Friday, February 28, 2025
Homeవిశ్లేషణగుప్పెడు కన్నీళ్లు…చారెడు ప్రేమల కవిత్వం

గుప్పెడు కన్నీళ్లు…చారెడు ప్రేమల కవిత్వం

కవిత్వం రాయడమంటే సలసల కాగిపోవడం కదా… పదం పుట్టుకకు పరవశించడం కదా… సెలయేరు కావడం… కన్నీటి చెలమ కావడం.. ఫకాలున ఏడ్వడం…ఫెడిల్మని నవ్వడం… తెలియని వారిని తలచుకోవడం… తెలిసిన వారిని అసహ్యించుకోవడం…తెలిసీ తెలియని వారి కోసం వెదుకులాడుకోవడం… వెర్రిగా ఆకాశం వైపు చూడడం… ఆవేశంగా భూమిని కౌగలించుకోవడం… భూమ్యాకాశాల మధ్య ఏమీలేని ఖాళీ తనంలోకి పరువులు పెట్టడం. ఇదే కవిత్వమంటే. మనిషవ్వడం… కాలేకపోతున్నందుకు వగచడం. కాలేని వారిని చూసి ‘‘ఇలా బతుకుతున్నారర్రా’’ అని నాలుగు పద్యాలతో వారిలో కదలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం. కవిత్వమంటే మనల్ని మనం పుటం పెట్టుకుని మనిషి రూపం దాల్చడం. ఇదంతా ఎలా అంటారా… ఇదిగో ఈ నెల్లూరమ్మాయి సుధా మురళిలాగన్నమాట. ‘‘కళ్లకు నిండుగా కాటుక పెట్టుకున్నట్టు/చిక్కటి నవ్వు నవ్వుతావే నిజమేనా అది / అసలు నీదేనా హాసమది’’ ఇలా ప్రశ్నించడమే కాదు. కుదిపేయడమే కదా కవిత్వమంటే. ఇదంతా అసంపూర్ణమే అని తెలియడమే కదా సంపూర్ణం కావడమంటే. ఓ వేదనని మోస్తూ బతుకుతున్నాం కదా… దానికే నాలుగు అక్షరాలిచ్చి నిలువెత్తు మనిషితనం కూర్చాలనుకున్న కవిత్వమే రాశారు ఈ సుధా మురళి. ఓ సోమవారం ఉదయపు వేళ అలవాటుగా తిరగేస్తున్న ఓ పత్రిక సాహిత్య పేజీలో ఈ సుధామురళి కవిత ఒకటి చూశాను. కింద పేరు కాకుండా కవిత్వం మాత్రమే చదివే అలవాటున్నందున ఆ పనే చేశాను. భలే రాశారు ఎవరో అనుకుంటూ కింద పేరు చూశాను. ఈ పేరే. సుధామురళి. ఆ కిందనే ఫోన్‌ నంబర్‌ కూడా ఉంది. చాలా సేపు తటపటాయించాను ఫోన్‌ చేసేందుకు. అమ్మాయా… అబ్బాయా… భార్య పేరు ముందు పెట్టుకుని కవిత్వం రాసిన పురుషుడా… భర్త పేరు వెనుక పెట్టుకుని రాసిన స్త్రీ మూర్తా అన్నదే నా సంశయం. కారణమేంటంటే ఆ రోజు నేను చదివిన కవిత కచ్చితంగా మహిళే రాసి ఉండాలి. ఎందుకంటే అంతటి వేదన అనుభవించాక దాన్ని అక్షరంగా మార్చడం మగాడికి సాధ్యం కాని పని. ఎందుకు సాధ్యం కాదో సాటి పురుషుడిగా నాకు అనుభవమే. స్త్రీ అయినా కాని అంత బలంగా చెప్పడం కూడా సాధ్యం కాదు. అయినా అలాంటి కవిత రాశారంటే కచ్చితంగా మరిన్ని మంచి పద్యాలు ఇంతకు ముందు రాసి ఉండవచ్చు అనుకున్నాను. ఎవరైనా కానీ రోజు వారి జీవితంలో ఎదురయ్యే అనేకానేక సంఘటనలను మోసుకుంటూ మానవత్వం తొణికిసలాడుతూ బతకడం ఈ కాలంలో సాధ్యం కాదు. ఇదిగో, ఇలా కవిత్వమై వెలిగిన తర్వాత మాత్రమే మన కళ్లకు ఎరగడం నేర్పిస్తారు. ఆ పద్యం చదివిన రోజే మధ్యాహ్న వేళ ఫోన్‌ చేశాను. అవతలి నుంచి స్త్రీ గొంతు ‘‘ హలో’’ అంటూ. నేను కుదట పడ్డాను. చెప్పకపోవడమే ‘‘ అమ్మాయే రాసింది ఈ కవిత’’ అని ఓ అసంకల్పిత భయానికి సమాధానం చెప్పుకున్నాను. పెద్దగా మాటల్లేవు. ‘‘ బాగుందమ్మా కవిత ‘‘ నేను. ‘‘ థాంక్స్‌ సార్‌’’ సుధమ్మ. నిజానికి చాలా మాట్లాడాలనే అనుకున్నాను ఫోన్‌కి ముందు. కానీ సుధమ్మ గొంతు విన్నాక మాట పెగల్లేదు. ఆమే కాదు… అతను కావచ్చు… మరెవ్వరో కావచ్చు… నీకు పరిచయం లేని వారే కావచ్చు… నువ్వు ఇంతకు ముందు వినని వారే కావచ్చు… నీకు ఇంతకు ముందు తారసపడని వారే కావచ్చు… ఒక్క పద్యంతో నిన్ను ఖండఖండాలుగా చేసిన తర్వాత మాటలెలా వస్తాయి. ఒక్క వాక్యంతో నీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసిన తర్వాత గొంతు ఎలా పలుకుతుంది. నిన్ను నువ్వు కోల్పోయేలా, కోపగించుకునేలా, అసహ్యించుకునేలా, అవేదన చెందేలా, అనుమానించేలా, ప్రశ్నించుకునేలా చేసిన ఒక్క పద్యం నీ ముందు వినమ్రంగా నిలుచున్న తర్వాత నువ్వు మనిషివి కాగలవా. నే కాలేకపోయా. అందుకే, ఆ ఒక్క మాట మాత్రమే లోయలోంచి వచ్చినట్లుగా వచ్చి ఆ తర్వాత మటుమాయమైంది. సుధమ్మే కాదు… నన్ను కదిపి, కుదిపి, నాకు నన్ను పరాయివాడిగా చేసిన వారి ఏ కవిత్వమైనా, ‘‘నీది ఒక బతుకేనా’’ అని ప్రశ్నించిన వారి ఏ పద్యమైనా చదివితే నేనే కాదు… నువ్వూ ఇలాగే మౌనిలా మిగిలిపోతావేమో. ‘‘మడికట్టు కట్టుకున్న నా దేహం/ అనేకానేక రంపాల మధ్య చిక్కుకోబోయే/ సజీవ శిలకు తార్కాణం/ ఎవరికేం తెలుసు ఎన్ని సుళ్లు మౌన ముద్రలు వేస్తున్నాయో/ ఎవరికేం అంచనా ఉంటుంది నా వేదన భాగాలు ఎన్ని తునకలై లోలోపలే/ విరుచుకుపడుతున్నాయో’’ ఇది అస్తిత్వ వేదన. ఎవరిది. ఓ స్త్రీదా. ఓ వర్గానిదా. లేదూ ఆ రెండూ జతకలిసిన ఓ సమాజానిదా. ఇది తెలుసుకోవడానికి ముందు నేటి అస్తవ్యస్త సమాజాన్ని తెలుసుకోవాలి. నిరంతరం కాలి బూడిదైపోతున్న విలువల గురించి తెలుసుకోవాలి. మనిషితనం కోసం వెదుకులాట ఓ నిత్యకృత్యం అయ్యిందన్న నిజాన్ని గ్రహించాలి. నీ జన్మ మీదా, నీకు తెలియకుండానే నీ అస్తిత్వం మీద, నువ్వు చేయని నేరానికి నిన్ను దోషిని చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్న, విసుర్లు విసురుతున్న వారి మీదా నువ్వు ఎంత ఆగ్రహిస్తున్నావో, ఎంత నలిగిపోతున్నావో, ఓ అమానవీయ సమాజం మధ్యలో ఎంత నలిగిపోతున్నావో నీకు తెలిసేందుకైనా సుధా మురళి కవిత్వం చదవాలి. నిజానికి ఈ కవిత్వం రాసిన వారి పేరైతే సుధా మురళి కానీ… స్త్రీ, పురుష భేదం లేకుండా పాఠకులే కాదు సమస్త మానవులూ ఈ కవిత్వం తాము రాశామని, తమ అనుభవమేనని భావించవచ్చు. సుధమ్మ అంగీకరిస్తుంది కాబట్టి మీ పేరు మీదే ఈ కవిత్వాన్ని ప్రకటించవచ్చు. ఎందుకంటారా… నీది, నాది, మనది, ఈ సమాజానిది మాత్రమే అయినా బాధ, భయం, ఆక్రోశం, ఆవేదన, చిరాకు, కోపం, ఇలా తయారవుతున్నామేమిటర్రా, ఇలా మిగులుతున్నామేమిటర్రా అనిపించే అనేకానేక పార్శ్వాలే సుధా మురళి కవిత్వం. సుధమ్మకి ఎంత కోపం ఉందో, అంత అవగాహన కూడా ఉంది ఈ సమాజం మీదా… ఈ మనుషుల మీదా. అందుకే ఆమెకి ఏ వస్తువువైనా, ఏ సంఘటనైనా కొత్తగా కాదు…. వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఈ ప్రేమ రాహిత్యపు లోకానికి. తానే కాదు… అందరూ కోల్పోయిన, కోల్పోతున్న ప్రేమ దక్కకపోతే ఎలా ఉంటుందో చెప్పిన వాళ్లే. నేటి అవ్యవస్థలో ప్రేమ తన ఉనికిని కోల్పోవడమే కదా అసలు సిసలు దుర్మార్గం. అది తెలియపోవడమే కదా అందరి దౌర్భాగ్యం. అదిగో, ఆ ప్రేమ లేకపోతేనే ఎలా ఉంటుందో చెప్పింది కాబట్టే సుధా మురళి సామాజిక కవయిత్రి అయ్యింది. ఈ సంకలనంలో చాలా పద్యాలు ఇంతకు ముందు చదివినవే. ఆ రోజు కాసిన్ని కన్నీళ్లో, మరికొన్ని బాధలో అనుభవించినవే. కానీ, ఇదిగో ఇలా పుస్తకంలా వస్తున్నప్పుడు, వీటన్నింటిని ఒకేసారి చదవుతున్నప్పుడు శకలాలు శకలాలుగా తెగిపడిన అనుభూతి నాకు తెలుస్తోంది. అవును, చాలా కలత చెందాను, అవమాన పడ్డాను. నేనూ ఇలాగే ఉన్నానా అని సందేహించాను. మరీ ఇంత కాదేమో అని సర్దుకున్నాను. మరీ ఇంత కాకుంటే కొంతైనా అలా ఉన్నానా అని సిగ్గటిల్లాను. కొన్ని పద్యాలు చదివి బెంగటిల్లాను. మరికొన్ని చదివి భంగ పడ్డాను. ఎంత కాదన్నా పురుషుడ్ని కదా…. మరీ ఇలా కాదేమో అని సందేహించాను. సృజనకారుడిగా మాత్రం ఇదంతా నిజమే అని అంగీకరిం చాను. ఎలా ఉండాలో తెలియని వారికి… ఇలా మాత్రం ఉండకూడదని కచ్చితంగా తెలుస్తుంది ఈ సుధా మురళి కవిత్వం చదివితే. ‘‘ఇప్పుడిక / ఒక్కటయ్యే వీలు లేదు/ రా…!? విడిపోదాం…/ నాకేం కావాలో నిన్ను అడగలేను/ ఇల్లంతా అన్నీ ఉంటాయ్‌/ ఒక్క నేను ఉండను అంతే/ నాకేం కావాలో నీకు తెలియదు/ అడిగినదేదీ కాదనకపోవడం చేస్తావుగా/ ఒక్క నువ్వు నువ్వుగా నాకు మిగలవు అంతే ‘‘ అంటారు సర్దుబాటు పద్యంలో.
ఇదేం కవిత్వం కాదు. జీవితమంతే. అప్పుడెప్పుడో… ఆ చాలాకాలం క్రితమే గుడిపాటి చలం చెప్పేశాడు. మరి ఇప్పుడు సుధా మురళి కూడా ఎందుకు చెప్పింది. ఎందుకంటే ఎంత మంది చెప్పినా నువ్వు, నేను వినం కాబట్టి. క్యాలండర్‌ తేదీలని, సంవత్సరాలని మారుస్తుంది కాని మనుషుల్ని కాదర్రా బాబు అని చెప్పడానికే మళ్లీ రాసింది ఈ సుధామురళి. కాకపోతే కొత్తగా కన్నీరయ్యింది. కొత్తగా తేల్చేసింది. కొత్తగా చీదరించుకుంది. ఇదిగో ఈ కొత్తదనమే సుధా మురళి కవిత్వం అయింది. విజిల్‌ వస్తే ఆపేయడానికి ఇది కుక్కర్‌ వంట కాదుగా. అచ్చమైన అమ్మ వండి వార్చిన అన్నం ముద్ద. ఇలా రెండు పద్యాలు ముట్టుకుంటే చాలు ఈ కవిత్వం పండిరదని చెప్పడానికి. ఇదంతా సుధామురళి కవిత్వం చదివాక నేను అనుభవించింది. మీరు చదవండి ఇలాంటి అనుభూతే మిగులుతుంది. ఎందుకంటే మనమంతా మనుషులం కదా. రక్తమాంసాలతో పాటు కాసిన్ని ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు కూడా కావాలనుకునే వాళ్లం కదా… చదవండి… మీకే తెలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు