. లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన
. తక్షణం వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్
. పార్లమెంట్ ఆవరణలో రాహుల్, ప్రియాంక నిరసన
న్యూదిల్లీ : ఉపాధి హామీ పథకం కింద చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని లోక్‌సభలో ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని లేవనెత్తిన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. కొన్ని రాష్ట్రాలకు చెల్లింపులు ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న ఎంపీలనుద్దేశించి స్పీకర్ ఓం బిర్లా… తమ సీట్లలో వెళ్లి కూర్చోవాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తిన ప్రశ్నలను రాజకీయం చేయవద్దన్నారు. కాగా ప్రతిపక్ష ఎంపీలు పట్టు విడవకుండా పెద్ద పెట్టున నినదిస్తూ… ఆందోళన చేశారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని, పని దినాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఎంపీల నిరసన నడుమ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాష్ మాట్లాడుతూ… తన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీల సంఖ్య తగ్గిపోతోందని… చెల్లింపులు ఆలస్యం కావడం, తక్కువ వేతనాలే దీనికి కారణమని అన్నారు. గత మూడు నెలలుగా కూలీలకు వేతనాలు అందలేదుని, ఈ పథకం కింద రూ. 811 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ ఉపాధి హామీ కూలీల వేతనాలను ద్రవ్యోల్బణంతో అనుసంధానించి… పనిదినాలను 150కి పెంచాలని సిఫార్సు చేసిందని… ప్రభుత్వం పెండిరగ్‌లో ఉన్న మొత్తాన్ని ఆలస్యం లేకుండా విడుదల చేస్తుందా అని ప్రకాష్ ప్రశ్నించారు. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుకు ఉపాధి హామీ పథకం కింద గత ఐదు నెలలుగా రూ. 4,034 కోట్ల చెల్లింపులు రావాల్సి ఉందని చెప్పారు. ‘ఈ పథకం డిమాండ్ ఆధారితమైంది. చెల్లింపులు 15 రోజులకు పైగా ఆలస్యమైతే… వాటిని కార్మికులకు వడ్డీతో సహా చెల్లించాలి. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాశారు. మేము మంత్రిని కలిశాము. బకాయిలు చెల్లిస్తామని ఆయన మాకు హామీ ఇచ్చారు. కానీ మేము ఇంకా ఏమీ జరగలేదు’ అని ఆమె అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని సమాధాన మిస్తూ… నిధులను నిలిపివేశారనే వాదనలను తోసిపుచ్చారు. ఈ సంవత్సరం కేరళకు ఇప్పటికే దాదాపు రూ. 3,000 కోట్లు అందాయని అన్నారు. ‘చట్టం ప్రకారం, ఆలస్యం జరిగితే… రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దానిని తిరిగి చెల్లిస్తుంది. తమిళనాడు ఇప్పటికే రూ. 7,300 కోట్లు అందుకుంది. ఏడు కోట్ల జనాభా ఉన్న తమిళనాడు రూ. 10,000 కోట్లకు పైగా అందుకుంటుంది. ఇది 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌తో పోల్చవచ్చు. పక్షపాతం అనే ప్రశ్న లేదు’ అని మంత్రి అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ… ‘‘తమిళనాడు అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, మోదీ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్లా ఎప్పుడూ వివక్ష చూపలేదు. పెండిరగ్‌లో ఉన్న ఉపాధి పథకం బకాయిలు, మెటీరియల్ ఖర్చులు సహా, త్వరలో విడుదల చేయబడతాయని చెప్పారు.
‘ఉపాధి’ వేతనాలు పెంచాలి: రాహుల్, ప్రియాంక
కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ మండిపడ్డారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఉపాధి హామీ వేతన బకాయిలు విడుదల చేయకపోవడంపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో చేపట్టిన నిరసనలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.
ప్రభుత్వ నిష్క్రియాపర్వం లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసిందని, పేదరికాన్ని పెంచిందని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. కేంద్రప్రభుత్వం తక్షణమే ఉపాధి హామీ వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పనిదినాలను 150 రోజులకు పెంచాలన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేసీ వేణుగోపాల్ ,శశి థరూర్, కేరళకు చెందిన ఇతర పార్టీ ఎంపీలు కూడా నిరసనలో
పాల్గొన్నారు.