హనీ బెంజమన్ బాధ్యతల స్వీకరణ
కొల్లాం : కేరళలోని కొల్లాం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా సీపీఐ అభ్యర్థి హనీ బెంజమిన్ ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ ఎ.దేవిదాస్ అధ్వర్యంలో కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో మేయర్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. పది నెలల పాటు ఆమె మేయర్‌గా కొనసాగుతారు. మేయర్ ఎన్నికల్లో మొత్తం 45 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి హనీకి 37 ఓట్లు రాగా యూడీఎఫ్ అభ్యర్థి, మరుథాడి వార్డు కౌన్సిలర్ సుమికి ఏడు ఓట్లు వచ్చాయి. స్థానిక సంఘాల పదవుల బదిలీకి సంబంధించి సీపీఐ, సీపీఎం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కొల్లాం మేయర్ పదవీ కాలంలో చివరి ఏడాది సీపీఐకి అప్పగించాలి. ఒప్పందం మేరకు మేయర్ ప్రసన్న ఫిబ్రవరి 5న పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. అయినా మరికొన్ని రోజులు కొనసాగారు. డిప్యూటీ మేయర్, ఆర్థిక స్థాయిసంఘం చైర్‌పర్సన్ కొల్లాం మధు, విద్యా స్థాయిసంఘం చైర్‌పర్సన్ సవితా దేవి, వర్క్స్ స్టాండిరగ్ కమిటీ చైర్‌పర్సన్ సంజీవ్ సుమన్ తమ పదవులకు రాజీనామా చేశారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హనీ బెంజమిన్ మాట్లాడుతూ చెత్త నిర్వహణ, అభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చెత్తరహిత నగరాభివృద్ధి తన లక్ష్యమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేయడం పరిపాటిగా మారిందని, ఈ అలవాటును మాన్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులు జరగనున్నట్లు తెలిపారు. తోటి కౌన్సిలర్ల సహకారంతో అనుకున్న లక్ష్యాలు, అద్భుత ఫలితాలు సాధించగలమన్న నమ్మకం ఉందని హనీ బెంజమిన్ అన్నారు.