జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఏర్పాట్లకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 7000 కోట్లు కేటాయించిందట. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్ల కోసం ఈ మొత్తం కేటాయించారు. 2019లో జరిగిన కుంభ మేళా కోసం 3700 కోట్లు ఖర్చు పెట్టారట. అంటే ఈసారి దాదాపు రెట్టింపు మొత్తం కేటాయించారు. కానీ ప్రభుత్వానికి ఈ సంరంభం వల్ల రెండు నుంచి నాలుగు లక్షల కోట్ల ఆదాయం సమకూర్తుందట. లాభసాటి వ్యవహారమే. కానీ ఇన్ని ఏర్పాట్లు చేసినా, కుంభమేళాలో జరిగిన ప్రమాదాలలో ప్రాణ నష్టం ఎంతో మాత్రం కచ్చితంగా లెక్కలు చెప్పడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. యోగీ ప్రభుత్వం చెప్పే మృతుల సంఖ్య మూడు పదులు దాటడం లేదు. కానీ కనీసం కొన్ని వందల మంది మరణించారని అనేకమంది వాదిస్తున్నారు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి యోగీ ఆదిత్యనాథ్ రకరకాల ఎత్తులు వేస్తూ ఉండొచ్చు. అయినా మోదీ ప్రభుతానికే లెక్కలు డొక్కల మీద ఆట్టే ఆసక్తి లేదు. కరోనా సమయంలో మోదీ సర్కారుది ఇదే తంతు. నిరుద్యోగుల సంఖ్య గురించి ప్రభుత్వ అధీనంలోని సంస్థలు ఇచ్చిన లెక్కలనే మోదీ గంప కింద దాచేశారు. కుంభ మేళా పుణ్య స్నానాల్లో పవిత్ర స్నానాలు చేస్తున్న చోట సోమవారం జరిగిన అగ్ని ప్రమాదాన్ని కలిపితే మొత్తం ఏడు అగ్ని ప్రమాదాలు జరిగాయి. గుట్టు చప్పుడు కాకుండా శవాలను గంగా నదిలోకి విసిరేస్తూ ఉన్నారని రాజ్యసభ సభ్యురాలు జయ బాధురి గొంతు చించుకుని మరీ చెప్తున్నారు. మృతుల సంఖ్య కనీసం వందల్లో ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ పార్లమెంటు వెలుపలా లోపల ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుంభమేళా జరుగుతున్న చోట ఇప్పటికి కనీసం మూడు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగిందన్న వాస్తవాన్ని అంగీకరించడానికి కూడా యు.పి.ప్రభుత్వం సిద్ధంగా లేదు. శనివారం కుంభమేళాకు వెళ్తున్న సందర్భంగా దిల్లీలో విపరీతమైన తొక్కిసలాట జరిగింది. ఒకే సమయంలో ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్ రాజ్ స్పెషల్ రైలు గురించిన రైల్వే స్టేషన్ ప్రకటనవల్ల ఈ తొక్కిసలాట జరిగిందంటున్నారు. ఏ రైలు ఏ ప్లాట్ ఫాం మీద ఉందో తెలియక, రైలు తప్పి పోతుందేమోనన్న ఆత్రుతలో ప్రయాణికులు హడావుడిగా వెళ్లడానికి ప్రయత్నించినందువల్ల ఈ తొక్కిసలాట జరిగింది. ఇందులో 18 మంది మరణించారు. ఇది దిల్లీలో జరిగిన దుర్ఘటన కనక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దీన్ని కుంభమేళా మృతుల ఖాతాలో వేయరు. కుంభమేళాలో పుణ్యస్నానానికి ఈ సారి ఎక్కడ లేని సందడి ఉంది. గత 144 ఏళ్లల్లో ఇలాంటి కుంభమేళా లేదని జనం అనుకోవడమే కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేయడంవల్ల కూడా కుంభమేళాకు వెళ్లే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దిల్లీలో జరిగిన ప్రమాదంపై షరా మామూలుగా విచారణకు ఆదేశించారు. అసలు అలా జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవడంలో రైల్వే శాఖ ఘోరంగా విఫలమైంది. ఈ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల వారు అలవాటు ప్రకారం కోరుతున్నారు. ఇంతకన్నా ఘోరమైన ప్రమాదాలు జరిగినప్పుడే రైల్వే మంత్రులు చలించలేదు. ఇప్పటి రైల్వే మంత్రులను లాల్ బహదూర్ శాస్త్రి అంతటి అమాయకుడితో పోల్చి ప్రయోజనం ఏముంటుంది కనక! పరిపాలనలో నైతికత కనుమరుగై దశాబ్దాలు గడిచిపోయింది. కుంభ మేళాకు రండహో అని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారార్భాటానికి ప్రాముఖ్యత ఇచ్చిన ప్రభుత్వాల నుంచి నైతికత ఆశించడం అమాయకత్వమే. మొన్నీ మధ్యే కుంభ మేళా నుంచి తిరిగి వస్తున్న ఒక వ్యాను ప్రమాదానికి గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారైతే మిగతా వారు హైదరాబాద్ వాసులు. ఈ ఎనిమిది మంది కూడా కుంభ మేళా సందర్భంగా మృతి చెందిన వారి జాబితాలోకి రారు కాబోలు.
మౌని అమావాస్య రోజున జరిగిన భారీ తొక్కిసలాట తరవాత గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. రైల్వే శాఖదీ అదే తంతు. దుర్ఘటనలు జరగొచ్చు. కానీ పదే పదే ప్రాణ నష్టం జరగడం కేవలం దుర్ఘటన కింద కొట్టి పారేయదగిన అంశం కాదు. అది నిర్లక్ష్యం అవుతుంది. దీనికి బాధ్యులెవరో తేలాల్సిందే. అధికారంలో ఉన్న వారి నిర్లక్ష్యం కావొచ్చు. కానీ నైతికత లోపించిన దశలో నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలనడం వృథా ప్రయాసగానే మిగిలిపోతుంది. మౌని అమావాస్య నాడు జరిగిన దుర్ఘటన తరవాత దిల్లీలో మళ్లీ తొక్కిసలాట ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశమూ కనిపించడం లేదు. దిల్లీ దుర్ఘటన తరవాత ఆసుపత్రుల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఆప్తులను కూడా ఆసుపత్రి లోపలికి వెళ్లనివ్వడం లేదు. పత్రికా రచయితలను కూడా అడ్డుకుంటున్నారు. దిల్లీ సంఘటనను కూడా దుర్ఘటన కింద జమ కట్టడం ఘోర అన్యాయం. ఒక మహిళా పత్రికా విలేకరి సౌమ్య రాజ్‌ను నిర్బంధిస్తామని కూడా దిల్లీ పోలీసులు బెదిరించారు. ఆమె ఫోన్లో ఉన్న సమాచారమంతటినీ తొలగించాలని కూడా ఒత్తిడి చేశారు. జనవరి 29న కుంభ మేళాలో భయానకమైన తొక్కిసలాట జరిగినప్పుడు కూడా మీడియా వారిని వార్తా సేకరణ, ప్రసారం చేయకుండా అడ్డుకున్నారు. ఒక చోటకంటే ఎక్కువ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగిందన్న వాస్తవం బయటపడకుండా చేసేందుకే మీడియా నోరు నొక్కేశారు. దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట లాంటివి కుంభమేళా సందర్భంగా అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. జనం రైలెక్కడానికి నానా యాతనపడ్డారు. తలుపుల దగ్గర వేలాడుతూ, కిటికీల దగ్గర కూర్చుని వెళ్లిన ఉదంతాలున్నా శనివారం దిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరగడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్లాట్ ఫారాల మీద కనీవినీ ఎరగని జనసమ్మర్ధం వల్ల రిజర్వేషన్లు ఉన్న వారూ రైలెక్కలేక పోయారు. రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. అలహాబాద్ మీదుగా వెళ్లే రైళ్లన్ని కిక్కిరిసిన జనంతో కోళ్ల గంపల్లా మారిపోయాయి. కుంభ మేళాలో ఎంత మంది పవిత్ర స్నానం చేశారన్న లెక్కలు చెప్పడం యోగీ ఆదిత్యనాథ్‌కు వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత సులభం. కానీ దిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో మాత్రం రైల్వే మంత్రికీ లెక్క తెలియదు. రైల్వే శాఖ కూడా లెక్క చెప్పదు. రైళ్లలో ఎంత మంది ప్రయాణించడానికి వీలుంటుంది అన్న అంచనా లేకుండా టికెట్లు అమ్మేసి రైల్వే శాఖ డబ్బు చేసుకోవడం హీనాతిహీనమైన వ్యాపార లక్షణం. రైళ్లు జనం కోసం కాదు. రైల్వేల ఖజానా నింపడం కోసం.