులు, జమ్మూకశ్మీర్‌లో పౌర మరణాలపై నివేదికలు అందుతున్నాయని సీపీఐ(ఎంఎల్) పేర్కొంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి... 1971 యుద్ధమప్పటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయని తెలిపింది. ఇటువంటి మాక్ డ్రిల్స్ వల్ల దేశంలో అంతర్గతంగా సమస్యలు రాకుండా చూడాలని కేంద్రాన్ని కోరింది. హిమాన్షీ నర్వాల్, షైలా నేగి వంటి మహిళలపై ద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయపరమైన స్వరాలు, ట్రోల్ ఆర్మీ నియంత్రణకు సీపీఐ(ఎంఎల్) పిలుపునిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాల ప్రచారాన్ని కట్టడి చేయాలని, ఫేక్ న్యూస్ అరికట్టాలని కేంద్రాన్ని కోరింది. అణచివేత విధానాన్ని ఆపాలని హితవు పలికింది. న్యాయాన్ని ప్రేమించే భారతీయులంతా ఐక్యంగా ఉండేందుకు భరోసా ఇచ్చేలా సముచిత చర్యలు తీసుకోవాలని సూచించింది. శాంతి, సామరస్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సీపీఐ(ఎంఎల్) పిలుపునిచ్చింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలని దాయాది దేశానికి సూచన చేసింది. ఉగ్రవాదం
యుద్ధం వ్యతిరేక స్వరం వినిపించాలని పాకిస్థాన్ ప్రజలను కోరింది. యుద్ధాన్ని వ్యతిరేకించాలని సరిహద్దుకు రెండు వైపుల ఉన్న ప్రజలకు సీపీఐ(ఎంఎల్) సూచించింది.