కశ్మీర్‌లో మంగళవారం మధ్యాహ్నం మళ్లీ తీవ్రవాదుల తూటాలు పేలాయి. 30 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. కానీ మరో ఇద్దరిని తీవ్ర గాయాలతో అనంత నాగ్ ఆసుపత్రిలో చేర్పించారని అందువల్ల మృతుల సంఖ్య పెరగొచ్చునని అనుమానిస్తున్నారు. మరో ఇద్దరిని దగ్గరలోని వైద్య కేంద్రానికి తీసుకెళ్లారని వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్తున్నారు. కాల్పులు జరిపిన వారు తీవ్రవాదులు అంటున్నారు. దక్షిణ కశ్మీర్ లోని పెహల్గాం లోని బైసరం పచ్చిక బయళ్లలో ఒక రిసార్టు దగ్గర తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డా రంటున్నారు. ఈ ప్రాంతానికి అయితే కాలి నడకన వెళ్లాలి లేదా గుర్రం మీద వెళ్లాలి. పహల్గాం పర్యాటక కేంద్రం. అక్కడ స్వచ్ఛమైన జలాలతో కూడిన సరస్సులు, విశాలమైన పచ్చిక బయళ్లు ఉంటాయి. ప్రతి వేసవిలోనూ వేలాది మంది పర్యాటకులు పహల్గాం వస్తుంటారు. పైగా ఇది పర్యాటనం చురుకుగా సాగే సమయం. అదీగాక అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారు తమ పేర్లు నమోదు చేసుకునే సమయం ఇది. జులై మూడు నుంచి 38 రోజులపాటు అమర్ నాథ్ యాత్ర సాగుతుంది. ఈ దాడి దుర్మార్గమైందని షరా మామూలుగా ప్రకటనలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టెలిఫోన్లో మాట్లాడారట. అమిత్ షా కశ్మీర్ పయనమయ్యారట. ఆయన ఈ కిరాతకమైన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్తారో తెలియదు కానీ అధికారులతో సమీక్షా సమావేశం మాత్రం నిర్వహిస్తారు. కొద్ది రోజుల కిందే అమిత్ షా కశ్మీర్ లో పర్యటించి ఉన్నతాధికారులు, భద్రతా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఎలాంటి కట్టుదిట్టాలు చేయాలనుకున్నారో, ఏ మేరకు చేశారో తెలియదు కాని మంగళవారం ఘోరం మాత్రం జరిగిపోయింది. ఇటీవలి కాలంలో పౌరుల మీద జరిగిన తీవ్రవాద దాడుల్లో ఇది ఘోరమైందని చెప్తున్నారు. హోం మంత్రి అమిత్ షా దాడి చేసిన తీవ్రవాదులను వదిలిపెట్టేదే లేదంటున్నారు. పోలీసు డైరెక్టర్ జనరల్ తోనూ, ఇతర భద్రతా అధికారులతోనూ మాట్లాడానని ఆయన అన్నారు. సాధారణంగా కశ్మీరీలు పర్యాటకులకు మన:స్ఫూర్తిగా స్వాగతం పలుకుతారు. పర్యాటకులు పెరిగే రోజుల్లో ఘాతుకాలు జరగడం కేంద్ర ప్రభుత్వ నిర్వహణా లోపం కిందే లెక్క. పర్యాటకుల భద్రత నిస్సందేహంగా ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి కిరాతకాలు జరగనివ్వం అన్న గట్టి భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దాడులకు పాల్పడడం తీవ్రవాదుల పిరికితనానికి ప్రతీక లాంటి ఊకదంపుడు ప్రకటనలు పాలకుల అసమర్థతకు చిహ్నం.
తీవ్రవాదుల కుతంత్రాలు ఎన్నటికీ సఫలం కావు లాంటి రొడ్డ కొట్టుడు మాటలు సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ నోటి నుంచి రావడం ఆయన 56 అంగుళాల ఛాతీకి ప్రతీక కాదు. అసమర్థకు అది స్పష్టమైన సంకేతం. తీవ్రవాదులను శిక్షిస్తాం, బాధితులకు సహాయం చేస్తాం లాంటి మాటలేవీ ప్రభుత్వం సమర్థకు నిదర్శనమూ కాదు, బాధితులకు న్యాయం చేసినట్టు కాదు. తీవ్రవాదుల చేతిలో అమాయక జనం బలైపోతున్నప్పుడు వారికి న్యాయం కలగ జేయడం అంటే తీవ్రవాదుల మీద చర్య తీసుకోవడం మాత్రమే మార్గం కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగనివ్వబోం అని చెప్పడం కంటి తుడుపు మాటలకన్నా మించినవి ఏమీ కావు. ఈ కిరాతకమైన దాడుల వెనక ఉన్న వారిని వదిలిపెట్టబోం, సహించబోం లాంటి మాటలు ట్విట్టర్ ద్వారా పలికినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. తీవ్రవాదులు ప్రధానమంత్రి ట్విట్టర్ ను చూసి దాడులకు తెగబడరు. ఆ హెచ్చరికలను వారు పట్టించుకోరు. ఈ దాడుల వెనక ఉన్న వారిని శిక్షిస్తాం అని ప్రకటించడం మోదీ మాటలు ఎవరిని ఉద్దేశించినవో సులభంగానే గ్రహించవచ్చు. ‘‘లోపలికి చొరబడి దాడి చేస్తాం’’ లాంటి హుంకరిపులు కేవలం తాటాకు చప్పుళ్ల కిందే మిగిలిపోతున్నాయి. ప్రతి దాడినీ పాకిస్థాన్ కు అంటగట్టడం నిష్ప్రయోజనకారం. పాక్ పాత్ర ఉందని ప్రతి సారీ చెప్పడం, తగిన సాక్ష్యాధారం చూపించలేక పోవడం మన హుంకరింపులలోని డొల్ల తనానికి మాత్రమే ప్రతీక. తీవ్ర వాదులను ప్రోత్సహించడం పాకిస్థాన్ నైజం కావచ్చు. అందులో ఎంతో కొంత వాస్తవమూ ఉండొచ్చు. అలాంటి ప్రోత్సాహం ఇదివరకే అనేక సార్లు అనుభవంలోకి వచ్చినప్పుడు చేసిందేముంది కనక! ఈ తీవ్రవాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కశ్మీర్ కు వర్తించే 370వ అధికరణంవల్లే అక్కడ తీవ్రవాదం పెచ్చరిల్లిపోతోందని ఆ అధికరణాని రద్దు చేసే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆ అధికరణం రద్దు తరవాత తీవ్రవాదం గణనీయంగా తగ్గిన సూచనలెక్కడా లేవు. ఆ అధికరణాన్ని రద్దు చేసి ఆరేళ్లు కావొస్తోంది. తీవ్రవాద సంఘటనలు ఆగిపోయాయని చెప్పడానికి దాఖలాలే లేవు. పౌరుల మీద, భద్రతా దళాల మీద అడపాదడపా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 370వ అధికరణమే తీవ్రవాదానికి కారణం అయి ఉంటే గత ఆరేళ్ల కాలంలో తీవ్రవాదం తగ్గి ఉండాలిగదా! తీవ్రవాదుల మీద మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని మోదీ కన్నెర్ర చేసి చెప్తున్నారు. ఆ సంకల్పం నెరవేరిన దాఖలాలు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించే వారు లేరనుకుంటే ఎలా! పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో 40 మంది జవాన్లు అమరులైనప్పుడు ఆ సమాచారం అందించడానికి అప్పటి కశ్మీర్ గవర్నర్ ఎంత ప్రయత్నించినా మోదీ అందుబాటులోకి రాలేదు. అప్పుడు ఆయన జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో తిరుగుతూ ఏదో డాక్యుమెంటరీ షూటింగ్ లో ఉన్నారు. ప్రధానమంత్రి హోదాలో అలాంటి షూటింగుల్లో పాల్గొనకూడదని ఎక్కడా లేదు. కానీ మరి గవర్నర్ కు కూడా అందుబాటులో లేకపోవడం విశ్రాంతే ఎరుగను అని ప్రధాని చెప్పే మాటలకు విలువేముంటుంది? ఇప్పుడు మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ప్రజల ప్రాణాలపై ఆయనకు సుతి మెత్తని భావాలే ఉంటే ఆ పర్యటన తక్షణం రద్దు చేసుకుని తిరిగి రాలేదుగా. స్వయంగా పరిస్థితిని పరిశీలించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న నిదర్శనాలే లేవుగా! పహల్గాం కిరాతక దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద కఠినమైన చర్య తీసుకుంటాం, ఈ దాడికి పాల్పడిన వారు కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అమిత్ షా గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. అంటే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఎంతటి నిరుపయోగమైందో ఎన్నిసార్లు రుజువు కావాలి? కశ్మీర్ తీవ్రవాదుల ఆగడాలు పాకిస్థాన్ గుప్పెట్లో ఉన్నాయని, వారిని విడిచిపెట్టే సమస్య లేదని పదే పదే ప్రకటించడం చూస్తే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వానికి కొత్త ఆలోచనలే లేవనిపిస్తోంది.