దోనేపూడి శంకర్
పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కార్మిక బాంధవుడు. మద్రాసు శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికైన ఏకైక శాసన సభ్యుడు. అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారిని నిండు శాసనసభలో ఆయన పెట్టుకున్న నల్ల కళ్ళజోడు తీసి వాస్తవాలు చూడమని గర్జించినవాడు. ఆంధ్ర రాష్ట్ర తొలి తరం కమ్యూనిస్టు నాయకుల్లో ఒకరు. 1912లో గుంటూరు జిల్లా శిష్ట్లా వారి మంచాడా అగ్రహారంలో పుట్టిన పిల్లలమర్రి 1933-34 లో ఇంటర్మీడియట్ పరీక్ష తప్పారు. పరీక్ష పాస్ అవ్వాలని తెనాలి వచ్చి రోేజూ గ్రంధాలయానికి వెళ్లి అధ్యయనం చేసేవారు. కాంగ్రెస్ నాయకుల ఉపన్యాసాలు విని ప్రభావితులయ్యారు. భగత్ సింగ్కు మరణశిక్ష రద్దు చేయించాలని భారత దేశ యువజనులు దేశవ్యాపితంగా ఆందోళన చేసినా మహాత్మా గాంధీ అలా చేయకపోవడంతో గాంధీ సిద్ధాంతాలపైన పిల్లలమర్రికి నమ్మకం సడలింది. తెనాలిలో పోలేపెద్ది నరసింహమూర్తి ప్రభావంతో మార్క్సిజంవైపు ఆకర్షితులయ్యారు. తెనాలిలో వున్న మునిసిపల్ వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్లని సంఘాలుగా నిర్మాణంచేసే బాధ్యత పిల్లలమర్రికి పోలేపెద్ది అప్పగించారు. గుంటూరులో ఆనాడు కమ్యూనిస్టు నాయకులుగా జొన్నలగడ్డ రామలింగయ్య, దుర్భా కృష్ణమూర్తి, ప్రతాప రామసుబ్బయ్య నాయకులుగా వున్నారు. వారితో పరిచయాలు కూడా పిల్లలమర్రిని ప్రభావితం చేశాయి. పోలేపెద్ది నరసింహమూర్తి పిల్లలమర్రిని విజయవాడకు పార్టీలో పనిచేసేందుకు పంపించారు. పార్టీ ఆఫీసులోనే వుంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ సమయంలో దత్-బ్రాడ్లీ థీసిస్ గురించి, కమ్యూనిస్టు విధానాల గురించి మద్రాసులో ప్లీనం జరిగింది.
ఆ తర్వాత 1936లో జరిగిన కాకినాడ సమావేశంలో దత్-బ్రాడ్లీ థీసిస్ ఆధారంగా కమ్యూనిస్టు పార్టీ పంధా రూపొందింది. అప్పుడు విజయవాడ పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా వున్న కృత్తివెంటి కుటుంబరావుతో పిల్లలమర్రి, గెల్లి రాజగోపాలం కమిటి సభ్యులుగా ఉండి పనిచేశారు. రాష్ట్ర యువజన ఉద్యమంలో పిల్లలమర్రి చేసిన కృషి మరువలేనిది. రాష్ట్రవ్యాప్తంగా యువజనోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. కృష్ణాజిల్లా యువజన సంఘం కార్యదర్శిగా పిల్లలమర్రి, అధ్యక్షులుగా పిడికిటి మాధవరావు గట్టి కృషి చేశారు. ఆంధ్రదేశంలో కార్మిక ఉద్యమం నిర్మించడంలో పిల్లలమర్రి కృషి విశిష్టమైనది. పిల్లలమర్రి స్థాపించిన లేబర్ ప్రొటెక్షన్ లీగ్ తర్వాత కాలంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిలుగా రూపు దిద్దుకుంది. అప్పుడు సీవీకే రావు అధ్యక్షులుగా, పిల్లలమర్రి కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. పోలేపెద్ది నరసింహమూర్తి ట్రేడ్ యూనియన్ రంగానికి ఇంచార్జి. ఈ సంస్థ కింద తోళ్ల పనివారి సంఘం, మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం మీద ప్రెస్ వర్కర్స్ యూనియన్ స్థాపించారు. ఏలూరులో జూట్ వర్కర్స్ యూనియన్, చీరాలలో టుబాకో వర్కర్స్ యూనియన్ నిర్మించారు. రాష్ట్రంలోనే తొలి కమ్యూనిస్టు సెల్ ఏర్పాటు చేసిన ముత్తేవి మాధవాచార్య కూడా పిల్లలమర్రికి స్ఫూర్తి ఇచ్చారు.
1946 మార్చిలో మద్రాసు శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల సర్వసాధారణ కార్మిక నియోజకవర్గం తరఫున శాసనసభకు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. మద్రాసు శాసనసభకు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎన్నికైన సభ్యులు పిల్లలమర్రి. ఆయన మద్రాసు శాసనసభ సభ్యుడిగా కొనసాగుతుండగా మద్రాసు ప్రజాశాంతి సంరక్షణ చట్టం ప్రకారం జారీ చేసిన ఆదేశాల మేరకు 1948 నవంబరు 7న అరెస్టు అయ్యారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నందున పార్టీని నిషేధించిన తర్వాత అరెస్టు చేశారు. కడలూరు సెంట్రల్ జైలులో అక్రమ నిర్బంధంలో పెట్టారు. 1951లో జరిగిన ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1955, 1962 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. పిల్లలమర్రి దాదాపు యాభై ఏళ్ల పార్టీ జీవితంలో పార్టీ విధానాలకు కట్టుబడి పార్టీలోనూ, అసెంబ్లీలోను కృషిచేశారు. మన దేశ చరిత్ర, సంస్కృతి, తత్త్వ శాస్త్రాలను అధ్యయనం చేయాలనీ, భారతీయ మనస్తత్వాన్ని అవగాహన చేసుకోవాలని పిల్లలమర్రి చెప్పేవారు. పిల్లలమర్రి 2000 సంవత్సరంలో కన్నుమూశారు. ఆయన జీవితం నేటి యువతకు, కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం కావాలి. అటువంటి మహానేత విగ్రహాన్ని శాసనసభకు ఆయన ప్రాతినిధ్యంవహించిన జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిస్వార్థ ప్రజాసేవకుడు అయిన పిల్లలమర్రి విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య హామీ ఇచ్చారు.
` కార్యదర్శి, సీపీఐ ఎన్టీఆర్ జిల్లా