Homeవిశ్లేషణకడప ఉక్కు పరిశ్రమ… మోదీ ప్రభుత్వం దగా

కడప ఉక్కు పరిశ్రమ… మోదీ ప్రభుత్వం దగా

- Advertisement -

టి. లక్ష్మీనారాయణ

జే.ఎస్.డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూలై 3న ప్రారంభించారు. రూ.16,350 కోట్ల పెట్టుబడితో, రెండు దశల్లో, ఏడాదికి 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నెలకొల్పుతున్న ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా 3,850 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగితే శుభపరిణామంగా పరిగణించవచ్చు! అయితే, ప్రైవేటు రంగంలో నిర్మించ తలపెట్టిన ఈ స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, షెడ్యూలు 13, మౌలిక సదుపాయాల పద్దు కింద ప్రస్తావించిన భారీ “ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్”కు ఏ మాత్రం పొంతన లేదు. కడప ఉక్కు పరిశ్రమ అంశంపై మోడీ ప్రభుత్వం దగా చేసిందన్న వాస్తవాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. 2014 ఎన్నికల ప్రచారంలో, “తల్లిని చంపి బిడ్డను వీధిలో పడేశారు” అని అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్న వ్యక్తిలా మోదీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లకు పైగా గడిచింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలను ఒకదాని తర్వాత ఒకటి పాతరేసింది. వాటిలో కడప ఉక్కు పరిశ్రమ ఒకటి. “స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్)” ఆధ్వర్యంలో నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం చట్టంలో వాగ్దానం చేసింది. “సెయిల్” తన ఫిజ్ఙిలిటీ రిపోర్ట్ లో లాభదాయకంకాదని పేర్కొన్నదని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రజలను వంచించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ‘ఓబులాపురం మైనింగ్ కంపెనీ’ ‘బ్రహ్మణి స్టీల్స్‌’ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్న విషయం గమనార్హం. భారీ అవినీతికి పాల్పడినందుకు గాలి జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆ వ్యవహారం ముగిసిపోయింది.ప్రభుత్వం ఆ కంపెనీకి కేటాయించిన సుమారు 12,000 ఎకరాల భూమి ఇప్పుడు న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. నేడు జే.ఎస్.డబ్ల్యూ సంస్థ లాభదాయకత లేకపోయినా రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకుందా! అంటే, ప్రైవేటు రంగంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి లాభదాయకత ఉంటుంది. కానీ, ప్రభుత్వ రంగంలో నెలకొల్పడానికి మాత్రం ఉండదు. ఇదేనా, కేంద్ర ప్రభుత్వ ఆర్థికనీతి ప్రజాస్వామ్య నీతి? బ్రాహ్మణీ స్టీల్స్‌కు డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ – ప్రైవేటు – భాగస్వామ్యం (పిపిపి) పథకం క్రింద ఏర్పాటు చేస్తామంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసి నారా చంద్రబాబునాయుడు మరియు జే.ఎస్.డబ్ల్యూ (జిందాల్) పరిశ్రమ నిర్మాణానికి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు, ఇలా శంకుస్థాపనల పరంపర తర్వాత ఇప్పుడు జే.ఎస్.డబ్ల్యూ పరిశ్రమ నిర్మాణ పనులను చంద్రబాబునాయుడు తాజాగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి హక్కుగా సాధించుకోవాల్సిన కడప ఉక్కు పరిశ్రమను మరచిపొమ్మని, నాటి-నేటి పాలకులు కరవు కాటకాల మధ్య కునారిల్లిపోతున్న, పారిశ్రామికంగా వెనుకబడిన రాయలసీమ ప్రజలకు చావు కబురు చల్లగా చెప్పేశారు.అనంతపురం జిల్లా ఓబుళాపురం మరియు పొరుగున్ను కర్ణాటక రాష్టంలోని బళ్ళారి ప్రాంతంలోను, రాయలసీమ ప్రాంతంలోని ఇతర జిల్లాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావలసిన ముడి ఖనిజం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు మరియు ప్రభుత్వం కూడా చెబుతున్నది. ఈ ప్రాంతంలో లభించే ముడి ఇనుప ఖనిజాన్ని వినియోగ వస్తువుగా మార్చి, విలువను జోడించి, దేశీయంగా వాడుకోవడం లేదా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా జాతీయ ఉత్పత్తిని పెంచేలా కేంద్ర ప్రభుత్వ రంగంలో భారీ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసే విజ్ఞతను పాలకులు ప్రదర్శించకపోవడం శోచనీయం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు