Friday, February 21, 2025
Homeతెలంగాణఎల్‌ఆర్‌ఎస్‌ షురూ!

ఎల్‌ఆర్‌ఎస్‌ షురూ!

. నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌ కాని ప్లాట్‌లకు కూడా…
. మార్చి 31 వరకు గడువు

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు ప్రగతిపై బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుదిళ్ల శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేసుకోని వారికి, లేఅవుట్‌లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనేక వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్‌ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంలో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన వారికి కూడా 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తారు. పేద ప్రజలు నాలుగు సంవత్సరాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం గురించి ఎదురు చూస్తున్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షించాలని నిర్ణయించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అమలులో భాగంగా అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని, వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుడా ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్దే చెల్లింపులు చేసి ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచిం చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పురపాలక పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్‌ కార్యదర్శి దాన కిషోర్‌, రెవెన్యూ ప్రిన్సిపల్‌ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, హౌసింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు