. ఆ దేశంలో యాపిల్ ఉత్పత్తి విస్తరణ వద్దన్నా
. ఖతార్ వ్యాపారవేత్తల సదస్సులో ట్రంప్
వాషింగ్టన్: తమ ఉత్పత్తులపై అన్ని సుంకాలు రద్దు చేసేందుకు భారత్ ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘జీరో టారిఫ్’ వాణిజ్య ఒప్పందాన్ని భారత్ తమకు అందిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ గురువారం ఖతార్‌లో వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు. అమెరికా వస్తువులపై సుంకాలను పూర్తిగా తొలగించడానికి భారత్ ముందుకొచ్చిందన్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలను ట్రంప్ వెల్లడిరచలేదు. భారత్‌లో వస్తువుల అమ్మకం కష్టమని ట్రంప్ చెప్పారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తిని విస్తరించవద్దని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌ను కోరినట్లు తెలిపారు. ‘మీరు భారత్‌లో తయారీ చేపట్టడం నాకు ఇష్టం లేదని కుక్‌తో చెప్పా. దీంతో అమెరికాలో యాపిల్ ఉత్పత్తి పెరగబోతోంది’ అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ‘టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఎదురైంది. భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలను ఆయన చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని కుక్‌తో చెప్పాను. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ అంగీకరించింది’ అని ట్రంప్ వెల్లడిరచారు. అమెరికా సుంకాలపై ప్రపంచ దేశాల ఆందోళన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని యాపిల్ విస్తరిస్తోంది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ వంటి తయారీ సంస్థల ద్వారా ఐఫోన్‌లు తయారు చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలోకి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, దిగుమతులపై ఆధారాన్ని తగించడానికి ఈ పరిణామం దోహదమవుతుంది. అయితే ట్రంప్ తాజా ప్రకటనలు సంక్షోభానికి దారితీసేవిగా ఉన్నాయి. ప్రతీకార సుంకాలకు విధించిన 90 రోజుల విరామం ముగిసే లోపు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఏప్రిల్ 9న లిబరల్ డే ప్రకటనల వేళ భారత్‌పై 26 శాతం లెవీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం విదితమే. అయితే సుంకాలపై చర్చించేందుకు భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఈనెల 17న అమెరికా వెళుతున్నారు. 20వ తేదీ వరకు అగ్రరాజ్యంలో ఉంటారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలలో భారత్ నిమగ్నమైంది. సుంకాల వివాదం కొనసాగితే వాణిజ్య యుద్ధం వచ్చే అవకాశాలు లేకపోలేదు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటి పురోగతి గొప్పగా ఉందని ఏప్రిల్ 30వ తేదీ ట్రంప్ వెల్లడిరచారు. త్వరలోనే ఒప్పందం జరుగుతుందని చెప్పారు.