Thursday, April 3, 2025
Homeవిశ్లేషణచండ్ర రాజేశ్వరరావు

చండ్ర రాజేశ్వరరావు

సీపీఐ ప్రధాన కార్యదర్శులు – 5

ఆర్వీ రామారావ్‌
ఒక వ్యక్తి చూపులకు, గుణగణాలకు, స్వభావానికి సంబంధం ఉండనక్కర్లేదనడానికి చండ్ర రాజేశ్వరరావు మంచి ఉదాహరణ. ఆయనది ఎత్తైన విగ్రహం. విశాలమైన ముఖం. గంభీరమైన గొంతు. ఆ పంచె కట్టు, నడిచే తీరు, మాటలో ఓ రకమైన కరకుదనం ఆయనలోని నిశిత దృష్టిని, మేధో శక్తిని, మానవీయ లక్షణాలను కప్పి పెట్టేవి. ఎవరితోనైనా నేరుగా కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసే మనిషి చండ్ర రాజేశ్వరరావు. ఆయన ఎం.బి.బి.ఎస్‌. పూర్తి చేయకుండానే వదిలేశారని, అంతకు ముందు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో పట్టభద్ర స్థాయి విద్య కూడా పూర్తి చేయకుండా బయటకు వచ్చారని చాలామందికి తెలియకపోవచ్చు.
35 ఏళ్లకే ఒక జాతీయ పార్టీకి అధినేత అయింది ఒక్క రాజేశ్వరరావు మాత్రమే. 1950-51 లో ఆయన రణదివే తరవాత సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అది కమ్యూనిస్టు పార్టీకి ఒక రకంగా కల్లోల సమయం. ఆ తరవాత సీపీఐ చీలిపోయిన తరవాత 1964 లో మళ్లీ సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1990 దాకా ఆ స్థానంలో కొనసాగారు.
అంత ఎక్కువ కాలం అగ్ర నాయకుడిగా ఉండడం రాజేశ్వరరావుకు ఒక్కడికే చెల్లిందేమో. కృష్ణా జిల్లా మంగళాపురంలో సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించినా తన యావదాస్తిని సీపీఐకి విరాళంగా ఇచ్చేశారు. అతి సాధారణ కార్యకర్తతో కూడా ఆప్యాయంగా మాట్లాడేవారు. పార్టీ కార్యాలయంలోని గేటు దగ్గర ఉండే రెడ్‌ గార్డుతో, కసవు ఊడ్చే వారిని కూడా ఆత్మీయంగా పలకరించే వారు. వారి మంచి చెడ్డలు కనుక్కునే వారు. అవసరమైన సహాయం చేసేవారు. కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం అగ్ర నాయకుడిగా ఉన్నా ఆయన నడవడికలో ఎన్నడూ దర్పం కనిపించలేదు.
రాజేశ్వరరావుకు సెక్యులరిజం అంటే ఒక ప్రదర్శనాంశం కాదు. సెక్యులరిజం నరనరానా జీర్ణించుకు పోయిన వాడాయన. బాబరీ మసీదు వివాదం కొనసాగుతున్నప్పుడు ఆయన కలత చెందారు. బాబరీ మసీదు ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చాలని సూచించారు.
రోజువారీ జీవితంలో ఆయన అనుసరించిన విధానం అత్యంత నిరాడంబరమైంది. ఏ సుఖాలూ కోరుకోకుండానే జీవితం అంతా గడిపేశారు. తాను ఉండే గదిలో కూలర్లు, ఏర్‌ కండిషనర్లు ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. అత్యంత సామాన్యంగా బతికేవారు.
ఆయన మేటి దేశభక్తుడు. కమ్యూనిస్టు కనక ఆయన తిరుగులేని దేశభక్తుడు. పంజాబ్‌ లో తీవ్ర వాదం ఆయనను కుదిపేసింది. దానికి మూలాలేమిటో తెలుసుకోవడానికి సిక్కు మతం గురించి అపారంగా చదివారు. సిక్కు మేధావులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అస్సాం, మణిపూర్‌ కల్లోలాలను కూడా ఆయన నిశితంగా పరిశీలించేవారు.
కుల మతాల పేర సంకుచిత మానసిక ధోరణులు ఆయనకు నచ్చేవి కావు. దేశంలోని వైవిధ్యతను తెలుసుకోవడం కోసం చండ్ర అన్ని ప్రయత్నాలూ చేశారు. పార్సీ మతం గురించి కూడా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. మార్క్సిజానికీ సుసంపన్నమైన భారతీయ సామాజిక, సాంస్కృతిక అంశాలతో బంధం ఉండాలని ఆకాంక్షించేవారు. మన సంస్కృతిలోని తిరోగమన అంశాలను వదిలించుకుని ప్రగతిశీలమైన సకల అంశాలను ఇముడ్చుకుని ముందుకు సాగాలన్నది ఆయన ఆకాంక్ష.
చల్లపల్లి జమీం దారుకు వ్యతిరేకంగా చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలో సాగిన పోరాటం చరిత్రాత్మక మైంది. పేదరికం బాధ తీరాలంటే భూసంస్కరణలు ఒక్కటే మార్గం అని నమ్మిన కార్యవాది రాజేశ్వరరావు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కాక ముందే 11వ ఆంధ్ర మహాసభకు చండ్ర రాజేశ్వరరావు హాజరయ్యారు. ఆ తరవాత ఆయన సాయుధ పోరాటంతో మమేకమయ్యారు. సాయుధ పోరాట లక్ష్యాలు నెరవేరిన తరవాత ఆ పోరాటాన్ని కొనసాగించాలని అప్పటి సీపీఐ కేంద్ర నాయకత్వం భావించింది. కానీ వాస్తవ పరిస్థితులు తెలుసు కాబట్టి అజ్ఞాతంగా ఉన్న కార్యకర్తలను కలుసుకుని సాయుధ పోరాటం విరమించవలసిన ఆవశ్యకతను వివరించిన తీరు నిరుపమానమైంది. వామపక్ష పార్టీల ఐక్యత ఎంత ప్రధానమైందో ఆయన ఆవేదనతో విడమర్చేవారు.
రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం విడివిడిగా ఉండాలని చండ్ర భావించేవారు. అందుకే అఖిల భారత రైతు సంఘంలో అంతర్భాగంగా ఉన్న వ్యవసాయ కూలీల కోసం 1968 లో వ్యవసాయ కూలీల సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు.
రణదివే ప్రధాన కార్యదర్శిగా ఉండగా అనుసరించిన విధానాలు కమ్యూనిస్టు పార్టీని అతలాకుతలం చేశాయి. ఆ దశలో నాయకత్వం చేపట్టింది రాజేశ్వరరావే. 1964లో సీపీఐ చీలిపోయినప్పుడు మళ్లీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టింది ఆయనే. పార్టీ చీలిక తరవాత రాజేశ్వరరావు రెండవ సారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దిగజారుతున్న ఆరోగ్యం కారణంగా 1989 లో జరిగిన పార్టీ మహా సభలోనే ఆయన తప్పుకోవాలనుకున్నారు. కానీ ఆ మహాసభలో మళ్లీ ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 1990 లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు వదులుకున్నారు. చివరకు 1992 లో పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
1993 నవంబర్‌లో ఆయన వీలునామా రాశారు. ఆ వీలునామాలో తాను ఎవరి దగ్గరా ఏమీ తీసుకోలేదని, తాను ఎవరికీ ఇవ్వాల్సింది ఏమీ లేదని రాజేశ్వరరావు రాశారు. తన పుస్తకాలు పార్టీకి, బట్టలు అవసరమైన వారికి ఇవ్వాలని రాశారు. ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఆయన అనుసరించే వైఖరిని, విధానాలను ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఓపికగా వారి వాదనను సంపూర్ణంగా వినడం రాజేశ్వరరావు లక్షణం. హరిజనులు, గిరిజనులు, మైనారిటీల మీద ఎక్కడ దాడి జరిగినా ఆయన వెంటనే స్పందించేవారు. తానే స్వయంగా వెళ్లి దాడికి గురైన వారిని పరామర్శించి అవసరమైన సహాయం చేసేవారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమైక్యం కావాలన్న ఆయన ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరలేదు. నంద్యాలలో ఒక రాజకీయ సమావేశంలో చండ్ర రాజేశ్వరరావు మొట్టమొదటి సారి శ్రీశ్రీని ‘‘మహా కవి’’ అని సంబోధించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు