Monday, February 3, 2025
Homeవిశ్లేషణదేశమంటే…

దేశమంటే…

చింతపట్ల సుదర్శన్‌

రాత్రంతా దోమల రొద విసిగించటంతో సరిగ్గా నిద్ర పట్టని డాగీకి తెల్లవారురaామున వీచే చల్లటి గాలికి మంచి నిద్ర పట్టేసింది. కానీ గ్రహచారం అనేది ఎప్పుడు ఏ పక్కనించి డొక్కలో తన్నేది ఎవరికి తెల్సు. ఉలిక్కిపడి లేచింది డాగీ. అదేం ‘మాయరోగమో’ కానీ కళ్లు సగం మూసి తల పైకెత్తి ఆలపిస్తున్నది డాంకీ. ఏవిటి బ్రో ఇప్పుడిప్పుడే నిద్ర పడుతున్నది నీ ఈ ‘రాగ అల్లరి’ దాన్ని ఫెడీమని తన్నేసింది అంది డాగీ విసుగూ, చిరాకూ, కోపమూ మిక్సీలో వేసి తిప్పి.
సారీ ‘బ్రో’ కాలమాన పరిస్థితులలాంటివి మరి. నిన్న నమిలిన న్యూస్‌ పేపర్‌ నన్ను రాగం ఎత్తుకునేలా చేస్తున్నది. రాజధానిలో ఎన్నికల కలకలం కలవరపెడ్తున్నది. ఎలుగెత్తి పాడమని బలవంతం చేస్తున్నది అన్నది డాంకీ. నీ గానమూ, రాగమూ నాకు అర్థం అయ్యేవి కాకపోయినా నిద్ర చెడగొట్టగల సామర్థ్యం వాటికున్నది కదా. ఇంకేం పంట, దుంపనాశనం అయింది. ఇంతకీ నీ గానానికి అర్థమేమిటో చెప్పు వింటా. నీ పాట కంటే మాట నయం కదా. అర్థమయిందిలే నీ భావం నా పాట ఆపి విషయం చెప్పమంటున్నావు. సరే! నా పాటకు అర్థం చెప్తా విను. ‘చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేను’ అని ఇద్దరు నాయకులు పాడుతున్న ‘విరోధ’ గీతమిది. ఎన్నికల వేళ జనానికి మసిపూసి మారేడు కాయలందించే రాగమది. నువ్వెంతిస్తే నేనంతిస్తా, నువ్వేదిస్తే నేనది ఇస్తా కాదు అంతకంటె ఎక్కువే ఇస్తా అని పోటీలు పడుతూ ఉచితాల సంఖ్య పెంచేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు హామీలిచ్చేస్తున్నారు. పేపర్‌ నిండా అవే సంగతులు మరి అంది డాంకీ. దేశ రాజధానిలో పాగా వెయ్యడానికి ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎముకలేని చేత్తో ఎన్ని దానాలయినా చేస్తామంటారు ఇది ఎప్పుడూ ఉన్నదే నన్నడిగితే వీటిని ఉచితాలనడం అనుచితం. లంచాలనడం సముచితం. వారెవ్వా! భలే చెప్పావు డాగీ. వ్యావహారిక భాషా జ్ఞానం బాగానే వంటిలో జొరబడిరది షభాస్‌ అని డాంకీ, డాగీని మెచ్చుకుంటుంటే అరుగు ఎక్కాడబ్బాయి నోట్లో బ్రష్షు నవుల్తూ వాకింగ్‌కు వచ్చినట్టున్నాడు.
రా ‘బ్రో’ రా. మన డాంకీ పాట వినాల్సింది. చవటాయను నేనూ ఉట్టి చవటాయను నేను. నీకంటే పెద్ద చవటాయను నేను అని ఎన్నికల ఉచిత వాగ్దానాల పోటీ వీరంగ గానం వినిపించి నా నిద్రను చిత్రవధ చేసింది డాంకీ అంది డాగీ. పాట బానే ఉంది కానీ వాళ్లు చవటాయలెందుకవుతారు. వాళ్ల అనుచిత ఉచితాల ఉచ్చులోపడి జనం చవటాయలవుతారు గాని. మోచేతికి తేనె రాసి నాకిస్తారు. ఆ కథ తెలీదా మీకు. కొంగ, తోడేలు పరస్పరం విందు చేసుకుని పస్తులుండాల్సి వచ్చిన కథ అన్నాడు అబ్బాయి. ఆ కథ తర్వాత తీరిగ్గా వింటాం కానీ పార్లమెంటులో గురజాడ గానం వినిపించిందన్నారు అంది డాంకీ. పాట ఏదైనా అర్థం వేరయిందిలే. ఇప్పుడు ఆ పాటను ‘దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే ఓట్లు రోయ్‌’ అని మార్చి పాడాలి అన్నాడు అబ్బాయి.
నువ్వన్నది నిజమే తంబీ. ఇప్పుడు మనుషులతో పనేమిటి మన నాయకులకి ఓట్లతో అవసరం. వాటిని కొల్లగొట్టటానికి ఎంతకైనా తెగిస్తారు ఎన్ని అబద్ధాలయినా ఆడేస్తారు. ఎన్ని వరాలయినా ప్రసాదిస్తారు అంది డాంకీ. మొన్న హల్వా వాసన మాత్రం వచ్చింది ఇప్పుడు ఆ హల్వా పంచిపెట్టారా అన్నా అంది డాగీ. ఇందాక అన్నానే ఆ విందు. అందులో కొంగ పళ్లెంలో పాయసం తాగలేదు. తోడేలు కూజాలో మూతి ఇరికించలేదు అలా చేశారు. ఉద్యోగాల ఊసు లేదు, పనికొచ్చే వాటి పత్తాలేదు. లక్షల కోట్లల్లో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఏమాత్రం బాగున్నట్టు లేదు. అన్నదాతల్ని పట్టించుకున్నదీ లేదు. విద్య, వైద్యం ఎప్పుడో బజారు సరుకైనవి. ఒక కవి అన్నట్టు ఇది ‘ముందు దగా వెనుక దగా’ కాదు ‘ముసుగు దగా’ అన్నమాట అన్నాడు అబ్బాయి.
ఇది ప్రతి ఏటా జరిగే భాగోతమే. అంకెల గారడీయే. పాపం జనానికి ఇవన్నీ ఆర్థం కావు. మెరిసేదంతా బంగారం కాదు అని తెల్సుకోడానికి టైం పడుతుంది అంది డాంకీ. అంకెలన్నీ బాగా నమిలి మింగావా లేదా. ‘స్టమక్‌ పెయిన్‌’ వచ్చే ఛాన్సు లేకపోలేదు అంది డాగీ తోక ఎగరేస్తూ. ఆ నొప్పి తప్పించుకోవడానికే కదా పాటందుకున్నా నువ్వు నన్ను స్వేచ్ఛగా పాడుకోనిస్తేగా అంది డాంకీ.
ఓట్ల కోసం తప్ప మనుషుల కోసం ప్రభుత్వాలు పనిచేయనంత కాలం ఇలాగే ఉంటుంది, హల్వా చేదుగా. ఉచితాల పేర ఓట్లు గుద్దించుకుని ఆ తర్వాత పన్నుల బాదుడు ఉంటుందేమో! హఠాత్తుగా ఉల్లి ధర పెరిగిందని, పెట్రోలు పేట్రేగిందని ఏడ్పు మొగాలు పెట్టటం మన జనాలకు అలవాటయి పోయింది అన్నాడు అబ్బాయి.
ఏది ఏమైనా చెప్పేవాడు` వినేవాడ్ని చెప్పనీయకుండా చెప్తూనే ఉంటాడు ‘ఊరట’ అంటాడు, గాల్లో మేడలు చూపుతాడు. కుప్పలుగా అప్పులు చేస్తాడు. ఆర్చేదీ తీర్చేదీ వాడు కాదు గద అంది డాగీ.
నాకిప్పుడర్థమైంది అంతా. పాటలో మాటలు మార్చాల్సిందే. ‘దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే ఓట్లు రోయ్‌’ అని పాడాల్సిందే అంది డాంకీ గొంతు సవరించుకుంటూ.
నేను బయలుదేరుతున్నా అన్నాడు అబ్బాయి అరుగు దిగుతూ. నువ్వు తప్పించుకుంటావు కానీ నాకు తప్పుతుందా అంది డాగీ గోడకుర్చీ వేస్తూ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు