వేల మంది పేదలతో కలిసి 72 ఎకరాలు స్వాధీనం
కాకినాడ జిల్లా కొమరగిరిలో భూ కబ్జాను అడ్డుకున్న సీపీఐ శ్రేణులు
పేదలకు స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు : రామకృష్ణ
విశాలాంధ్రకాకినాడ : ప్రభుత్వ భూమి కబ్జాను నిరసిస్తూ... పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం ఆ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎర్రదండు ఉద్యమించింది. తమ గూడు కోసం భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది పేదలు కదం తొక్కారు. శుక్రవారం ఉదయం సీపీఐ, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఔట్‌లో కబ్జాకు గురవుతున్న 72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని భూ పోరాటం నిర్వహించారు. కబ్జాదారులకు కళ్లెం వేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వస్తున్నారన్న విషయం తెలియడంతో ఆ భూమిలో పాగా వేసిన కబ్జాదారులు పనిముట్లను పట్టుకొని పారిపోయారు. అనంతరం పేదలు... రామకృష్ణ చేతుల మీదుగా ఆ స్థలంలో ముగ్గులతో హద్దులు వేసి ప్లాట్లు విభజించుకున్నారు. అనంతరం జరిగిన సభకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి రామకృష్ణ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం కేటాయించిన ఈ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే ఈ భూమిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కొమరగిరి ఫేజ్
2 లో 72 ఎకరాలు రైతుల వద్ద నుంచి రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని, అయితే ఎన్నికల అనంతరం ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడిరదని తెలిపారు. అందులో భాగంగా 42 ఎకరాల భూమిని అక్రమంగా సాగు చేస్తూ అనుభవిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. కొమరగిరి వీఆర్వోలు భూకబ్జాదారులకు సాయం చేస్తున్నారని అన్నారు. నాలుగు నెలలుగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని దశలవారీ పోరాటాలు నిర్వహించిందని, కొన్ని ప్రాంతాల్లో భూ పోరాటాలు చేసిందని చెప్పారు. పేదలకు భూముల విషయంపై ముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామన్నారు. ఈ కొమరగిరి భూ విషయంపై త్వరలో రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామని, జనసేన అధినేత, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌కు లేఖ రాస్తానని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం పేదలకు ఈ భూమిలో స్థలాలు ఇవ్వకపోతే మరొకసారి ఇక్కడికి తామే వచ్చి స్థలాలు పంపిణీ చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సీపీఐ అధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు రాసిందని, ఈ మేరకు తహసీల్దార్, ఆర్డీవోకు వినతులు కూడా అందజేసినట్లు చెప్పారు. అయినా ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని, వారం రోజుల్లో ఈ భూమిని సర్వే చేసి పేదలకు పంచకపోతే తాడోపేడో తేలుస్తామని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సాగు భూములు పంపిణీ చేయాలని వంద సంవత్సరాలుగా సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమిస్తున్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొమరగిరి చుట్టుపక్కల ప్రాంతాల పేదలకు ఈ భూమిని పంచే వరకు సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం వారికి అండగా ఉంటుందన్నారు. సీపీఐ నాయకులు తాటిపాక మధు మాట్లాడుతూ 72 ఎకరాలను ఆక్రమించుకుని లబ్ధి పొందాలని చూస్తున్న కబ్జాదారులు వెంటనే ఆ భూమిని వదిలి వెళ్లకపోతే సీపీఐ ఊరుకోబోదని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ వెంటనే పవన్ కల్యాణ్‌తో మాట్లాడాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ కొమరగిరి ప్రాంతాన్ని పర్యటించి పేదలందరికీ న్యాయం చేయాలని కోరారు. సీపీఐ పిఠాపురం శాఖ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో చాలామంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సొంతిల్లు లేక ఆర్థికంగా సతమతమవుతున్నారని, సీపీఐ వారందరికీ అండగా ఉంటుందన్నారు. ఇంకా ఇళ్ల స్థలాల దరఖాస్తులు రాస్తామని, త్వరలో మరో మూడు ప్రాంతాలలో భూ పోరాటం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం యు కొత్తపల్లి డిప్యూటీ తహసీల్దార్ ఈ స్థలం వద్దకు విచ్చేసి 1,400 మంది దరఖాస్తులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, జిల్లా సమితి సభ్యులు కొమ్మర్తి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఎ.భవాని, సమాచార హక్కుల వేదిక నాయకులు బల్ల సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వీరబాబు, ఏఐఎస్‌ఎఫ్ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, ఏఐవైఎఫ్ నాయకులు బాబి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేతా గోవిందు, వాసంశెట్టి గురవయ్య, మేడిశెట్టి శీను, కొమరగిరి వార్డు సభ్యులు కొప్పిశెట్టి త్రిమూర్తులు, శాఖ రaాన్సీ, రాజకీయ పార్టీలతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు.
మీ నియోజకవర్గంలో భూ అక్రమాలు అరికట్టండి : పవన్ కల్యాణ్‌కు రామకృష్ణ లేఖ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాంతంలో భూ అక్రమాలను అరికట్టి, ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. కాకినాడ జిల్లా, యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకుగాను 2022లో గత వైసీపీ ప్రభుత్వం రూ.32 కోట్లు వెచ్చించి 72 ఎకరాలు సేకరించిందని, కానీ పేదలకు వాటిని పంపిణీ చేయలేకపోయిందని పేర్కొన్నారు. తదనంతర కాలంలో కొందరు అక్రమార్కులు ఆయా భూములను అక్రమించి సాగు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు కూడా అక్రమార్కులకు సహకరించడం విచారకరమని పేర్కొన్నారు. తనతో పాటు మా పార్టీ ప్రతినిధి బృందం ఆయా భూములలోకి వెళ్లి పరిశీలించామని వివరించారు. ఈ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించి, మూడు సెంట్ల చొప్పున పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.