చైనాకు అమెరికా షరతు
వాషింగ్టన్: చైనా దిగుమతులపై సుంకాల విషయంలో కాస్త మినహాయింపు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అందుకు షరతు పెట్టినట్లు తెలిపారు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను తమకు విక్రయిస్తే ఈ సుంకాలను కాస్త తగ్గిస్తానని, కావాలంటే ఒప్పంద గడువును పొడిగిస్తానని చైనాకు ఓ ఆఫర్ ఇచ్చాను అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. తొలుత 10 శాతం ఆపై 20 శాతం సుంకాన్ని చైనాపై విధిస్తామని అధ్యక్షుడు ప్రకటించిన విషయం విదితమే. అయితే టిక్‌టాక్‌ను అమెరికా ఇప్పటికే నిషేధించింది. ఈ యాప్‌కు అమెరికాలో 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ దీనిని కొనుగోలు చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే, ‘సావరిన్ వెల్త్‌ఫండ్’ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్ ఇటీవల ఆదేశించారు. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు సావరిన్ వెల్త్‌ఫండ్‌ను వినియోగించే అవకాశం ఉందన్నారు.
2 నుంచి విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధించారు. ఏప్రిల్ 2 నుంచి ఈ సుంకం అమల్లోకి వస్తోందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఈమేరకు ప్రకటిస్తూ ‘అమెరికాలో తయారు కాని కార్లపై శాశ్వతంగా 25 శాతం సుంకం విధిస్తున్నాం. దీంతో మన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి సాధ్యమవుతుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి’ అని వెల్లడిరచారు. అయితే స్థానికంగా తయారు చేసే వాహనాలపై సుంకం విధించడంలేదని ట్రంప్ అన్నారు.
ఈయూ, కెనడాకు ట్రంప్ హెచ్చరికలు
అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించేందుకు చేయి కలిపితే ఖబద్దార్ అంటూ యూరోపియన్ యూనియన్, కెనడాకు ట్రంప్ హెచ్చరికలు చేశారు. తమ దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడానికి యత్నిస్తే సుంకాలను మరింతగా విధిస్తానని బెదిరించారు. ట్రంప్ బెదిరింపులపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా వైఖరి వాణిజ్యానికి మంచిదికాదన్నారు. ఇదిలావుంటే, అమెరికా బర్బన్‌పై 50శాతం సుంకాల విధించడం వంటి తమ ప్రతిఘటన చర్యలను ఏప్రిల్ వరకు యూరోపియన్ కమిషన్ వాయిదా వేసుకుంది. యూరప్ నుంచి వచ్చే మద్యంపై 200 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే. మరోవైపు ట్రంప్ తీరు సరైనది కాదని, దీనికి ప్రతిఘటన తప్పబోదని కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ హెచ్చరించారు. కార్మికులపై ప్రత్యేక్ష దాడి చేసేలా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయని తీవ్రస్థాయిలో ఖండిరచారు.