. యోగి రాజీనామా చేయాల్సిందే
. ఉభయసభల్లో ప్రతిపక్షాల నిరసన… వాకౌట్
న్యూదిల్లీ : ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. తొక్కిసలాట ఘటనపై చర్చించాలని, మరణించిన వారి అసలు జాబితాను ప్రకటిం చాలని లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమైన వెంటనే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ప్రతిపక్ష పార్టీలు అందుకు ససేమిరా అన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవలే తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్చించాలని ప్రతిపక్ష పట్టుబట్టారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని నిలిపివేసి, తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ నిరాకరించడంతో వెల్‌లోకి దూసుకొచ్చి… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సనానతన వ్యతిరేక ప్రభుత్వాన్ని (యూపీలో యోగి సర్కారు) గద్దె దించండి అంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. తొక్కిసలాటలో చనిపోయిన వారి అసలు జాబితాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మృతుల సంఖ్యపై యూపీ సర్కారు తప్పుడు సమాచారం ఇస్తోందని మండిపడ్డారు. కుంభమేళాలో సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ప్రమా దం జరిగిందని…ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. సంఘటన జరిగిన కొన్ని గంటల వరకు కూడా మరణాలను ధ్రువీకరించకపోవడంపై సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరణాలను దాచిపెడుతుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని, వాస్తవాలను దాచిపెట్టి యోగి సర్కార్ శవరాజకీయాలు చేస్తోందన్నారు. తొక్కిసలాటలో మరణించిన వారిలో బెంగాల్‌కు చెందిన ఒక మహిళకు సంబంధించి… మరణ ధృవీకరణ పత్రం లేకుండా ఆమె మృతదేహాన్ని అప్పగించారని ఆరోపిం చారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సభకు ఆటంకం కలిగించడంపై స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీలకు సభను సజావుగా నిర్వహించడం ఇష్టం లేదని కుంభమేళా ఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందాలనే తపన తప్ప వారికి న్యాయం జరగాలని వారికి లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ సహా ప్రతిపక్ష సభ్యులు కొద్దిసేపు వాకౌట్ చేశారు. తరువాత సభకు తిరిగి వచ్చారు.
మరోవైపు రాజ్యసభలో ఈ అంశంపై ప్రతిపక్ష నిరసన వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహా కుంభమేళా అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రమోద్ తివారీ, దిగ్విజయ సింగ్ (కాంగ్రెస్), సాగరికా ఘోష్ (టీఎంసి), జావేద్ అలీ, రాంజీ లాల్ సుమన్ (సమాజ్‌వాదీ పార్టీ), జాన్ బ్రిట్టాస్ (సీపీఎం) ఇచ్చిన నోటీసులు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ తిరస్కరించడంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభనుండి వాకౌట్ చేశారు.