. విద్యుత్ లైన్ల ఆధునికీకరణపై దృష్టి
. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు
. సబ్‌స్టేషన్లు అప్‌గ్రేడ్ చేయాలి
. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ దిశానిర్దేశం
విశాలాంధ్ర -హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ భవిష్యత్‌లో డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్‌లైన్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లు అప్‌గ్రేడ్ చేయాలని, ఓఆర్‌ఆర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆయన శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఫ్యూచర్‌సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని, అక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదన్నారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు. 2025-26లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరుగుతుందని, 2034-35 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాల దృష్ట్యా చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. రైల్వేలైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్‌ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ లైన్ల ఆధునీకికరణపైన దృష్టి సారించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ తీసుకురావాలని చెప్పారు. 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు రేవంత్‌రెడ్డి సూచించారు. ప్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపైన దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఫ్యూచర్ సీటీలో హై టెన్షన్ లైన్లు కూడా తరలించాలన్నారు.