తాజా సర్వే ఫలితాలు వెల్లడి
చెన్నై: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం తమిళ రాజకీయాలు ఆసక్తిరేపుతున్నాయి. సమీకరణలు, పొత్తులతో రాజకీయ పార్టీలు బీజీగా ఉన్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల పనులు చురుగ్గా సాగిస్తున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో డీఎంకే ఉంది. మరోపక్క అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేû లక్ష్యంతో పని చేస్తున్నారు. మరో పక్క కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అదేవిధంగా నామ్ తమిళర్ కట్చి కూడా ప్రతి ఎన్నికలోనూ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన ఓ సర్వేలో డీఎంకే కూటమికి 104 నుంచి 114 స్థానాలు దక్కుతాయని, మెజారిటీకి కావాల్సిన 118 స్థానాలకే కష్టపడుతుందని తెలిసింది. అదే సమయంలో అన్నాడీఎంకేకు 127 స్థానాలు దక్కే అవకాశం ఉందని సమాచారం. విజయ్ టీవీకే 15 శాతం ఓట్లు సాధిస్తుందని, నామ్ తమిళర్ కట్చి 8శాతం ఓట్లతో నాల్గవ స్థానంలో నిలుస్తుందని తెలుస్తోంది. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేల్లో తేటతెల్లమైంది.
ప్రభుత్వ అసమ్మతి ఓట్లు ఎటువ
ప్రభుత్వ అసమ్మతి ఓట్లు ఎటువైపు పడతాయనేదానిపై ఇప్ప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. డీఎంకే అసంతృప్తి ఓట్లు సాధారణంగా ప్రతిపక్షమైన అన్నాడీఎంకేకు పడకుండా విజయ్‌కు పడే అవకాశం ఉండటమే ఈ ఎన్నికల్లో కీలక మలుపని తెలిసింది. దీంతో డీఎంకే చాలా నియోజకర్గాల్లో స్వల్ప తేడాతో విజయావకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని సర్వేలు చెపుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా విజయ్ నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విజయ్ పొందే 15శాతం ఓట్లు ఎవరు అధికారంలోకి రావాలనేది తీర్మానిస్తుందని తాజా సర్వే కూడా నిర్ధారించింది. చాలా మంది రాజకీయ నిపుణులు కూడా స్టాలిన్, ఎడప్పాడి పళనిసామిలలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నిర్ణయించే శక్తిగా విజయ్ మారుతారనే చెబుతున్నారు. తాజా సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో విజయ్, త్రిష వ్యవహారం, కరూర్ తొక్కిసలాట కేసు తదితర సమస్యలతో విజయ్ సతమతమవుతున్నారు. సర్వేలో చెబుతున్నట్లుగా విజయ్ ప్రభావం ఎంత వరకు ఉంటుందో వేచి చూడాలి.
ఓట్ల చీలికపై ఉత్కంఠ…
ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేను ఇష్టపడనివారి ఓట్లు టీవీకేకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అలాగే యువ ఓటర్లు కూడా విజయ్ పక్షాన నిలవొచ్చని, తద్వారా ఈ ఎన్నికల్లో టీవీకే ఓ కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని సర్వేలో తేలింది. డీఎంకే కంచుకోటగా భావించే ప్రాంతాలలో టీవీకే పొందే ఓట్లతో అధికార పార్టీకి అతిపెద్ద నష్టం ఏర్పడుతుందని తెలిసింది. ఇంకా అన్నాడీఎంకే నుంచి కూడా సీనియర్ నేత సెంగోట్టయన్ తదితర కొంత మంది కీలక నేతలు టీవీకేలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లు కూడా టీవీకేకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెపుతున్నారు. ఏది ఏమైనా విజయ్ ఈ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపుతారనేది రాజకీయ విశ్లేషకుల భావన.


