వి.శంకరయ్య
భారత దేశంలో బీజేపీ చరిత్ర ఎవరైనా రాసే సందర్భంలో రెండు అధ్యాయాలుగా రాయవలసి ఉంటుంది. గుజరాత్ నాయకద్వయం వెనుక, ముందుగా లిఖించ వలసి వుంటుంది. 2014 సాధారణ ఎన్నికల తర్వాత నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తదుపరి వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు కమలనాథుల కుట్రలకు బలై చీలి పోవడమో లేక వాతంతట అవి అంతర్థానం కావడమో జరిగింది. అందువల్ల ప్రాంతీయ పార్టీల చరిత్ర లిఖించే సమయంలో కూడా రెండు అధ్యాయాలుగా పేర్కొనవలసి ఉంటుంది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి స్వాతంత్య్రం తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తదనంతర పరిణామ క్రమంలో అంతర్గత కలహాలు కావచ్చు, పటిష్టమైన నాయకత్వ లేమితో కావచ్చు లేదా అవినీతి అక్రమాల ఊబిలో కూరుకుపోవడంతో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతో రాజకీయ శూన్యత ఏర్పడి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి అధికారం చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఆవిర్భవించినదే. ఇది ఒక దశ. గుజరాత్ నాయక ద్వయం బీజేపీ నాయకత్వం చేపట్టిన తర్వాత రెండవ దశ మొదలైంది. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలు శంకరగిరి మాన్యాలు పట్టడం రెండవ దశ. బీజేపీి నేత వాజపేయి అయిదేళ్లు ప్రధాన మంత్రిగా వున్నా ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ బలి పశువు కాలేదు. వాజపేయి ప్రభుత్వానికి బయట వుండి బలపర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుజరాత్ లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో జరిగిన మారణహోమానికి ఆయన బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్భీతిగా కోరారు. మరి ఇప్పుడు తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు నిక్కచ్చిగా వ్యతిరేకించిన సెకీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రజల క్షేమం దృష్ట్యానైనా రద్దు చేయలేని సంకటస్థితిలో చంద్రబాబు వున్నారు. గుజరాత్ నాయక ద్వయం రాజకీయంగా నేడు ఎంత బలీయంగా వుందో దీనిబట్టి అవగతం చేసుకోగలం. ఈ ఇబ్బంది మున్ముందు మరింతగా ఎదుర్కొనవలసి రావచ్చు.
ప్రాంతీయ పార్టీల అంశానికొస్తే మహారాష్ట్రలో మరాఠా నినాదంతో బాల్‌థాక్రే నాయకత్వంలో ఆవర్భవించిన శివసేన తొలి నుంచి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేది. బాల్ థాక్రే శకం గడచి పోయి రెండవ తరం నాయకత్వం చేపట్టిన తర్వాత స్వతంత్రంగా వ్యవహరించగానే శివసేనను కమలనాథులు నిట్టనిలువునా రెండుగా చీల్చారు. ఒక వర్గ నేతను ముఖ్యమంత్రిని చేశారు. తుదకు ఏమైంది? షిండేకు ముఖ్యమంత్రి పదవి మున్నాళ్ల ముచ్చట అయింది. నేడు పూలు అమ్మిన చోటే కట్టెలమ్మ వలసి వచ్చింది. అలాగే ఒకప్పుడు ఇందిరాగాంధీతో ఢీ అంటే ఢీ అనగలిగిన మహారాష్ట్ర నుంచి జాతీయ నాయకుడుగా వున్న నేషనల్ కాంగ్రెస్ నేత శరద్‌పవార్ కుటుంబంలోనే కమలనాథులు చిచ్చు పెట్టి పార్టీని రెండుగా చీల్చారు. ఇప్పుడు రెండు వర్గాలు గిలగిల తన్నుకు లాడుతున్నాయి. చీలిక వర్గ నేత అజిత్‌పవార్ తమ మాటలకు చేతలకు సంబంధం లేకుండా వ్యవహరించ వలసిన దుస్థితిలో వున్నారు. ఈ జాబితాలోనికి మున్ముందు ఎంత మంది ప్రాంతీయ పార్టీల నేతలు రాబోతున్నారో వేచి చూద్దాం!
ఒడిశాలో బిజూపట్నాయక్ వారసత్వంతో సుదీర్ఘ కాలం అధికారం వెలగ బెట్టిన నవీన్ పట్నాయక్ 2014 తర్వాత అంశాల వారీగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పినా ఏనాడు ఏ అంశంపై కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భం లేదు. అంత అణకువుగా ఉన్న ప్రాంతీయ పార్టీ మిత్రుణ్ణి కమల నాథులు సమయం చూచి బలహీనత ఆధారం చేసుకొని చావుదెబ్బ కొట్టి ఒడిశాలో అధికారం కైవశం చేసుకొన్నారు. ఇక పంజాబ్‌లో అకాలీ దళ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ప్రకాశ్‌సింగ్ బాదల్ అకాలీదళ్ క్షీణదశకు చేరుకొంది. మన పక్కనే వున్న తమిళ నాడులో బీజేపీ ఆడిన ఆట బెడిసికొట్టినా అంతిమంగా జయలలిత నెచ్చెలి శశికళ జైలు పాలైంది. కమలనాథులు వ్యూహంలో చిక్కుకున్న అన్నాడిఎంకె రెండుగా చీలిపోయి తుదకు అధికారమూ కోల్పోయింది. మరొక రాష్ట్రం కర్నాటక. దేవగౌడ జేడీయూ పార్టీ ఆధారంగా బీజేపీ ఆడిన ఫిరాయింపుల నాటకం చెబితే చరిత్ర చర్విత చరణం అవుతుంది. దేవగౌడ లాగే జేడీయూ పార్టీ కూడా నేడు ముసలిదై పోయి పూర్తిగా బలహీనపడిరది. మిత్ర లాభమంటే మిత్రుడు ఏ కారణం చేతనైనా బలహీన పడితే చేయి అందించే విధంగా వుండాలి. కాని కమలనాథులు వ్యూహం ఏలా వుంటుందంటే అవసరమైన మేరకు ఉపయోగించుకొని అంతిమంగా వారి బలహీనతలు ఆధారం చేసుకొని తొక్కేసి ఆ స్థానం ఆక్రమించే విధానమే మిత్రభేదం. ఈ మిత్రభేదంతో కమలనాథుల చేతిలో అనేక ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయి.
యూపీలో చరణ్‌సింగ్ నాయకత్వాన వున్న ఆర్‌ఎల్‌డి పార్టీ, అసోంలో బలీయంగా వున్న అస్సాం గణతంత్ర పరిషత్ (ఏజీపీ), హర్యానాలో చౌతాలా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీి ఇంకా చాల ప్రాంతీయ పార్టీలు ఈ జాబితాలో వున్నాయి. బీహార్‌లో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ బీజేపీితో ఎన్ని మార్లు జట్టుకట్టిందో, ఎన్ని మార్లు విడిపోయిందో రాస్తే పెద్ద ఉద్గ్రంధమే అవుతుంది. ప్రస్తుతం చంద్రబాబునాయుడుతో పాటు పవన్‌కల్యాణ్ తెర మీదకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జాతీయ స్థాయిలో వున్న పరపతి ప్లస్‌గా వున్నా కమలనాథుల వద్ద అది మైనస్‌గా వుంది. గుజరాత్ నాయకద్వయం తమ ముందు జాతీయ స్థాయిలో పరపతి వుండే నేతగా మెలగడానికి ఇష్టముండదు. బీహార్‌లో నితీశ్ కుమార్‌కు ఆ ఇమేజ్ లేదు – కాబట్టి అనేక మార్లు విడిపోయి కలిసినా ఇప్పుడు రాజకీయంగా సజీవంగా వున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామిగా లేక బయట వుండి గాని బలపర్చిన వారిలో చంద్రబాబునాయుడు లాగా జాతీయ స్థాయిలో పేరు వున్న నేత ఒక్కరూ లేరు. 2014-19 మధ్య ఆఖరు దశలో టీడీపీి బీజేపీి మధ్య చెడటానికి ఇది కూడా ఒక కారణం. చాలా మందికి గుర్తు వుండక పోవచ్చు. 2014 తర్వాత కేంద్ర మంత్రిగా వున్న బీజేపీి నేత వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోయిందని దాని స్థానంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ పూర్తి చేస్తుందని పదే పదే చెప్పేవారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. దాని స్థానం వైసీపీి ఆక్రమించగా సంఫ్‌ు పరివార భావజాలం వ్యాప్తికి అనువైన సామాజిక భౌతిక సైద్ధాంతిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం వెంకయ్యనాయుడు గమనించలేదంటే నమ్మగలమా? కాబట్టే ఆ కాలంలో ఒక వేపు టీడీపీతో మైత్రి వున్నా పరోక్షంగా మరో ప్రాంతీయ పార్టీ నేత జగన్ మోహన్‌రెడ్డికి అండదండలు ఇవ్వసాగారు. ఎప్పుడూ కమలనాథుల వ్యూహం ఇలాగే వుంటుంది. అప్పట్లో టీడీపీి -బీజేపీ మధ్య చెడటానికి ఇదొక కారణంగా వుంది. జగన్ మోహన్‌రెడ్డి తనపై కేసులు లేకుంటే ఎలా వ్యవహరించే వారో ఏమోగాని బీజేపీి తాన అంటే తందానా అంటూ ఐదేళ్లు గడిపారు. ఈ లోపు లడ్డూలాగా బీజేపీికి మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కల్యాణ్ లభ్యమైనాడు. కాబట్టి టీడీపీితో పొత్తుకు సిద్ధమయ్యారు. అయిదేళ్లు తమ కొమ్ము కాచిన జగన్‌మోహన్‌రెడ్డికి నిర్థాక్ష్యిణ్యంగా రాంరాం చెప్పారు. దేశంలో బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని బక్క చిక్కిన ప్రాంతీయ పార్టీల నేతల జాబితాలో జగన్‌మోహన్‌రెడ్డి కూడా చేరిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు ముక్కలాట సాగుతోంది. వాస్తవంలో కూటమి ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏమాత్రం లేకున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా వ్యవహరిస్తున్నా పవన్‌కల్యాణ్ మాత్రం పదేపదే పాతికేళ్లు కూటమి ప్రభుత్వం వుంటుందని చెప్పడం పైననే చాలామంది సందేహించవలసి వస్తోంది. అదీ అధికారంలోకొచ్చి సంవత్సరం కాకముందే!
విశ్రాంత పాత్రికేయులు 9848394013