Homeగర్జించిన బీహార్ విద్యార్థి

గర్జించిన బీహార్ విద్యార్థి

- Advertisement -
  • బీపీఎస్‌సీ పరీక్షల్లో అక్రమాలపై పట్నాలో భారీ ర్యాలీ
  • సీఎం నివాసానికి మార్చ్… బారికేడ్లు ధ్వంసం
  • అడ్డుకున్న పోలీసులు: తోపులాట, అరెస్టులతో ఉద్రిక్తత

పట్నా: బీహార్‌లో బీపీఎస్‌సీ 70వ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాజధాని పట్నాలోని ముఖ్యమంత్రి నివాసం వైపు ప్రదర్శనగా కదిలి వెళ్లారు. మార్గంలోని పోలీసు బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు జలఫిరంగులను ప్రయోగించారు. ఇది తోపులాటకు దారితీసింది. ఆపై పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీపీఎస్‌సీ ఉద్యోగార్థులు, ఇతర విద్యార్థులు గాంధీ మైదాన్ నుంచి ప్రదర్శన ప్రారంభించి డాక్ బంగ్లా కూడలికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ జెండాలు చేతబట్టి ముందుకు సాగిన విద్యార్థులు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల ప్రదర్శన క్రమంలో నగరమంతటా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద సీఆర్‌పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్) సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. గర్దెనీబాగ్ ప్రాంతంలో విద్యార్థుల నిరసనలు కొన్ని వారాలుగా కొనసాగుతున్నాయి. బీపీఎస్‌సీ ‘టైర్-4’కు సింగిల్-టియర్ పరీక్ష నిర్వహించాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచాలని, బీఎస్‌ఎస్‌సీ ద్వారా నియామక పరీక్షలు నిర్వహించాలని, హిందీ మాధ్యమ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 70వ బీపీఎస్‌సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దానిని రద్దు చేయాలని కూడా కోరుతున్నారు. విద్యార్థుల ఆందోళనల సందర్భంగా లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేశ్ తివారీ తెలిపారు. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని చెప్పారు. మిగిలిన సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విద్యార్థులను కోరారు. అయితే రాష్ట్ర విద్యా, నియామక వ్యవస్థల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై నిరసనకారులు మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలను డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో సమూలు కోరారు. నిరసనకారుడు వికాస్ భట్ మాట్లాడుతూ, ‘బీహార్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన డిమాండ్లు. లైబ్రేరియన్ల నియామకం 18 ఏళ్లుగా జరగలేదు. ప్రతి సారి నిరసనకు దిగితే హామీలు ఇస్తున్నారు. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి’ అని అన్నారు. బీఎస్‌ఎస్‌సీ నియామక ప్రక్రియల పరిస్థితి ఇలానే ఉందని ఆరోపించారు. పరీక్ష తేదీలు ప్రకటించాలని కమిషన్‌ను అనేకసార్లు కోరినా, ప్రతిసారీ సమయం కోరుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. బీపీఎస్‌సీ మినహా ఇతర నియామక కమిషన్లు వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేయలేదని కూడా తెలిపారు. ఇదిలావుంటే, విద్యార్థుల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రతి నెలా ‘విద్యార్థి సహయోగ శిబిరాలు’ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రకటించారు. ఈ శిబిరాల్లో విద్యార్థులు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ప్రత్యేక పోర్టల్ 1100 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునే సదుపాయం ఉందని సీఎం వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు