విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ (సాధారణ) ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్1, గ్రూప్
2 తో పాటు వివిధ విభాగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ఇది మంచి శుభవార్తే. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగడం లేదు. జాబ్ క్యాలెండర్ నిర్దిష్టకాల పరిమితితో అమలు చేయడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోల్లో రాజకీయ పార్టీలు హామీలకే పరిమితమవుతుండటంతో ఉద్యోగాల భర్తీ నిలిచిపోతోంది. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసి వయోపరిమితిని కోల్పోతున్నారు. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపు చాలబోదని, కనీసం 45 ఏళ్లకు జనరల్ అభ్యర్థులకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది.
వయో పరిమితి 45 సంవత్సరాలు పెంచాలి : ఏఐవైఎఫ్
ఏపీపీఎస్సీతో పాటు ఇతర ఏజెన్సీల ద్వారా నేరుగా నియమించే ఉద్యోగాలకు వయో పరిమితిని 45 సంవత్సరాలకు పెంచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. యూనిఫాం సర్వీసులు పోలీసు, అగ్నిమాపక, ఇతర భద్రతా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు గరిష్ట వయో పరిమితిని రెండేళ్లు పెంచగా, నాన్-యూనిఫాం ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారని నాన్ యూనిఫాం సర్వీసులకు 45 సంవత్సరాలు పెంచాలని అన్నారు. అనేక సంవత్సరాలుగా నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో నిరుద్యోగులు చాలా మంది అనర్హులుగా మిగిలిపోయారని, వారిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.