మనసుకు ఆశల చొక్కా తొడుక్కొని,
విశాల ప్రపంచంలో తిరుగుతూ…
ఎడారిలో బాటసారిలా బతుకుతూ,
బాధ్యతలను తలకు చుట్టుకొని బయలుదేరా!
రాబోయే కాలం స్వర’మని తలచి,
చీకటి రోజుల్లో వెలుగు దీపం వెలిగించి…
కనుగుడ్లలో రేపటి ఆశను నింపుకొని,
బతుకు పాఠశాలలో చదువుకుంటున్నాను!
దేహమంతా రుధిరపు ఛాయలే ఉన్నా,
నా వర్ణం పసిగట్టేందుకు వాసనలు చూస్తారు…
తెల్లటి మనసుపై నల్లటి గీతలు గీస్తూ,
నన్ను ఒక వర’పు చట్రంలో బంధించారు!
ఎర్రటి సిరాను కలములో నింపుకొని,
ఉద్వేగపు సముద్రపు అంచుల్లో ఎగురుతూ…
సుడిగుండాల మధ్య చిక్కుకొని
కలవని నింగి-నేలను కలపాలని చూస్తున్నాను!
మనసు పేర్చిన ఆశల సౌధాన్ని,
కర్మ సిద్ధాంతం కూల్చివేసింది…
అయినా, చెమ్మగిల్లిన నా కళ్లలో,
ఎండిన చెట్టు చిగుర్లు మళ్లీ పలకరించాయి!
కొప్పుల ప్రసాద్, 9885066235
ఎండిన చెట్టుకు చిగుర్లు…
- Advertisement -


