30 మంది పర్యాటకుల మృతి
మృతుల్లో ఇద్దరు విదేశీయులు
కశ్మీర్/న్యూదిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 30 మంది పర్యాటకులు మృతిచెందగా పెద్దసంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు మంగళవారం ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో ఏడుగురు టెర్రరిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి… పర్యాకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా దిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీకి దాడి వివరాలు వెల్లడిరచారు. అనంతరం ఆయన హుటాహుటిన కశ్మీరు చేరుకున్నారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పెద్దసంఖ్యలో పర్యాటకులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ‘నా భర్త తలకు గాయమైంది. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు’ అని ఓ బాధిత మహిళ పీటీఐ వార్తా సంస్థకు ఫోన్‌లో తెలియజేసింది. ఆ మహిళ తన వివరాలు వెల్లడిరచనప్పటికీ… ఆసుపత్రికి తరలించాలని వేడుకున్నారు. బైసరన్‌లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమై భద్రతా బలగాలను అక్కడకు తరలించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. కొంతమంది పహల్గాం ఆసుపత్రిలో చేరారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిరచారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కి.మీ మేర ఉండగా… 14కి.మీ మార్గం గండేర్బల్ జిల్లా నుంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రపతి, ప్రధాని ఖండన
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండిరచారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన… కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. ముష్కరులను వదిలేది లేదని, కోర్టు ముందుకు తీసుకొచ్చి శిక్షిస్తామని అన్నారు.
ముష్కరులను వదిలిపెట్టం: అమిత్‌షా
‘పర్యాటకులపై దాడి తీవ్రంగా బాధించింది. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటన గురించి మోదీకి వివరించాను. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించాను. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళ్తున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండిరచారు. దీనిని హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండిరచేందుకు మాటలు రావడం లేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.