చింతపట్ల సుదర్శన్
మునిమాపు వేళ అయినా ఎండ మండేకాలం కనుక భాస్కరరావు ఓవర్ టైం డ్యూటీ చేసే రోజులు కనుక చీకటి ఇంకా చిక్కబడలేదు. అరుగు మీద ఆ రోజు నమిలిన దినపత్రికలోని విషయాలు మననం చేసుకుంటున్నది డాంకీ. నమిలిన ఎముకల రుచిని గుర్తు చేసుకుంటున్న డాగీ, ఉలిక్కిపడి లేచి ఒళ్లు దులుపుకు నిలబడిరది.
మైదానంలో నడిచి ఇటే వస్తున్నది ఓ మంకీ క్యాపు. అది ముఖాన్న పెట్టుకు వస్తున్న మనిషి ఎవడో కాని భయం లేకుండా అరుగు వైపే వస్తున్నాడు. మంచి మనుషులకు ఎల్లకాలమూ ‘ఫెయిత్ ఫుల్లు’ గా ఉండే డాగీ ఇక్కడ లేదనుకుంటున్నాడు ఈ దొంగ నా కొడుకు అనుకున్న డాగీ యాక్షన్‌లోకి దిగిపోయింది. తల పైకెత్తి తోకను నాన్‌స్టాప్‌గా ఊపుతూ, ‘భౌ’ రాగం లంకించుకుంది. అరిచే కుక్కలు కరవ్వనే దురభిప్రాయం ఉన్న మనుషులు కూడా జడుసుకునే ఆ అరుపులకు వస్తున్నవాడు కాలికి బుద్ధి చెప్తాడనుకుంది డాగీ. కానీ దాని ఒపీనియన్ తప్పని అర్థం కావడానికి ఆట్టే సమయం పట్టలేదు. కోతి టోపీ ముఖాన్న తొడుక్కున్నవాడు అరుగు ఎక్కసాగాడు. అరిస్తే భయపడని వాడ్ని కరిస్తే తప్పేలేదు అనుకుంటూ ముందుకురికింది డాగీ ఆపకుండా అరుస్తూ. అప్పటికి డాంకీ కూడా మంకీ క్యాపు మనిషిని చూస్తూ లేచి నిలబడ్డది అవసరం అయితే కుక్కకు సాయంగా వెనక కాళ్లు ఉపయోగించడానికి.
‘ఆగు ఆగు! నేను నేను’ అంటూ అరుగు ఎక్కుతున్న అబ్బాయి మంకీ క్యాపు తీసి చేత్తో పట్టుకున్నాడు. నువ్వా ‘బ్రో’ ఏమిటీ వేషం కాస్తయితే బొడ్డు చుట్టూ సూదులు పొడిపించుకునే అవస్థ పట్టేది అంది డాగీ వెనక్కి తగ్గి. అయినా ఎన్నడూ లేనిది ఈ క్యాపేంటి ‘కాకా’ చలి కాలం బైబై చెప్పేసి వెళ్లిపోయిందిగా అంది డాంకీ. ఏం చెప్పను ఉద్యోగం సద్యోగం లేదని తేలిపోయింది కదా. పార్టీలు మారినా, హామీలు పెరిగినా ఒరిగేదేమీ లేదని తేలిపోయింది కదా. పార్టీలు మారినా ముడిసరుకు అదే మనుషులూ వాళ్లే కద ఊడబొడుస్తామని ఢంకా బజాయించే వాళ్లు కాని ఊడబొడిచే వారెవరూ లేరు రారు. అందుకే ఈ వేషం కట్టా. ఇటీవల ఓ స్వామీజీ దర్శనం చేసుకున్నా అని అబ్బాయి అంటుండగానే, స్వామీజీ అనగా పిచ్చుక గూడు జుట్టూ, బారెడు గడ్డమూ ఉండేవాడే కదా అంది డాంకీ. అసలు స్వామీజీలకు బారెడు గడ్డం ఎందుకో అంది డాగీ. ఎందుకేమిటి పూర్వాశ్రమంలో వారు ఏ ఛండాలపు పనిచేసే వారో తెలీకుండా ఉండడానికి. అసలు సంగతి వినండి. నేను దర్శనం చేసుకున్న ఆ స్వామీజీయే ఈ మంకీ క్యాపు ఇచ్చారు. వారు పూర్వాశ్రమంలో చిల్లర దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, హౌజ్ బ్రేకింగులు చేసిచేసి విసుగు వచ్చి, జైల్లో ఒళ్లు పచ్చి పుండయి వచ్చి ఇప్పుడు స్వామీజీ అయిపోయి కడుపులో నెయ్యి కదలకుండా భక్తులకు దర్శనమిస్తూ, ప్రవచనం చెప్తూ, ఆశీర్వదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోకంలో బైరాగులుగా మారడానికి లేదా రాజకీయ నాయకులుగా మారడానికి, చదువు అబ్బని వారు, ఉద్యోగం చిక్కని వారు ముందుగా ‘అప్రెంటిస్ షిప్’ అనగా ట్రైనింగ్ చెయ్యాలని అది మరోటీ ఇంకోటీ కాకుండా చేతివాటం చూపించే చిల్లర నుంచి టోకు దొంగతనాల వరకూ చెయ్యడమేనని సెలవిచ్చారు అన్నాడు అబ్బాయి.
అంటే గడ్డాల బైరాగులు, ఎన్నికయ్యే లీడర్లూ అంతా పూర్వాశ్రమంలో దొంగలే అయి ఉండాలంటావా అంది డాగీ. అందరూ అక్కర్లేదనుకో. కొందరికి ఈ బయోగ్రఫీ తప్పదనుకో. ఈ అనుభవం మనుషులు రాజకీయ నాయకులుగా రాటు దేలడానికి బాగా పనికొస్తుందన్నారు. మంకీ క్యాంపుల్తో దొంగతనాలు చేసి ఆ తర్వాత ప్రజల సొమ్ము బాహాటంగా దోచుకోవచ్చుట. పైగా లీడర్‌గా అవతారం ఎత్తిన వాడిని పాత కేసులు ఏమీ చెయ్యలేవుట. పదవిలో ఉన్నంత కాలమూ ‘బెయిళ్లు’ శ్రీరామరక్షగా ఉంటాయట అన్నాడు అబ్బాయి. అందుకా ‘బ్రో’! సీసీ కెమెరాల కళ్లు కప్పడానికా ఈ మంకీ టోపీ ధరించావు. అయినా ఆ స్వామీజీఎవరో మరీ పాతకాలపు పగటి దొంగలా ఉన్నాడు. ఈ డిజిటల్ కాలంలో కన్నాలు వేయడం, తాళాలు పగులగొట్టడం చాతయిన వస్తాదు దొంగలేరీ అంతా బక్క పీనుగులే. నేను అరిస్తే జడిసి పారిపోయే వాళ్లే. పైగా శారీరక శ్రమతో ఎవరూ ఏమీ సాధిచలేని కాలమిది చెమట తప్ప. దొంగల ఫ్రొఫెషన్ ఎంత మోడర్న్ అయింది, ఎంత టెక్కికల్ అయింది తెల్సుకోవాలి నువ్వు. కూచున్న చోటునించి కదలకుండా ‘సెల్లుఫోన్’ లో మాట్లాడి మనుషుల్ని బురిడీ కొట్టించి లక్షలూ, కోట్లూ సునాయాసంగా కాజేసే కాలమిది. మంకీ క్యాపు చించేసి సైబర్ క్రైమ్ మెంబర్‌వయి పో ‘చిక్కడు దొరకడు’ గా మారిపో అంది డాంకీ.
ఆ తర్వాత అంతో ఇంతో డబ్బు సమకూరాక ఏదో ఓ పార్టీలో చేరిపో. రాజకీయం రాకపోతే రియల్ ఎస్టేట్ ఉండనే ఉంది. అదీ కాకపోతే బ్రోకరిజమో, బోర్డు తిప్పేసే బిజినెస్సో ఏదో ఓటి చెయ్యి. కాకపోతే అన్ని పాపాలనూ కడుపులో దాచుకునేది ఒక్క రాజకీయమే అనే మాట వేదవాక్కుగా గుర్తుంచుకో అన్నది డాగీ. అయితే మంకీ క్యాపుతో పని లేదంటారు. మీరన్న మిగతా సాహసాలు చెయ్యలేను కాని, గడ్డం దట్టంగా పెంచి ఆ స్వామీజీ దగ్గరే శిష్యుడిగా చేరిపోతానన్నాడు అబ్బాయి మంకీ క్యాపు విసిరి పారేస్తూ.న ఎల్.బి.ఎఫ్.ను వేరే బిజినెస్ పీపుల్స్‌కు పరిచయం చేసి వారికున్న సందేహాలను విజయవంతంగా నివృతి చేయడం జరిగింది.