ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
108, 104 సేవలకు కొత్త సర్వీస్ ప్రొవైడర్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఇప్పటి వరకూ సమస్యాత్మకంగా కొనసాగుతున్న 104, 108 సేవలకు జవసత్వాలు కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సేవలను అందిస్తున్న ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ స్థానంలో ప్రభుత్వం కొత్త ఏజెన్సీని గుర్తించింది. ఈ ప్రక్రియలో భాగంగా దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజల ఆరోగ్య స్థితి నిర్ధారణకు 47 రకాల వైద్య పరీక్షలను 104 వాహనాల ద్వారా ఉళ్లల్లోనే ప్రజలకు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను భాగస్వామిగా ఉన్న కన్సార్షియంను ఇక నుంచి ఈ సేవలను అందించే ఏజెన్సీగా టెండరు ప్రక్రియ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆరోగ్య స్థాయి వివరణాత్మక ప్రొఫైలింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను (ఈహెచ్‌ఆర్) రూపొందించడానికి ఈ పరీక్షలను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత , భవిష్యత్తు వ్యాధుల భారాన్ని అంచనా వేయడం వీలవుతుంది. తద్వారా అవసరాలకనుగుణంగా ప్రభుత్వం తగు చర్యలను చేపట్టడానికి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం 104 అంబులెన్స్‌ల ద్వారా కేవలం మధుమేహం మరియు బీపీ వ్యాధులను గుర్తించడానికి మాత్రమే ‘ర్యాపిడ్ కిట్’ పరీక్షలు చేస్తున్నారు. దీనికి భిన్నంగా నూతన విధానంలో నిర్ధిష్ట ఫలితాలనిచ్చే 47 రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్‌లు, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ అనాలిసిస్, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్‌లకు సంబంధించి 20 పరీక్షలు లబ్ధిదారులకు చేయడం జరుగుతుంది. నిర్ధిష్ట వ్యాధులకు సంబంధించి మరో 27 పరీక్షలను చేస్తారు. కొత్తగా ఈ సేవల బాధ్యతలను స్వీకరించనున్న సర్వీస్ ప్రొవైడర్ సాధారణ 20 పరీక్షలను ఒక్కొక్కరికి రూ.195 ఖర్చుతో చేయడానికి అంగీకరించింది. అంతే కాక ఇతర వ్యాధి పరీక్షలకు కూడా మార్కెట్ రేట్లతో పోలిస్తే సహేతుకమైన ఛార్జీలను ప్రతిపాదించారు. ప్రతి 104 వాహనం ద్వారా రోజుకు దాదాపు 35 మందిని పరీక్షిస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ముందు మొబైల్ మెడికల్ యూనిట్ల డేటా యొక్క విశ్వసనీయతను తనిఖీ చేసేందుకు ఈ నిర్ధారణ పరీక్షలను పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం చేపడుతుంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి కొత్త ఏజెన్సీ ఆయా పరికరాలను ప్రతి 104 వాహనంలో సెమీ-ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, సిబిసి మెషిన్ 3 పార్ట్ ఎనలైజర్, మైక్రోస్కోప్ మరియు ఇంక్యుబేటర్ వంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి వాహనంలో ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను కూడా ఉంటారు.108 మరియు 104 సేవలతో పాటు అత్యవసర ప్రతిస్పందన కేంద్రాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.28 కోట్లు చెల్లిస్తోంది.
కొత్త టెండర్ కింద ఈ ఖర్చు నెలకు రూ.31 కోట్లకు చేరుతుంది. ఇది టెండర్ ధరలో కేవలం 11 శాతం లోపు మాత్రమే పెరుగుదలగా ఉంది. కొత్త ఏజెన్సీ 190 కొత్త 108 వాహనాలను ఖరీదు చేసి ఏర్పాటు చేయడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 108 అంబులెన్స్‌ల డ్రైవర్లకు, నెలకు రూ.2 వేలు అదనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.