Friday, December 27, 2024
Homeఉద్యమాలతో సాగిన వందేళ్లు

ఉద్యమాలతో సాగిన వందేళ్లు

సీపీఐ శతాబ్ది ఉత్సవం కాన్పూర్‌లో ఆరంభం
అరుణ పతాకావిష్కరణతో వేడుకలు ప్రారంభించిన డి.రాజా

కాన్పూర్‌: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాలు యూపీలోని కాన్పూర్‌లో గురువారం ఘనంగా మొదలయ్యాయి. వందేళ్ల కిందట నిబద్ధతగల దేశభక్తుల వీరోచిత పోరాటాలతో డిసెంబరు 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించింది కాబట్టి శతవార్షికోత్సవాన్ని కాన్పూర్‌ నుంచే అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అరుణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రారంభించారు. సభలో సీపీఐ కార్యదర్శులు అమర్‌జిత్‌ కౌర్‌, గిరీశ్‌ శర్మ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి అరవింద్‌ రాజ్‌ స్వరూప్‌ తదితర సీనియర్‌ నాయకులు ప్రసంగించారు. పార్టీ స్థాపన నాటి నుంచి నేటి వరకు జరిగిన ఉద్యమాలు, పోరాటాలను గుర్తుచేశారు. కమ్యూనిస్టుల విప్లవాత్మక చరిత్ర గురించి మాట్లాడారు. సీపీఐ ఎల్లప్పుడు ప్రజల పక్షాన నిలిస్తుందని నొక్కిచెప్పారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల తరపున నిర్విరామంగా పోరాడుతోందని వక్కాణించారు. నాటి బ్రిటిష్‌ వలసవాద దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా నేటి మతవాద పరిపాలనకు వ్యతిరేకంగా సీపీఐ పోరాటం కొనసాగుతోందని నాయకులు తెలిపారు. మతతత్వ సంఘాల నుంచి సభ్యత్వాన్ని తిరస్కరించిన మొట్టమొదటి పార్టీ సీపీఐ అని ఉద్ఘాటించారు.
కమ్యూనిస్టులు నమ్మిన సిద్ధాంతాలతో ఎన్నడూ రాజీ పడలేదని, స్వాతంత్రం కోసం పోరాటంలో అగ్రభాగాన నిలిచారని, జైళ్లల్లో గడిపారని, తూటాలను లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడారని వక్తలు అన్నారు. రాజా మాట్లాడుతూ ‘వందేళ్ల వారసత్వాన్ని కాపాడుకోవడం, దానిని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత… కులంమతంతరగతి వైషమ్యాలు లేని సోషలిస్టు నవ భారతం కోసం పోరాటంలో ఘన పాత్ర పోషించడం మన కర్తవ్యం’ అని పిలుపునిచ్చారు. నాడు పూర్ణ స్వరాజ్‌ కోసం సీపీఐ చేసిన డిమాండ్‌కు మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ మద్దతిచ్చినట్లు రాజా గుర్తుచేశారు. రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం మొదట్లో డిమాండ్‌ చేసినది కమ్యూనిస్టులేనని తెలిపారు. భూ సంస్కరణలు, హక్కులు, వెనుకబడిన వర్గాలకు పరిరక్షణ వంటి అంశాలపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో కమ్యూనిస్టు ప్రభావం ఉండేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ, ఏఐకేఎస్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ప్రగతిశీల రచయితల సంఘం తదితర సంఘాల ద్వారా ప్రజలను క్రియాశీలం చేయడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి ఉందని రాజా తెలిపారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మతోన్మాదం, ఫాసిజం, ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం లెఫ్ట్‌ పోరాటం కొనసాగుతోందని రాజా వెల్లడిరచారు. సీపీఐ విప్లవ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు