నవంబర్ చివరి వారం కన్నా ముందే బీహార్‌లో కొత్త శాసనసభ ఎన్నికలు పూర్తి కావలసి ఉంది. అందుకని అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారనుకుంటున్నారు. దీనికోసం ఎన్నికల కమిషన్ తాజాగా ఓటర్ల జాబితా సవరించాలని సంకల్పించింది. ఇది మామూలుగా జరిగే ప్రక్రియే. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ అధికారులు ఎవరు భారత పౌరులు అన్నది ముందు తేల్చి తరవాత వారు సంతృప్తి చెందితేనే వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కుతుంది. అంటే ఎవరు పౌరులో, ఎవరు కాదో రాజ్యాంగం ప్రకారం జన్మ రీత్యా కాకుండా ఎన్నికల కమిషన్ ఇష్టాయిష్టాల మేరకు తేలుతుందన్న మాట. బీహార్‌లో జరిగేవి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అంటున్నారు. ఇంతవరకు అందిన సమాచారం మేరకు ఇవి నిజంగా ‘‘ప్రత్యేకమైనవే’’. ఇంతకు ముందు దాకా ఓటర్లుగా నమోదు చేయించుకున్న వారు ఫారం ఆరు నింపితే సరిపోయేది. అందులో ఇంటి చిరునామా, వయసు లాంటి వివరాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు ఓటర్లుగా నమోదు చేయించుకోగోరేవారు తాము భారత పౌరులమేనని నిరూపించుకోవలసి ఉంటుంది. బీహార్‌లో ఓటర్ల జాబితా జులై ఒకటో తేదీన మొదలై సెప్టెంబర్ ఆఖరుతో ముగుస్తుంది. అంటే తాము భారతీయులమేనని నిరూపించడానికి అనువైన పత్రాలు తక్షణం సంపాదించవలసి ఉంటుంది. ఇది ఎందుకు సాధ్యం కాదో ఒక్క ఉదాహరణతో తేలిపోతుంది. బీహార్‌లో 80శాతం మందికి మాత్రమే జన్మ నిర్ధారణ సర్టిఫికేట్లు ఉన్నాయి. మిగతా 20 శాతం మంది దగ్గర జన్మ నిర్ధారణ సర్టిఫికేట్లు లేవు. వయసు నిరూపించుకోవడం కోసం, ఈ దేశంలోనే జన్మించామని నిర్ధారించుకోవడం కోసం ఎవరికైనా జన్మ నిర్ధారణ సర్టిఫికేట్ అవసరమే. ఈ సర్టిఫికేట్లు బీహార్ జనాభాలో 20 శాతం మంది దగ్గర లేకపోవడం జన్మించిన వారి తప్పుకాదు. ప్రభుత్వం ఈ వివరాలను నిక్కచ్చిగా నమోదు చేయడానికి శ్రద్ధ తీసుకోనందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిరది. ఎన్నికల కమిషన్ అడిగే పత్రాలలో జన్మ నిర్ధారణ సర్టిఫికేట్ ప్రధానమైంది అవుతుంది. ఇదే లేకపోతే వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కకపోవచ్చు. ఎన్నికల కమిషన్ బీహార్ పౌరులను అనేక రకాల సర్టిఫికేట్లు అడగబోతోంది. అవి లేనివారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చరు. ఎక్కడ పుట్టారో కూడా రుజువు చేయడానికి ఓ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే తాము ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవలసిన బాధ్యత పూర్తిగా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవాలనుకునే వారిదే అవుతుంది. 2023లో ఓటర్ల జాబితాలో పేరు లేనివారు తాము భారత పౌరులమేనని నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ సారి ఓటర్ల జాబితా సవరణ ‘‘ప్రత్యేకంగా’’ ఉండబోతోంది. 2003 తరవాత ఓటర్ల జాబితాలో నమోదైన వారు అదనంగా తాము భారత పౌరులమేనని రుజువు చేసుకోవడానికి తగిన సర్టిఫికేట్ అందజేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఎలా ఉండాలో ఎన్నికల కమిషన్ నిర్ధారిస్తుంది. అంటే పౌరసత్వం నిర్వహించే బాధ్యతను మోదీ సర్కారు ఎన్నికల కమిషన్‌కు బదలాయించిందన్న మాట. ఇంతకు ముందు ఫారం 6లో తాము భారత పౌరులమని పేర్కొంటే సరిపోయేది. ఇప్పుడు ప్రత్యేకంగా సర్టిఫికేట్ సమకూర్చవలసి ఉంటుంది. ఇలా ప్రత్యేక ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమం అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల లోనూ జరుగుతుందట. బీహార్‌లో అక్టోబర్లోనో, నవంబర్‌లోనో ఎన్నికలు జరగనున్నాయి కనక సవరించిన ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30 కల్లా ప్రచురిస్తారు. అందులో లోపాలు ఉంటే ఓటర్లకు మిగిలే సమయం చాలా తక్కువ.
బీహార్‌లో 2003 జనవరి ఒకటో తేదీ ప్రాతిపదికగా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ జరిగింది. ఇప్పుడు సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అంటే ముందు ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారు కూడా అడిగిన సర్టిఫికేట్లు అన్నీ అందజేయవలసిందే. 2023నాటి ఓటర్ల జాబితాలో లేని వారు తమ పేర్లు నమోదు చేయించుకోవడం మరింత కష్టం అవుతుంది. పౌరసత్వాన్ని నిరూపించుకోవడం సులభమైన పని కాదు. పౌరసత్వం నిరూపించు కోవడానికి ఆధార్‌కార్డు లాంటి వాటిని అంగీకరిస్తారో లేదో తెలియదు. అసోంలో ఇలాగే పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కష్టమైనందువల్ల బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలి వచ్చిన వారే కాకుండా ఈ దేశంలో పుట్టిన వారు కూడా తాము ఈ దేశవాసులమే అని నిరూపించుకోవడం కష్టమైంది. అందుకే 40 లక్షల మంది పేర్లు ముసాయిదా జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) నుంచి తొలగించారు. తుది జాబితాలో చివరకు 19 లక్షల మంది పౌరుల పేర్లు ఎన్‌ఆర్‌సీలో కనిపించలేదు. అప్పుడు 1971వ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని పౌరుల జాబితా సిద్ధం చేశారు. అసోంలో మొదటి జాబితా 2018లో, తుది జాబితా 2019లో విడుదలైనా అసలు సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. వచ్చే ఏడాది బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడా ఇలాంటి మతలబు ఏదో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పటి నుంచో ఆందోళన పడుతూనే ఉన్నారు. అసోం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే లక్షలాది మంది పేర్లు ఓటర్ జాబితా నుంచి మాయమైపోతాయి. పౌరసత్వం నిరూపించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చే స్వల్ప సమయంలో ఇలా నిరూపించుకోవడం సాధ్యం కాదు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవడానికి పౌరసత్వం నిరూపించు కోవాలని షరతు పెట్టడం అంటే ఎన్‌ఆర్‌సీని పరోక్షంగా అమలు చేయడమే. అసోంలోనే కాదు దేశమంతటా ఎన్‌ఆర్‌సీ అమలు అవుతుందని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారు సైతం పౌరసత్వం నిరూపించుకోవలసి రావడం చాలా విచిత్రమైన పరిస్థితి. ఇది స్వాతంత్య్రానంతరం నుంచి ఉన్న నియమాలను బలా దూరుగా మార్చేయడమే. పౌరసత్వ చట్టం ప్రకారం మోదీ ప్రభుత్వం పౌరసత్వానికి మతం కూడా జోడిరచిందని మరిచిపోకూడదు. పౌరసత్వాన్ని నిరూపించుకో వడానికి తగిన పత్రాలు ఉండాలి అంటే ఎక్కువగా నష్టపోయేది గ్రామీణ ప్రాంతాల ప్రజలే. ఈ సాకుతోనే గతంలో కూడా ఏలిన వారికి ఇష్టం కాని వారు ఓటర్ల జాబితాలో స్థానం కోల్పోయారు. వారి స్థానంలో ఇతర ప్రాంతాల వారి పేర్లు చేర్చి మొత్తం ప్రక్రియనే భ్రష్టు పట్టించిన ఘనత మోదీ ప్రభుత్వానికి ఉంది. ఎన్‌ఆర్‌సీని దొంగ చాటుగా అమలు చేయడం, ఎవరు పౌరులో ఎవరు కాదో నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్ అధికారులకే కట్టబెట్టడం దుర్మార్గాల్లోకెల్లా దుర్మార్గం. ఇది క్రమంగా అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేస్తారు. అదే జరిగితే అత్యంత ప్రమాదకర స్థితి తప్పదు.