Tuesday, April 22, 2025
Homeవిశ్లేషణఉద్యోగ వ్యాపారం

ఉద్యోగ వ్యాపారం

చింతపట్ల సుదర్శన్‌

మధ్యాహ్నమంతా వెండి పళ్లెంలా ఆకాశంలో తళతళమన్న సూరీడు నీరసంగా మబ్బుల చాటున ఎర్రబడ్డ ముఖం దాచుకుంటూ ఉన్నాడు. ఇంకాస్తయితే చీకటి గొంగళి పురుగు లోకం అంతా పాకుతుంది ఈ డాగీ ఇంకా రాలేదేమిటా అని మైదానం వైపు చూసింది డాంకీ. కనుచూపు మేర ఖాళీగా ఉన్న చోట హఠాత్తుగా ఓ ఆకారం కనిపించింది. స్పష్టంగా తెలీడం లేదు కాని అది డాగీ అయి ఉండవచ్చు అనుకుంది. అది అనుకున్నదే నిజమయింది. ముందుకు వస్తున్న ఆ ఆకారం డాగీదే. అయితే, మైదానంలోకి అడుగు పెట్టగానే రేసు గుర్రంలా నాలుగు కాళ్ల మీద పరిగెత్తుకు వచ్చే డాగీ ఎంతో భారంగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నది. అది అరుగు మీదికి రావడానికి చాలా టైం పట్టింది.
ఏమిటి తమ్ముడూ! పరుగెత్తి వచ్చేవాడివి ఇలా ‘స్లో మోషన్‌’ లో వచ్చావు. కడుపులోకి ఏమీ చిక్కలేదా అంది డాంకీ. తిండి దొరక్కపోతే నీరసం దొరికితే ఆయాసం మామూలే కద. ఇవాళ కొంచెం ఎక్కువే తిన్నా కడుపు బరువైంది కనకే పరుగెత్తలేకపోయా అంది డాగీ. అవునా! అంత ఎక్కువ తిండి దొరికిందా? విశేషమేమిటో! ఏముంది, మాంసం షాపు పక్కన రోడ్డుకి అడ్డంగా ఓ ఇంటి వాళ్లు ఏదో ఫంక్షన్‌కి టెంటు వేయించారు. అటువైపు కుక్కలేవీ షాపు దగ్గరికి రాలేకపోయేయి అంది డాగీ. అదా విషయం అవునులే మనూళ్లో ఎప్పుడు ఎక్కడ రోడ్డుకి అడ్డంగా టెంటు పడుతుందో, ఎక్కడ మంచినీళ్ల పైపు పగిలి నీళ్లు కాలవలవుతుందో, ఎక్కడ డ్రైనేజీలు పొంగి పొరలుతాయో ఎవరు చెప్పగలరు. సరేలే! టెంట్‌ కారణంగా ఈరోజు కొట్టు ముందు విందు చేసుకున్నానంటావు. అదృష్టం కలిసి వచ్చిందన్న మాట అంది డాంకీ. అదృష్టమా? ఆ మాటకి అర్థం ఏమిటో? అదృష్టమంటే ‘గుడ్‌లక్‌’ అన్నమాట. అదృష్టమున్న వాడు ఎన్నికల్లో నిలబడకుండా ఎంఎల్‌సీ కాగలడు, మంత్రి కూడా అవగలడు. అదృష్టం ఉన్నవాడు ప్రభుత్వ భూమిలో మల్టీ ఫ్లెక్సులు కట్టగలడు, లాండ్‌ను ఎకరానికి తొంభయి పైసలతో లీజుకు తీసుకోగలడు. ఫ్యాక్టరీ బోర్డు తిప్పి రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్సు చెయ్యగలడు. మనుషుల బతుకంతా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందంటారు అంది డాంకీ. అలాగా అదంతా మనుషుల యవ్వారంలే దానికీ ఈ వీధి కుక్కకీ ఎక్కడన్నా లింకుందా? ఎందుకు లేదు. దారినపోతున్న నిన్ను ఏ తాగుబోతు వెధవో రాయి పుచ్చుకు కొట్టాడనుకో అది దురదృష్టం. అనుకోకుండా ఎవడైనా ‘బన్‌ముక్క’ నీ ముందు విసిరాడనుకో అది అదృష్టమన్న మాట అంటూ డాంకీ పళ్లికిలిస్తుంటే అరుగు ఎక్కాడు అబ్బాయి.
అదృష్టమంటున్నావు ఎవరికీ! ఎందుకులే? అన్నాడు అబ్బాయి కూర్చుంటూ. హైడ్రా వాడు మనం వాడుకుంటున్న ఈ ఇంటిని బుల్‌డోజర్‌తో తొక్కించక పోవడం అదృష్టమే కద. ఊళ్లో ఎప్పుడు ఏ కొంప మీదకు ఏ కారణంగా దూకుతాయో తెలీకుండా విచ్చలవిడిగా తిరిగే బుల్‌ డోజర్లు మన మైదానంవైపు రాకపోవడం అదృష్టమే కద అంది డాంకీ. మన ఊళ్లోనే కాదు దేశంలో చాలా చోట్ల ఈ బుల్‌డోజర్‌ల సంస్కృతి పెరుగుతున్నది. రానురాను ప్రజాస్వామ్యం వీధి రౌడీలా మారుతున్నది అన్నాడు అబ్బాయి. అది సరేగానీ భాయిజాన్‌ అదృష్టం అనేది నీకు ఎప్పుడు కలుగుతుంది అనడిగింది డాగీ. అవునవును ‘ఫార్చూన్‌ నాక్స్‌ ఎట్‌ ది డోర్‌’ అనగా ‘అదృష్టం తలుపు తడుతుంది’ అన్నాడో మహా మేధావి. అది నీ ఇంటి తలుపు ఎప్పుడు తట్టును, నీకు ఉద్యోగం ఎప్పుడు చిక్కును అంది డాంకీ. ఏమో డాంకీ ఆ గీత ఈ చేతిలో ఉన్నట్టు లేదు అన్నాడబ్బాయి అరచేతి గీతలవైపు చూసుకుంటూ. అసలు నాకు తెలీక అడుగుతా? ఉద్యోగమే కావాలని ఎందుకు టైం వేస్టు చేస్తావు. ‘మేక్‌ హే వైల్‌ ది సన్‌షైన్స్‌’ అని ఇంగ్లీషులోను ‘దీపం ఉండగానే ఇల్లు సర్దుకో’ అని తెలుగులోను అన్నారు కదా నూట నలభై కోట్ల మంది జనం ఉన్నారు కదా! వీళ్లల్లో నీ చుట్టూ కొన్ని వేలమంది ఉన్నారు కదా! వారికి సేవచేసే పని మొదలు పెట్టరాదూ! పుణ్యం పురుషార్థం అన్నారు కదా అంది డాంకీ. అవును ప్రజాసేవను మించిన ఉద్యోగం లేదు. ప్రజాసేవను మించిన పరమార్థం లేదు అందులో ‘అర్థం’ కూడా ఉంది అంది డాగీ. ప్రజాసేవచేసే వారినే కదా ప్రజాప్రతినిధులంటారు. ప్రజా ప్రతినిధులే కదా ఎంపీలు, ఎమ్మెల్యేలవుతారు, మంత్రులూ, ముఖ్యమంత్రులూ అవుతారు. నా మాటవిని, నిస్వార్థంగా ప్రజాసేవ మొదలుపెట్టి ఏదో ఓ పార్టీ జండా మొయ్యి. నేటి కార్యకర్తే రేపటి మంత్రి అన్నారు అంది డాంకీ. ఎవరన్నారు డాంకీ జండాలు మోసేవాడ్ని, నిస్వార్థంగా ప్రజా సమస్యలు పట్టించుకునే వాడ్ని పట్టించుకునే దెవరు? అసలు రాజకీయం అంటే ‘సేవ’ అనెవరన్నారు అది ఓ వ్యాపారం. ఎంతో పెట్టుబడి అవసరం. ఓట్లూ, పదవులూ డబ్బు పెట్టి కొని ఆ తర్వాత లాభాలు రాబట్టే ఆ వ్యాపారానికి నా దగ్గర పెట్టుబడి లేదు కదా అన్నాడు అబ్బాయి.
ముందు కాలుతో మెడ కింద గోక్కుంటూ అడిగింది డాగీ, అసలు రాజకీయమంటే సేవా? ఉద్యోగమా? లేక వ్యాపారమా? అని. సేవ అనేది ప్రతి లీడరూ పైకి చెప్పే ‘ఉత్తుత్తి, ఉల్ఫా’ మాటది. నెలనెలా జీతాలు తీసుకుంటూ, ఆ తర్వాత పెన్షన్లు కూడా ఎత్తుకుంటూ ఉంటారు కాబట్టి ఉద్యోగం అనవచ్చు. పైగా ఈ ఉద్యోగానికి చదువక్కర్లేదు. పెన్షన్‌ రావడానికి ముప్ఫయ్యేళ్ల పని చెయ్యక్కర్లేదు. అయిదేళ్లు చాలు. ఈ ఉద్యోగంలో ఉన్నవాళ్లకీ, ఐదూ పదీ రూకల జీతం పెంచడానికి పీఆర్‌సీ నివేదికలవసరం లేదు. తమకు తామే సభలో కూచుని జీతాల్ని రెట్టింపు పెంచుకోగలరు అన్నాడు అబ్బాయి. అయితే రాజకీయమనగా ఉద్యోగమన్న మాటే కద అంది డాగీ. కాదు కాదు వ్యాపారమే. పెట్టుబడికి ఎన్నో రెట్లు సంపాదించడానికి కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్‌లు, కాలేజీలు, మాల్‌లు, మందు షాపులు మరెన్నో మార్గాలు అంది డాంకీ.
ఇప్పుడర్థమైంది. అదృష్టం ఉన్నోళ్లు ఓడిపోయే పార్టీ నుంచి గెలిచే పార్టీలోకి దూకుతారు. అది లేనోళ్లు గెలిచే పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలోకి దూకి బోరుమంటారు అంది డాగీ. రాజకీయం అంటే వ్యాపార ఉద్యోగమైనా కావాలి, ఉద్యోగ వ్యాపారమైనా అవాలి కాని సేవ అనే మాట మాత్రం ఖచ్చితంగా కానే కాదు! అన్నాడు అబ్బాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు