. మిర్చి ధరల పతనంపై అత్యవసర సమావేశం
. కేంద్ర మంత్రులు రామ్మోహన్, చంద్రశేఖర్ హాజరు
. క్వింటాకు కనీసం రూ.11,600 మద్దతు ధర ప్రకటించాలని వినతి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : మిర్చి ధరల పతనం, పెట్టుబడులు రాని పరిస్థితుల్లో రైతులు పడుతున్న ఆర్థిక కష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతులకు చేయూతనిచ్చే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మిర్చి రైతులను ఏ విధంగా ఆదుకోవాలి ? పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలనే అంశాలపై అధికారులతో చర్చించారు. సీఎం చంద్రబాబు గురువారం దిల్లీ వెళ్లిన సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మిర్చి ధరలు ఈ ఏడాది దారుణంగా పడిపోవడం, రైతులు పెట్టుబడులు కూడా రాని పరిస్థితిల్లో తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితులను వివరించారు. దేశం మొత్తం మీద మిర్చి ఉత్పత్తిలో సగం ఏపీ నుంచే వస్తుంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు 12 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 4 లక్షల టన్నుల ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రేట్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ జోక్యం పథకం కింద 25 శాతం పంటను కొనుగోలు చేయవచ్చునని, అవసరమైతే ఈ సీలింగ్‌ను తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. మిర్చి ధరలను సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేసినట్లు కనిపిస్తోందని, దానిని సరిదిద్దాలని సూచించారు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పంచుకోవాలి, ఎగుమతులను స్థిరీకరించడానికి ఏం చేయాలో కూడా ఆలోచించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తక్షణమే అధికారులతో సమావేశమై చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి చౌహాన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి సమస్యపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు.
అనంతరం మీడియాతో రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామని తెలిపారు. క్వింటాకు కనీసం రూ.11,600 పైగా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. మిర్చి ఎగుమతులు, ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే అంశంపై కూడా భేటీలో చర్చించామన్నారు. సమస్య చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి చౌహాన్ స్పందించి, ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని, మార్కెట్ ధర, ఉత్పత్తి ఖర్చుకు మధ్య తేడా పరిశీలిస్తామన్నారు. ఏపీలో మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నారని చెప్పాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల మిర్చి రైతులకు లబ్ధి కలిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.