Friday, April 4, 2025
Homeజస్టిస్‌ వర్మ ఉదంతం న్యాయవ్యవస్థకే కళంకం

జస్టిస్‌ వర్మ ఉదంతం న్యాయవ్యవస్థకే కళంకం

. జ్యుడీషియరీపై పెరిగిన కేంద్రం పెత్తనం
. డీలిమిటేషన్‌ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
. సమాఖ్య స్ఫూర్తి ఎన్టీఆర్‌ పేటెంట్‌ హక్కు
. పాన్‌పరాగ్‌, గుట్కాలకు సినీ దిగ్గజాల ప్రచారమా?
. మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

న్యూదిల్లీ : దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ అవినీతి ఉదంతం భారతదేశ న్యాయవ్యవస్థకే కళంకంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పేర్కొన్నారు. ఆయన ఇంట్లో వంద కోట్ల కరెన్సీ బయటపడడంతో ప్రపంచం నివ్వెర పోయిందని అన్నారు. న్యూదిల్లీలోని ఏపీ భవన్‌ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్‌ నారాయణ మాట్లాడుతూ…జస్టిస్‌ వర్మ చేస్తున్నది వ్యాపారం కాకపోయినా వందల కోట్ల రూపాయలు ఇంట్లో ఉందంటే అదంతా అవినీతి సొమ్మేనని అర్థమవుతోందని పేర్కొన్నారు. వ్యవహారం బయటకు పొక్కిన నాలుగు రోజుల అనంతరం దిల్లీ ఫైర్‌ డిపార్టుమెంటు అధికారులను మేనేజ్‌ చేసి అక్కడ కాలిన నోట్లు ఏమీ దొరకలేదని చెప్పిస్తున్నారని తెలిపారు. కాలిన నోట్ల కట్టలు బయట పడినా తప్పుడు రిపోర్టులు ఇచ్చిన ఫైర్‌ డిపార్టు మెంటు అధికారులనే ఫైర్‌ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రను కోల్పోతున్నదని నారాయణ పేర్కొన్నారు. మోదీ పడగ నీడన న్యాయవ్యవస్థ ఉందని ఆరోపించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్ర చూడ్‌ ఇంట్లో జరిగిన వ్యక్తిగత పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీ వెళ్లవచ్చునా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వపు ఒత్తిడి న్యాయవ్యవస్థపై తీవ్రంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అఖరుకు కొలీజియం కూడా మోదీ కనుసన్నల్లోకి వెళ్లినట్టు తెలుస్తోందని చెప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలుంటే తాము ఏమైనా చేసుకోవచ్చుననే స్థితిలోకి న్యాయమూర్తులు వచ్చారని పేర్కొన్నారు. న్యాయమూర్తులుగా పని చేసిన వారు ప్రభుత్వ పెద్దల ప్రలోభాలకు లొంగిపోతున్నారని మండిపడ్డారు. పాలకులకు అనుకూలమైన తీర్పులు ఇచ్చి పదవీ విరమణ చేసిన వెంటనే ఎంపీలుగా, ఇతర ఉన్నత పదవులు పొందుతున్న ఉందంతాలున్నాయని పేర్కొన్నారు. ఇది న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ పతనం అయ్యిందని పేర్కొన్నారు. మంత్రులపైనే రేప్‌ కేసులు, హత్యా కేసులుఉన్నాయని గుర్తు చేశారు. మంత్రుల్లో 33 శాతం మందిపై వివిధ కేసులు ఉండగా 94 మందిపై రేప్‌ కేసులున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై అంతో ఇంతో గౌరవం ఉందని, కోర్టుల్లో పని చేసే ఉన్నతమైన వ్యక్తులు ఇలా అయితే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. మోదీ పాలనలో రాజ్యాంగ బద్దమైన అన్ని సంస్థలు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థతో పాటు ఆర్‌బీఐ, సీబీఐ, ఈసీ వంటి అన్నింటినీ నిర్వీర్యం చేసినట్టు తెలిపారు. న్యాయవ్యవస్థ సరిగా ఉంటే నేరస్తులు పాలకులు ఎలా అవుతున్నారని ప్రశ్నించారు. అనేక కేసుల్లో ముద్దాయి అయిన జగన్‌ వంటి వారు బెయిల్‌పైనే ఇంత కాలం ఎలా బయట ఉంటున్నారని ప్రశ్నించారు.
జస్టిస్‌ వర్మ అవినీతి బాగోతంలో దొరికారు కాబట్టి దొంగ అయ్యారని, దొరకని వారు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. వీటన్నిటిపై విచారణ జరిపిస్తే ఆ అవినీతి పరుల వ్యవహారం బయటకు వస్తుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులపై చర్యలకు అవకాశం తక్కువే ఉందని కాబట్టి ఆవసరమైతే చట్టాలను మార్పు చేసి తప్పు చేసే న్యాయమూర్తులపై కఠినంగానే వ్యవహరించాలని డిమాండు చేశారు. ప్రస్తుతం అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిన వర్మను అలహాబాదు హైకోర్టు కూడా తమకు వద్దు అంటోందని, ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం ముందు పెద్ద కుర్చీ వేసి పని ఇవ్వకుండానే ఖాళీగా కూర్చోబెట్టాలని, ఇదే సరైన శిక్ష అంటూ చురకలంటించారు. న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
ఇక మోదీ ప్రభుత్వం రాజ్యాంగం అందించిన ఫెడరల్‌ ( సమాఖ్య ) స్పూర్తిని తీవ్రంగా దెబ్బ కొడుతోందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన)ను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు. ఇది దేశాన్ని దక్షిణాది, ఉత్తరాది అని రెండుగా విభజిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరం అన్నారు. ఇది దక్షిణాదికి సంబంధించిన సమస్య కాకూడదని పేర్కొన్నారు. గతంలో ఇందిరా గాంధీ ఫెడరల్‌ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తుంటే ఎన్‌టీఆర్‌ దాన్ని అడ్డుకోవడం కోసం ఉద్యమించారని, దానికి వామపక్షాలు సహా ఇతర శక్తులు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. తాజాగా మోదీ పాలనలో ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని దుయ్యబట్టారు. తానేది చెబితే అది జరగాలని, ఒకే నేత, ఒకే పార్టీ అంటూ మోదీ నియంతృత్వం దిశగా సాగుతున్నారని మండిపడ్డారు. ఈ చర్యలన్నీ సమాఖ్య స్పూర్తిని దెబ్బ కొడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలకు , రాష్ట్రాలకు సమాన అవకాశాల్ని హక్కుల్ని రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలా ఉంటేనే దేశం ఐక్యంగా ఉంటుందని పేర్కొన్నారు. మెజారిటీ వాదం ముందుకు వస్తే లౌకికవాదం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ఫెడరల్‌ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్న మోదీ ప్రభుత్వం విధానాల్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. డబ్బుల కోసం సమాజానికి హాని చేసే గుట్కా, పాన్‌ పరాక్‌ తదితర ప్రకటనల్లో నటిస్తున్న సినిమా హీరోల తీరు దారుణమని నారాయణ పేర్కొన్నారు. హిందీ నటులు అమితాబ్‌, షారూఖ్‌ మొదలు తెలుగు నటులు కూడా అనేక మంది ఆ ఆ తరహా ప్రకటనల్లో నటించడాన్ని ఆక్షేపించారు. మంచి సంపాదన ఉన్నా డబ్బుల కోసం ఇటువంటి చౌక బారు ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదన్నారు. పాన్‌ మసాలాలు, గుట్కాలు కుడా ఆహర పదార్థాలే అనే ఒక తీర్పు ఆధారంగా ఆ కంపెనీల ప్రకటనల్లో నటించడం దారుణమని పేర్కొన్నారు. పాన్‌ మసాలతో పాటు ఇచ్చే మరో చిన్న ప్యాకెట్‌ క్యాన్సర్‌ వంటి రోగాలకి కారణం అవుతోందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే ప్రకటనల్లో నటించి వచ్చే వందల కోట్ల సంపదను పోయినాక కాష్టం పై వేసుకొని తగల బెట్టించుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కోసం కక్కుర్తి పడి కళామ తల్లి ని అపహాస్యం చేయవద్దు అని హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు