మన దేశంలోని ఇంటర్నెట్ సదుపాయం కల్పించే స్టార్ లింక్‌తో అంటే ఎలాన్ మస్క్ అధీనంలోని స్పేసెక్స్‌తో భారతీ మిత్తల్ అధీనంలోని ఎయిర్ టెల్ సంబంధాలు పెట్టుకుని ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం అందిస్తుందట. ఎలాన్ మస్క్ కంపెనీతో మన దేశంలోని దిగ్గజ కంపెనీ జోడీ కట్టడం అంటే పిల్లి మొగ్గ వేసినట్టే. ఎలాన్ మస్క్ అధీనంలోని స్పేసెక్స్ మన దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదని మొన్నటి దాకా ఎయిర్‌్ టెల్ వాదించేది. లైసెన్స్ రుసుము, స్పెక్ట్రం ధర గురించి ఎయిర్‌్ టెల్ స్టార్ లింక్‌తో విభేదించేది. స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం అంటే నేరుగా ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందించడం. ఎయిర్‌్‌టెల్, జియో కూడా ఇదివరకు ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి సిద్ధ పడ్డవే. స్పెక్ట్రం అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని టెలీకాం బిల్లులో చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2024లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరిగినప్పుడు ఉపగ్రహ కంపెనీలు లైసెన్స్ రుసుము చెల్లించాల్సిందేనన్న జియో వాదనను సునీల్ మిత్తల్ సమర్థించారు. అయితే స్టార్ లింక్ తో లైసెన్స్ రుసుము చెల్లించే విషయంలో తనకు ఎలాంటి విభేదమూ లేదని కూడా మిత్తల్ అన్నారు. టెలీకాం కంపెనీల్లాగే స్టార్ లింక్ కూడా స్పెక్ట్రం కొనుక్కోవాల్సిందేనని ఆయన అన్నారు. అంతకు ముందు జియో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. సునీల్ మిత్తల్ 2024లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా అక్కడే ఉన్నారు. స్టార్ లింక్ మన దేశంలో సేవలు అందించడం అంటే భారీ సమస్య ఎదుర్కోవడమేనన్న అభిప్రాయం అప్పుడు వ్యక్తం అయింది. మన దేశంలో ప్రవేశించాలని స్టార్ లింక్స్ 2022 నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ లింక్‌కు స్పెక్ట్రం కేటాయించడానికి మొన్న మొన్నటి దాకా వ్యతిరేకించిన ఎయిర్‌్ టెల్, జియో కంపెనీలు అమాంతం తమ వైఖరి మార్చుకోవడంలో ఏదో గుట్టు ఉండే ఉంటుంది. మన దేశంలోని ఎయిర్‌్‌టెల్‌తో స్టార్ లింక్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రెండు ప్రభావాలు ఉండొచ్చు. ఒకటి మన కంపెనీలు స్టార్ లింక్స్‌తో ఒప్పందం చేసుకుని తమ సేవలు అందించడం, రెండో వేపున స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం. ప్రధానమంత్రి మోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపిన పర్యవసానంగానే ఎయిర్‌్ టెల్ స్టార్ లింక్‌పై వ్యతిరేకతను విడనాడిరదని అర్థం అవుతూనే ఉంది. మొబైల్ టెలిఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించే వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉంటుంది. అందుకే ఎయిర్‌్‌టెల్, జియో ప్రధాని అమెరికా పర్యటన తరవాత పిల్లి మొగ్గ వేసి ఉంటాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖేశ్ అంబానీ హాజరైన విషయాన్ని కూడా ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. పోటీ పడడం కన్నా సహకరించుకుని పని చేయడమే మేలని ఎయిర్‌్ టెల్ భావించి ఉంటుంది. స్టార్ లింక్‌తో ఎయిర్‌్ టెల్ పొత్తు కుదుర్చుకుంటే అంబానీ విపరీతమైన పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. అంబానీ టెలీకాం సామ్రాజ్య ఆధిపత్యం అంతమవుతుందేమో! ఇదంతా చూస్తే మోదీకి సన్నిహితులు ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది. అంబానీని మోదీ దూరం పెడ్తున్నారని కూడా అనిపించక తప్పదు. ఈ ఊహా గానాలన్నీ సాగుతున్న దశలోనే బుధవారం అంబానీ అధీనంలోని జియో కూడా పొత్తు కుదుర్చుకుంటుందన్న వార్త వచ్చింది. భరించరాని పోటీ ఎదుర్కోవడం కన్నా స్టార్ లింక్‌తో తాము కూడా సంబంధం పెట్టుకుని తమ వాటా వ్యాపారం తాము చేసుకోవడం మంచిదని అంబానీ నిర్ణయానికి వచ్చారనుకోవాలి. మస్క్ అధీనంలోని కంపెనీ ఒకటే. అదే స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించే స్పేసెక్స్. అలాంటప్పుడు పరస్పరం పోటీ పడుతున్న ఎయిర్‌్‌టెల్, జియో ఎలాన్ మస్క్ కంపెనీతో పొత్తు ఎలా పెట్టుకోగలవన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే.
తాము స్టార్ లింక్‌తో సంబంధాలు పెట్టుకుంటామని మిత్తల్ ప్రకటించినప్పుడు జియో ప్రస్తావనే తీసుకు రాలేదు. అలాగే స్టార్‌లో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని జియో అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించినప్పుడే ఎయిర్‌్‌టెల్ ప్రస్తావన తీసుకు రాలేదు. ప్రధాన మంత్రి అమెరికా వెళ్లినప్పుడు మస్క్ కుటుంబ సమేతంగా మోదీని కలుసుకున్నారు. మస్క్ కుటుంబంతో పాటు వచ్చారు కాని ఆ సమావేశంలో మోదీతో పాటు ఆయన వెంట వెళ్లిన ఉన్నతాధికార బృందం అంతా మస్క్-మోదీ చర్చిస్తున్న ప్పుడు అక్కడే ఉంది. ప్రధాని అమెరికా పర్యటన ముగిసిన సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూడా టెలీకాం రంగంలో ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేస్తామన్న ప్రస్తావనే లేదు. ఈ ప్రకటనలో ఉన్నదల్లా అమెరికా జాతీయ విజ్ఞాన శాస్త్ర ఫౌండేషన్, భారత్ లోని విజ్ఞాన శాస్త్ర సంబంధ సంస్థలు కలిసి పని చేస్తాయని మాత్రమే ఉంది. ఇంతకు ముందు అమెరికా వ్యాపారస్థులు భారత్ తో వ్యాపారం చేయాలనుకుంటే వారు భారత్ వచ్చి ఉన్నతాధికారులతో సహా ప్రధానమంత్రిని కూడా దర్శించుకునే వారు. కానీ మన దేశంలో రెండు టెలీకాం దిగ్గజాలతో వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి, లేదా ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించడానికి ఎలాన్ మస్క్ మన దేశానికి రానే లేదు. మొత్తం వ్యవహారం అంతా వాషింగ్టన్ లోనే జరిగిపోయినట్టుంది. మన దేశంతో వ్యాపారం చేయాలనుకునే వారు మన దేశంలోని చట్టాలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. మన దేశంలో మస్క్ పెద్ద వాటాదారుగా ఉన్న టెస్లా కార్ల అమ్మకం కేంద్రం ఏర్పాటు చేస్తారన్న వార్తా వచ్చింది. స్టార్ లింక్ అంటే మస్క్ అధీనంలోని స్పేసెక్స్‌లో అంతర్భాగమే. ఈ కంపెనీకి చెందిన 6.400 కన్నా ఎక్కువ ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలలో మూడిరట రెండువంతుల ఉపగ్రహాలు మస్క్ యాజమాన్యంలోనే ఉన్నాయి. స్టార్ లింక్ వల్ల ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. మధ్యమధ్యలో అంతరాయాలూ ఉండవంటున్నారు. స్టార్ లింక్ సేవలు అందాలంటే మన దేశంలో లాగా ప్రతి నాలుగు రోజులకు ఒక సారి రోడ్లు తవ్వి ఆప్టికల్ ఫైబర్ పరచవలసిన పనీ లేదు. స్టార్ లింక్ చాలా ఖరీదైన వ్యవహారం అన్నది మరిచిపోవాల్సిందే. ఎందుకంటే అమెరికాలో స్టార్ లింక్ సదుపాయం పొందాలంటే నెలకు 120 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని రూపాయల్లోకి మార్చి చూస్తే అది నెలకు 10,000 రూపాయలకన్నా ఎక్కువ అని తెలిస్తే గుండె గుభేల్ మంటుంది. కెన్యాలో మస్క్ ఈ సదుపాయం నెలకు పది డాలర్లకే అందిస్తున్నారు. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న గ్రామ గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ పరిచేయాలన్న ప్రభుత్వ ఆలోచన భవిష్యత్తు ఏమిటి? ఇప్పటికే దీనికోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఆప్టికల్ ఫైబర్ గురించి 2020 నుంచి మోదీ గొప్పలు చెప్తూనే ఉన్నారు. వెయ్యి రోజుల్లో గ్రామ గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ పరిచేస్తామన్నారు. 2022 ఎర్రకోట మీంచి ప్రసంగిస్తూ ఇదే మాట చెప్పారు. మన దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయి. 2024 డిసెంబర్ రెండో తేదీ దాకా కేవలం 2, 14, 313 పంచాయితీలకు మాత్రమే ఆప్టికల్ ఫైబర్ పరిచే పని పూర్తి అయిందట. ఇదీ మన వేగవంతమైన అభివృద్ధి పథం!