Thursday, April 3, 2025
Homeసంపాదకీయంచిన్న కోర్టు-విశిష్ట ఆదేశం

చిన్న కోర్టు-విశిష్ట ఆదేశం

అయిదేళ్ల కింద దిల్లీలో జరిగిన మత కలహాలను రెచ్చగొట్టారన్న ఆరోపణ ఎదుర్కుంటున్న దిల్లీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి కపిల్‌ మిశ్రా మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ గత ఒకటవ తేదీన ఆదేశం జారీ చేశారు. అంటే పలుకుబడి గల ఒక నాయకుడిపై ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయడానికి అయిదేళ్లు పట్టింది. కపిల్‌ శర్మ మొదట ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఉండేవారు. ఆయన ఆ తరవాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం దిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2020 లో ఈశాన్య దిల్లీలో మత కలహాలు జరగక ముందు కపిల్‌ శర్మ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ‘‘జె.ఎన్‌.యు.కె గద్దారోంకో గోలీ మారో, జామియాకే గద్దారోంకో గోలీ మారో అని ఆయన నినాదాలు చేశారు. అప్పటి మత కలహాల్లో 53 మంది మరణించారు. 700 మంది గాయపడ్డారు. ఆ సమయంలో కపిల్‌ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి, ఆ తరవాత మత కలహాలు చెలరేగడానికి సంబంధం ఉందని అందువల్ల ఆయన మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేసి చట్ట రీత్యా చర్య తీసుకోవాలని 2024 డిసెంబర్‌లో యమునా విహార్‌లో నివాసం ఉండే మహమ్మద్‌ ఇల్యాస్‌ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. 2020 నాటి దిల్లీ మతకలహాల్లో కపిల్‌ మిశ్రా పాత్రపై తాము దర్యాప్తు చేశామనీ కానీ ఆయనకు వ్యతిరేకంగా ఏ సమాచారమూ దొరకలేదని దిల్లీ పోలీసులు గత నెలలో తెలియజేశారు. ఇల్యాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో కపిల్‌ మిశ్రాతో పాటు ముస్తఫాబాద్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ మోహన్‌ సింగ్‌ బిష్ట్‌, అప్పుడు ఈశాన్య దిల్లీ డి.సి.పి.గా ఉన్న పోలీసు అధికారి, బీజేపీ మాజీ శాసనసభ్యుడు జగదీశ్‌ ప్రధాన్‌ మీద కూడా చర్య తీసుకోవాలని ఇల్యాస్‌ కోరారు. కపిల్‌ మిశ్రా మరికొందరు 2020 ఫిబ్రవరి 23 కర్దంపురిలో రోడ్డును మూసేసి తోపుడు బళ్లను పడదో శారని ఇల్యాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండేవి. డి.సి.పి., ఇతర అధికారులు పక్కన ఉండగానే కపిల్‌ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఆ సమయంలో ట్రంప్‌ మన దేశంలో పర్యటిస్తుండేవారు. ఆయన వెళ్లనివ్వండి అప్పుడు తమ శక్తి ఏమిటో చూపిస్తామని కూడా కపిల్‌ మిశ్రా అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన వారిని కపిల్‌ మిశ్రా బాహాటంగానే బెదిరించారు. ఇవేవీ ఇంతకాలం దిల్లీ పోలీసులకు కనిపించలేదు. ఆరోపణలు ఎదుర్కుం టున్న వారిపై ఎఫ్‌.ఐ.ఆర్‌.దాఖలు అయ్యేట్టు చూడడానికి కూడా కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. తమ మీద లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని మహిళా మల్ల యోధులు దిల్లీ వీధుల్లో దీర్ఘ కాలం నిరసన తెలియజేయవలసి వచ్చింది. 2020 నాటి ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణిస్తే వారిలో 40 మంది ముస్లింలే. అంటే హిందుత్వ వాదుల ఆగడాలు ఎంత భీకరమైనవో అర్థం చేసుకోవచ్చు. కానీ దిల్లీ పోలీసులకు కపిల్‌ మిశ్రా లాంటి వారి రెచ్చగొట్టే ప్రసంగాలు వినిపించలేదు. అయితే ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమాం, గుల్ఫిషా ఫాతిమా లాంటి విద్యార్థి నాయకుల మీద మాత్రం కేసులు మోపారు. ఉమర్‌ ఖాలిద్‌ గత అయిదేళ్ల నుంచి జైలులో ఉన్నారు. కనీసం బెయిల్‌ కూడా మంజూరు కావడం లేదు.
దిల్లీ మత కలహాల తరవాత దిల్లీ మైనారిటీ కమిషన్‌ పది మంది సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మత కలహాలు ఒక ప్రణాళిక ప్రకారం, నిర్దిష్ట వర్గానికి వ్యతిరేకంగా జరిగాయని ఈ నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. ఈ కలహాలకు కపిల్‌ మిశ్రా కారణం అని కూడా చెప్పింది. 2020 ఫిబ్రవరి 23 న కపిల్‌ మిశ్రా ప్రసంగం చేసిన కొద్ది సేపటికే మత కలహాలు మొదలైనాయి. ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న వారిని అక్కడ నుంచి తొలగించాలని కపిల్‌ మిశ్రా పిలుపు ఇచ్చారు. మూడు రోజుల్లోగా ఈ పని జరగకపోతే తామె నిరసనకారులను తొలగిస్తామని కూడా కపిల్‌ మిశ్రా హెచ్చరించారు. అయిదేళ్లుగా మిశ్రా ఆగడాలేవీ దిల్లీ పోలీసులకు వినిపించకపోవడం, కనిపించకపోవడం చూస్తే మత కలహాలను రెచ్చగొట్టే వారికి కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం వారి బహిరంగ మద్దతు ఉందని రుజువవుతోంది. నిరసనకారులను రోడ్డు మీంచి తొలగించకపోతే ఊరుకునేది లేదని, పోలీసులు ఏం చెప్పినా వినేది లేదని కపిల్‌మిశ్రా అన్నారు. నిజానికి దిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పని చేస్తారు. అంటే దిల్లీ పోలీసులు తమ పార్టీ ప్రభుత్వం అధీనంలోనే పని చేస్తారని తెలిసినా కపిల్‌ మిశ్రా రెచ్చిపోయి మాట్లాడడానికి సాహసించడం వెనక ఆంతర్యం ఏమిటో గ్రహించ వచ్చు. కపిల్‌ మిశ్రా మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలని దిల్లీలో ఓ కింది కోర్టు న్యాయమూర్తి ఆదేశించడానికి న్యాయపరంగానే కాక రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కపిల్‌ మిశ్రా బీజేపీలో చేరిన తరవాత కరడుగట్టిన హిందుత్వ వాదులను మించి పోయే ప్రసంగాలు చేశారు. అసలు హిందుత్వ వాదులకన్నా తానే ఎక్కువ హిందుత్వ వాదినని నిరూపించుకోవడానికి నాలుక మీద అదుపు లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఉన్నంత కాలం కపిల్‌ మిశ్రా సెక్యులర్‌ వాదిగానే కనిపించారు. దిల్లీలో మతకలహాలు జరిగిన సమయంలోనె హిందుత్వ వాదులు పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన చేస్తున్న వారిని తొలగించారు. వారి శిబిరాలను పెరికి వేశారు. బీజేపీ దిల్లీ మత కలహాలను దేశానికి వ్యతిరేకంగా పన్నిన కుట్రగా అభివర్ణిం చింది. మరీ విచిత్రం ఏమిటంటే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన సీతారాంఏచూరి లాంటి సీనియర్‌ రాజకీయ నాయకుల పేర్లు కూడా దిల్లీ పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌.లో చేర్చారు. అయితే వారిని అరెస్టు చేయలేదు. కపిల్‌ మిశ్రా మీద మాత్రం ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలే చేయలేదు. దిల్లీ పోలీసుల పక్షపాత ధోరణికి ఇవన్నీ మచ్చుతునకలే. కపిల్‌ మిశ్రాకు దిల్లీ మతకలహాలతో ఏ సంబంధమూ లేకపోయినా ఆయనను ఇందులో ఇరికిస్తున్నారని కూడా పోలీసులు అన్నారు. ఈ కారణాలన్నీ దిల్లీ కోర్టు ఆదేశానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. దిల్లిలో నిషేధాగ్నలను కూడా లెక్క చేయకుండా కపిల్‌ మిశ్రా తన మద్దతుదార్లను వెంటేసుకుని విచ్చలవిడిగా తిరిగినా ఆయన మీద ఏ చర్యా తీసుకోలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు