Tuesday, March 4, 2025
Homeతెలంగాణటీచర్లు, నేతల అరెస్టులుఆక్షేపణీయం

టీచర్లు, నేతల అరెస్టులుఆక్షేపణీయం

విశాలాంధ్ర – మేడిపల్లి : అంగన్‌వాడీ టీచర్లు, నాయకుల అరెస్టులను ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్‌, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి తీవ్రంగా ఖండిరచారు. ఇవి అక్రమ అరెస్టులంటూ మంగళవారం ఒక ప్రకటన చేశారు. అన్ని జిల్లాల్లో అర్థరాత్రి నుంచి పోలీసులు అరెస్టులు సాగించినట్లు దుయ్యబట్టారు. ముందస్తు సమాచారం/నోటీసులు ఇవ్వకుండా అంగన్‌వాడీ టీచర్లను వారి ఇళ్లలో నుంచి అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం ఆక్షేపణీయమన్నారు. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ అంగన్‌వాడీ అసోసియేషన్‌ ఎలాంటి పోరాటానికి పిలుపు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఇంటెలిజెన్స్‌ తీరు గర్హనీయమన్నారు. నాయకులు, టీచర్లను భయభ్రాంతులకు గురిచేసేలా… పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో బాలరాజ్‌, కరుణ కుమారి పేర్కొన్నారు. ఈ అరెస్టు గురించి ఇంటెలిజెన్సీ అధికారులను అడిగితే వారు తమకు కారణాలు తెలియదని చెప్పారని, దీనిని బట్టి పోలీసులే ఏకపక్షంగా వ్యవహరించారని అర్థమవుతోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న అక్రమ అరెస్టులను ఆపాలని, భవిష్యత్తులో పునారవృతం కాకుండా చూడాలని… లేని పక్షంలో ఆందోళనలు తప్పబోవని బాలరాజ్‌, కరుణకుమారి తేల్చిచెప్పారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, అరెస్టైన అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి ప్యారిజాన్‌తో పాటు కవిత, ఉమాదేవి, సులోచన, రమ, సుశీల, సుచిత్ర, శోభ, రమాను మేడిపల్లి పోలీసు స్టేషన్‌ నుంచి ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి దండు రమేశ్‌ అనంతరం విడిపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు