ఆర్వీ రామారావ్
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర అంటే వామపక్ష ఉద్యమ చరిత్రే. మన దేశంలో స్వాతంత్య్రోద్యమ క్రమంలో కాంగ్రెస్ సైతం సామ్రాజ్యవాద వైఖరి అనుసరించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రభావం చాలా బలంగా ఉండేది. స్వాతంత్య్రోద్యమం పొడవునా సీపీఐ సామ్రాజ్యవాద, వలసవాద వ్యతిరేక విధానాలు అనుసరించడంలోనే ఎక్కువ దృష్టి పెట్టింది. స్వాతంత్య్రానికి ముందే సీపీఐ ఈ వైఖరి అనుసరిస్తున్న సమయంలోనే వలసవాద పాలన కొనసాగుతున్న దేశాలలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. వలసవాద వ్యతిరేక పోరాటంలో సీపీఐ కచ్చితమైన సామ్రాజ్యవాద వ్యతిరేక, వలసవాద వ్యతిరేక విధానం అనుసరించేది. ఆ సమయంలో ఈ వైఖరికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. కమ్యూనిస్టు ఉద్యమం అడుగుజాడలు చాలా చోట్ల కనిపించేవి. ఆ దశలో రైతులను, కార్మికవర్గాన్ని సమీకరించడంలో సీపీఐ కీలక పాత్ర పోషించింది. ప్రజలను విప్లవోన్ముఖులుగా మలిచింది. తెలంగాణాలో నిజాం నిరంకుశత్వాన్ని పడదోయడానికి సాగిన సాయుధ పోరాటం, బెంగాల్‌లో చైతన్యవంతమైన రైతు ఉద్యమాలను నిర్మించడం వల్లే వామపక్ష పార్టీలు బలం పుంజుకున్నాయి. అదే పద్ధతిలో మహారాష్ట్రలోని థానేలో సీపీఐకి అనుబంధంగా ఉన్న రైతు సంఘం నిర్ణయాత్మక పాత్ర పోషించింది. త్రిపురలో గణముక్తి పరిషత్ పోరాటాలు సైతం చెప్పుకోదగ్గవే.
1930లు, 1940ల్లో సీపీఐ ఉధృతంగా పోరాటం కొనసాగించినప్పటికీ ఆ సమయంలోనూ, ఆ తరవాత 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడిన తరవాత వామపక్ష ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిందన్నది వాస్తవం. ఈ ప్రభావం మౌలికంగా రైతులకు, గిరిజనులకు, ముస్లింలకు మాత్రమే పరిమితమైంది. ఈ వర్గాల మద్దతు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చినందువల్లే ఇప్పుడు వామపక్ష పార్టీలు బలహీనంగా కనిపించడానికి ప్రధాన కారణం అయింది. అయినప్పటికీ శ్రమ జీవుల గొంతుకగా కమ్యూనిస్టులు ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ జనం మద్దతు సమకూ రింది. రైతుల సమస్యల మీద, ఆశావర్కర్ల ప్రయోజనాల పరిరక్షణకు సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు కొనసాగిస్తున్న పోరాటానికి మెచ్చదగిన ప్రోత్సాహమే కనిపిస్తోంది. సంఖ్యా బలం బలహీన పడ్డప్పటికీ సీపీఐ పార్లమెంటులో నిరంతరం ప్రజాసమస్యలను లేవనెత్తుతూనే ఉంది. 1980లలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బోఫోర్స్ కుంభకోణం బయట పడ్డప్పుడు ప్రతిపక్షాలను ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు వామపక్ష పార్టీలు గణనీయమైన కృషి చేశాయి. అందులో సీపీఐ పాత్ర చెప్పుకోదగ్గది. 1990లలో జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడంలో సీపీఐ ఎన్నదగిన పాత్ర పోషించింది. 2004లో పార్లమెంట్‌లో ఏ పార్టీకీ నిర్దిష్టమైన మెజారిటీ రాని దశలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఏకం చేయడానికి సీపీఐ శక్తి మేరకు కృషి చేసింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడూ సీపీఐ నిర్ణాయక పాత్ర పోషించింది. సీపీఐ, ఇతర వామపక్షాల ఒత్తిడి కారణంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాలు కొన్ని సందర్భాల లోనైనా ప్రజానుకూల విధానాలు అనుసరించక తప్పలేదు. వామపక్షాలకు పార్లమెంటరీ రాజకీయాలలో ప్రాబల్యం తగ్గుతుండడంవల్ల దుష్ఫలితాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మతోన్మాద ప్రమాదాన్ని గురించి ముందు నుంచి హెచ్చరిస్తున్నది సీపీఐ, ఇతర వామపక్షాలు మాత్రమే. ఆ ప్రమాదం 2014 నుంచే మనం ఎదుర్కుంటున్నాం.