Tuesday, April 8, 2025
Homeఖనిజ సంపద కార్పొరేట్ల పరం

ఖనిజ సంపద కార్పొరేట్ల పరం

. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శ
. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని రాంచీలో భారీ ప్రదర్శన, ధర్నా
. జార్ఖండ్‌ అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

రాంచీ : ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబబెట్టవద్దని డిమాండ్‌ చేస్తూ సీపీఐ సోమవారం జార్ఖండ్‌ అసెంబ్లీ ముట్టడి చేపట్టింది. అందులో భాగంగా రాంచీలో సీపీఐ, ప్రజాసంఘాలు భారీ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొన్నారు. భూ నిర్వాసితులకు కమిషన్‌ ఏర్పాటు, ల్యాండ్‌ బ్యాంక్‌ కోసం సేకరించిన భూమి తిరిగివ్వడం, విధానసభలో బాబా భీమ్‌రావు అంబేద్కర్‌, జైపాల్‌ సింగ్‌ ముండా విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటి వివిధ డిమాండ్లపై విధానసభ సమీపంలో సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన జరిగింది. తొలుత వేలాది మంది నిరసనకారులు ధుర్వలోని సాహిద్‌ మైదాన్‌ వద్దకు చేరుకుని… అసెంబ్లీని ముట్టడిరచే ప్రయత్నంలో విధానసభ వైపు కదిలారు. అయితే… మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జగన్నాథ్‌ మందిర్‌ సమీపంలో ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఆందోళనకారులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు బహిరంగ సభ నిర్వహించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ రాష్ట్ర ఖనిజ వనరులను కార్పొరేట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు ప్రత్నామ్నాయం చూపించే విధానం, నిర్వాసితుల కమిషన్‌ రెండూ లేనప్పటికీ మైనింగ్‌ కోసం భూమిని అప్పగిస్తున్నారు. స్థానిక ప్రజలకు ఉపాధి విధానం కూడా అమలులో లేదు. భూ బ్యాంకుల కోసం తీసుకున్న భూమిని దాని నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వాలి’ అని రాజా డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర పాఠక్‌ మాట్లాడుతూ పాలక పార్టీలు తమ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. గొండల్‌పురా (హజారీబాగ్‌), సింగ్‌పూర్‌ (చత్రా)లలో కొనసాగుతున్న నిరసనలను ఆయన ఎత్తి చూపారు. దళిత అధికార్‌ మంచ్‌ రాష్ట్ర అధ్యక్షుడు భంటే జైనేంద్ర కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల కోసం కమిషన్‌ లేకపోవడాన్ని ఖండిరచారు. ఇది సమాజానికి అవమానంగా పేర్కొన్నారు. కాగా, రాష్ట్రీయ పరిషత్‌ సభ్యుడు పీకే పాండే అసంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ, ప్రజాసంఘాలు చేపట్టిన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్‌ బలగాలను మోహరించింది. ప్రదర్శనకారులు అసెంబ్లీకి చేరుకోకుండా నిరోధించడానికి విధానసభ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి… పెద్దఎత్తున బందోబస్తు చేపట్టింది. వాహనాల రాకపోకలను నియంత్రించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు