. ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వచ్చే సీజనల్ నాయకుడు
. అజ్ఞాతంలో ఉంటే అధికారం వస్తుందా… అభివృద్ధి కనిపిస్తుందా!
. పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు
విశాలాంధ్ర-హైదరాబాద్: ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల్లోకి వచ్చే సీజనల్ నాయకుడు కేసీఆర్ అని మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగలమంటూ ఆయన పగటి కలలు కంటున్నారన్నారు. 14 నెలలు అజ్ఞాతంలో గడిపి, కనీసం అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడని ఈయన అధికారంలోకి తిరిగి రాగలరా? కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూడగలరా అంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలపై ఎన్నడూ గళమెత్తని నాయకుడికి తెలంగాణ ప్రజలు పట్టం కడతారా అని ప్రశ్నించారు. ఫాంహౌస్ దాటని వారు అధికారంలోకి రాగలరా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే, అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు… జవాబుదారీగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్‌నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ గురించి కాదు ముందు మీ భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుందంటూ హితవు పలికారు. ‘అధికారం కోల్పోగానే 14 నెలల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల క్రమంలో ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నార’ని దుయ్యబట్టారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినప్పుడు, భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదని పొంగులేని శ్రీనివాసరావు విమర్శించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, భూభారతి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ సింగ్ మృతికి సంతాప తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ హాజరుకాలేదని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆయన గైర్హాజరయ్యారన్నారు. అప్పులు చేసి నెత్తినమీద మిత్తిల భారం పెట్టిపోయారని, తెలంగాణ సమాజం ఆయనను క్షమించదని శ్రీనివాసరెడ్డి అన్నారు. నువ్వు వద్దు, నీ పాలన వద్దూ అని తెలంగాణ ప్రజలు వదిలించుకున్నా… నేను మాత్రం వదిలేది లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.