ఆర్వీ రామారావ్
అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం 1936లోనే ఏర్పడినా తెలుగునాట ఈ సంఘం వ్యవస్థా రూపం ధరించడడం 1943 దాకా ఆగాల్సి వచ్చింది. అయితే తెలుగునాట అ.ర.సం. ఏర్పడడానికి ముందే సామాజిక రంగంలో కందుకూరి వీరేశ లింగం, సాహిత్య రంగంలో గురజాడ అప్పారావు, భాషా రంగంలో గిడుగురామ మూర్తి ఫ్యూడల్ భావజాలాన్ని గట్టిగా వ్యతిరేకించారు. 1900 నుంచి 1930 మధ్య కందుకూరి, గురజాడ, గిడుగు రామమూర్తి ఉదాత్త ఆశయాలు నిర్లక్ష్యానికి గురైనాయి. ఇంకో వైపు బ్రిటిష్ పాలనపై ప్రజల్లో కోపాగ్ని పెరిగి పోయింది.
తిరుగుబాట్లు, స్వాతంత్య్ర పోరాటం, కార్మికుల సమ్మెలు కాల్పనిక కవులను ఏ మాత్రం కదిలించలేక పోయాయి. అల్లూరి సీతారామరాజు నడిపిన మన్యం తిరుగుబాటు, ఆయన ఆత్మార్పణ రచయితలకు పట్టలేదు. కాల్పనిక కవులు ఊహాప్రేయసి చేలాంచలాల కొసగాలుల కోసం ఉవ్విళ్లూరుతూ ఉండిపోయారు. సామాజిక వాస్తవికతను పట్టించుకోలేదు. కాల్పనిక సాహిత్యానికి నిర్దిష్ట సామాజిక దృక్పథం, తాత్విక భూమిక లేనందువల్ల దాని సంస్థాగత నిర్మాణ రూపమైన ‘‘నవ్య సాహిత్య పరిషత్తు’’ నిర్వీర్యం అయిపోయింది. ఈ నిస్తేజాన్ని తొలగించడానికే 1943 ఫిబ్రవరి 13-14 తేదీల్లో తెనాలిలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం అవతరించింది.
సాహితీ రంగంలో ప్రగతిశీల భావజాలం ఉన్న రచనలు వెలువడిన తరవాతే అ.ర.సం. ఏర్పాటుకు అవకాశం కలిగింది. జాతీయ స్థాయిలో కూడా ఇలాగే జరిగింది. 1930లో తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ మార్గ నిర్దేశి అనడంలో సందేహమే లేదు. కాని ‘‘పులిపంజా’’కవి పురిపండా అప్పలస్వామి శ్రీశ్రీ కన్నా ముందే తెలుగు కవిత్వానికి కొత్త రూపు ఇచ్చారు. ఈ రకంగా పురిపండా కవితా రూపం మారిస్తే శ్రీశ్రీ సారంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. 1943లో ఆంధ్ర రాష్ట్ర అభుదయ రచయితల సంఘం వ్యవస్థాపక మహాసభ జరగడానికి ముందు ప్రగతిశీల భావాలు కలిగిన రచయితల తోడ్పాటుతో సన్నాహక సంఘ సమావేశం జరిగింది. చదలవాడ పిచ్చయ్య, శ్రీశ్రీ, తుమ్మల వెంకట రామయ్య, తాపీ మోహన్‌రావును సన్నాహక సంఘం కన్వీనర్లుగా నియమించారు. 1942 డిసెంబర్ 4న తెనాలిలో మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పరచడానికి ఒక సమావేశ జరిగింది. అప్పటికి ఇంకా అభ్యుదయ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం అన్న మాటలు రూపుదిద్దుకోలేదు. 1943 ఫిబ్రవరి 13,14 తేదీల్లో తెనాలిలో ఏర్పడిన ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభలో తాపీ ధర్మారావు అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సమావేశంలోనే అ.ర.సం. ప్రణాళిక రూపొందించారు.
హైదరాబాద్ సంస్థానంలో
తెనాలి మహాసభకు అప్పటి హైదరాబాద్ సంస్థానం నుంచి ప్రముఖ రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి హాజరయ్యారు. చర్చల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. అ.ర.సం. ప్రణాళిక ఆమోదించడంలో కూడా ఆళ్వార్ స్వామి చాలా క్రియాశీలంగా వ్యవహరించారు. హైదరాబాద్ సంస్థానంలో కూడా అ.ర.సం. నిర్మాణానికి ఇతర సాహితీ మిత్రులను సంప్రదించి కృషి చేస్తానని చెప్పారు. ఆళ్వార్ స్వామికి ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గంలో స్థానం కల్పించారు. తెనాలి నుంచి వచ్చిన తరవాత మీజాన్ పత్రికలో పని చేస్తున్న రాంభట్ల కృష్ణమూర్తి, సింగరాజు లింగమూర్తి, అడవి బాపిరాజు, విద్వాన్ విశ్వం తో చర్చించి అ.ర.సం. ఏర్పాటుకు ఆళ్వార్ స్వామి, భాస్కరభట్ల, ఇల్లిందల సరస్వతీ దేవి సంతకాలతో సమావేశం నోటీసు విడుదలైంది. రాం కోఠీలోని దివ్యజ్ఞాన సమాజం హాలులో సభ జరుగుతుం దని ఆ ప్రకటనలో ఉంది. అయితే ఈ సమావేశం జరిగినట్టు ఏ పత్రికలోనూ వార్త ప్రచురితమైన దాఖలాలు లేవు. అంటే ఆళ్వార్ స్వామి ప్రయత్నాలు ముందుకు సాగనట్టే. తరవాత కొంత కాలానికి దాశరథి, ఆళ్వార్ స్వామి, మరి కొందరు కలిసి తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు అవుతుందని ఆ నాటి ప్రముఖ రచయితలు వెల్లడిరచారు. ఈ సంఘం కొంతకాలం పని చేసింది. అంటే అ.ర.సం. 1970ల తొలినాళ్లలో సాధ్యం అయ్యేదాకా తెలంగాణాలో అభ్యుదయ రచయితల సంఘం ఊసే లేదు. కానీ అభ్యుదయ రచయితలు ఉన్నారు.