Sunday, February 23, 2025
Homeవిశ్లేషణకుక్క కాపలా

కుక్క కాపలా

చింతపట్ల సుదర్శన్‌

అరుగు మీద ఉషారుగా అటూ ఇటూ గెంతుతున్నది డాగీ. గోడకు ఆనుకుని కూచుని ఉన్న డాంకీ దానివైపే చూస్తూ ఉంది దిగులుగా. తనను తాను మరిచిపోయి అడుగులేస్తున్న డాగీ ఎందుకో డాంకీ వైపు చూసింది. ఇదేంటి డాంకీ ముఖంలో ఏదో తేడా కొడ్తున్నది అనుకుంది. అనుకున్నదే తడవు అడిగేసింది. అదేంటి ‘బ్రో’ ఏడుపు మొగం పెట్టావు. పేపర్లో ఏదైనా విషాద వార్తని నమిలేయ లేదు కదా అంది. లేదు. అదేం లేదు అని దాటవేయ బోయింది డాంకీ. లేదు అంటే ఏదో ఉందన్న మాటే. ఎలెక్షన్లో ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని అచ్చక బుచ్చకములాడినా ఓడిపోయిన అభ్యర్థిలా అవుపడ్తున్నావు. అలసలెందుకు ఏడుస్తున్నావో చెప్పి ఏడవరాదూ అంది డాగీ చిరాగ్గా. మనుషులే అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా ఏడుస్తారు. పక్కవాడు బాగుంటే ఏడుస్తారు. బాగుపడుతుంటే ఏడుస్తారు. అసలు ఏ చీకూ చింతా లేకుండా నవ్వే వాళ్లని చూసి ఏడుస్తారు. ఏడవటం, డ్రామాలాడటం మనుషులకు బాగా అలవాటు కాని గాడిదలు అనవసరంగా ఏడవవు అంది గట్టిగా డాంకీ.
మరయితే ఎందుకా ఏడుపు మొఖం. అనవసరంగా ఏడవవు గాడిదలన్నావు అంటే అవసరంగా ఏడుస్తాయనే కదా. ఇప్పుడు ఏ అవసరం మీద కళ్లు ఒత్తుకుంటున్నావో చెప్తావా మరి అంది డాగీ. నా కోసమా నాకు ఏమయ్యింది. చూడు ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, అంది డాగీ తోక ఎగరేస్తూ.
పాపం డాగీ ఇన్నాళ్లూ పొత్తులో ఉన్న పార్టీల్లా కల్సి ఉన్నాం. నీ ‘అరుపు’ వేరు, నా ‘ఓండ్ర’ వేరు. నీ పర్సనాలిటీ వేరు నా ఎత్తూ ఒడ్డూ వేరు. అయితేనేం ఏ సిద్ధాంతం లేని, పేపరు కోసమే కల్సి ఉండే పార్టీల వారిలా కల్సి ఉన్నాం. ఇప్పుడిక విడిపోక తప్పదేమో అంది డాంకీ. విడిపోవడానికి, ఎవరికి వారు మేమే గొప్ప అనుకోవడానికి మనమే పార్టీ కూటమిలోని వాళ్లం కాదే. అసలు పాయింటుకి రా అంది డాగీ. ఏం చెప్పను డాగీ నిన్ననే నవిలాను ఆ వార్త. అదేదో చట్టంలో కుక్కలను చంపే వెసులుబాటు ఉందని, ‘డిస్ట్రాయ్‌’ చేస్తే అనగా చంపేసే అనుమతి ఇవ్వమని మున్సిపాలిటీ వారు హైకోర్టుకు వెళ్లారంట.
నిర్ఘాంత పోయింది డాగీ. తను విన్నదేమిటో ఉన్న ఫళాన అర్థం కానేలేదు. ఏమిటీ ఏమన్నావు? అని ప్రశ్నించింది ముక్కులోంచి గాలి వేగంగా వదిలేస్తూ. నిన్న పేపర్‌లో నవిలిందే అన్నాను. కుక్కల స్టెరిలైజేషన్‌, వాక్సినేషన్‌కు గత ఐదేళ్లలో నలభై కోట్లు ఖర్చయినాయని అయినా సిటీలో నలభై వేలకు పైగా కుక్కకాటు కేసులున్నాయని వాదించారు మున్సిపాలిటీ వారు.
నలభై కోట్లు ఖర్చయినవా? ఎవరి జేబులోకి ఎన్ని వెళ్లినయో కూడా చెప్పలేక పోయేరా. పేరు కుక్కలది పెత్తనం మనుషులది. జనాభా విషయంలోను, కుల గణన విషయంలోను, ఓటర్ల జాబితాలోను, ఆదాయ వ్యయాల పద్దుల్లోను అన్నీ కాకి లెక్కలేగా వీళ్లు చూపించేది. వాళ్లూ వాళ్లే ఏమన్నా ఏడవనీ, లెక్కల్లో, అంకెల్లో గారడీలు చేసి మామూలు మనుషుల్ని తికమక పెట్టనీ కానీ మా కుక్కల సంగతి వాళ్లకెందుకు. కుక్క లెక్కలు వాళ్లకు అవసరమా? అంది డాగీ ఓ చోట కూలబడుతూ.
అసలుకే మోసం వస్తుంటే లెక్కల మాట ఎందుకులే? ముందు ప్రాణాల సంగతి చూసుకో కుక్కలన్నింటినీ చంపేస్తామంటున్నారు అంది డాంకీ. చంపేస్తారా? కుక్కలన్నింటినీ చంపేస్తారా? కుక్కలనేవే లేకుండా చేసి మనుషులు హాయిగా కులాసాగా ఉంటారా అంది డాగీ ఉక్రోషంగా. అన్నింటినీ అంటే అన్నిటినీ అనికాదు ప్రమాదకరమైన కుక్కల్ని చంపేస్తారట అని డాంకీ అంటుండగానే అరుగు ఎక్కిన అబ్బాయి, ప్రమాదకరమైనవి అంటే అరిచే కుక్కలా, కరిచే కుక్కలా. అరిచే కుక్కలు కరవవంటారు కానీ కొన్ని కరుస్తయి కదా. అలాగే అరవని కుక్కలు హఠాత్తుగా మీద పడి కండ పీకుతాయి కదా అన్నాడు.
వచ్చావా రా ‘బ్రో’ మీ మనుషులు తప్ప భూమ్మీద ఎవరూ బతకకూడదా. ఎక్కడో ఏదో కుక్క తిండి దొరక్క, ఎండకు ఎండి వానకు తడిసి అడిగే దిక్కుమొక్కూ లేక ఎవరినన్నా కరిచిందే అనుకో అంత మాత్రానికి కుక్కలన్నిటినీ చంపెయ్యాలా అంది డాగీ. అవును మరి మనుషులకో న్యాయం, పశువులకో న్యాయం. పెళ్లాన్ని చంపి ఉడకపెట్టే వాడొకడు, తండ్రి గొంతులో కత్తి ఒకడు దింపితే, తాత పొట్టలో కత్తి గుచ్చే వాడొకడు. ఇలాగ చంపే వాళ్లందరికీ బెయిళ్లూ, జెయిళ్లూ, సాక్ష్యాలూ, తీర్పులు, పెరోల్‌లు క్షమార్పణలు అంది డాంకీ. అసలు మనుషుల్లోనే ఉన్నారు అనేక మంది ప్రమాదకారులు. ముందు వారిని ఏరిపారేసే పని చెయ్యవచ్చుగా అనవసరంగా కుక్కల ప్రాణాలు తీయకపోతే అంది డాగీ.
మనుషుల్లోనూ కుక్కల్లా చచ్చే వాళ్లున్నారు. కాకపోతే అర్థబలం, అంగ బలం ఉన్నవాళ్లకి చట్టంలో ఉన్న లొసుగులు చుట్టంలా పని చేస్తయి అన్నాడు అబ్బాయి. ఏది ఏమైనా డాంకీ చెప్పిందాన్ని బట్టి కుక్కనైన నేను నా కుక్క ప్రాణాలకి కుక్కలా కాపలా కాయాలింక అన్నది డాగీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు